Site icon NTV Telugu

Revanth Komati Episode: ఇద్దరు మిత్రుల కలయిక

ఉప్పు-నిప్పుగా ఉన్న ఆ ఇద్దరు నాయకులు ఆత్మీయంగా పలకరించుకున్నారు. గంటల తరబడి మాట్లాడేసుకున్నారు కూడా. ఇంతకీ వాళ్లేం మాట్లాడుకున్నారు? చర్చకు వచ్చిన అంశాలేంటి? పార్టీలో చాలా ఘర్షణల తర్వాత కలిసిన ఇద్దరు నాయకులు.. మనసులో మాట బయట పెట్టేసుకున్నారా?

పార్టీ వ్యవహారాలపై ఏం మాట్లాడుకున్నారు?
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఒక సంచలనం. రెండున్నర గంటలకుపైగా జరిగిన భేటీలో ఇద్దరి మధ్య చర్చకు వచ్చిన అంశాలేంటనే ఆసక్తి పెరుగుతోంది. రాష్ట్ర రాజకీయాలపై ఎలాగూ చర్చించే ఉంటారు. కానీ.. కాంగ్రెస్‌ వ్యవహారాలపై ఏం మాట్లాడుకున్నారన్నది ఉత్కంఠగా మారింది.

కోమటిరెడ్డి నిర్వహించే భారీ సభపై చర్చ
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ యాక్షన్‌ ప్లాన్‌లో భాగంగా పాదయాత్రల కంటే బస్సుయాత్ర లేదా.. బైక్‌ యాత్ర చేసే అంశాలపై కోమటిరెడ్డి, రేవంత్‌ల మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే కీలక నాయకులంతా ఒకే తాటి మీదకు వచ్చారనే సంకేతాలు పంపాలన్నది మీటింగ్‌ ప్లాన్‌. తన నియోజకవర్గంలో భారీ సభకు కోమటిరెడ్డి ప్లాన్‌ చేస్తున్నారు. రాహుల్‌ గాంధీని ఆహ్వానించి భువనగిరి లేదా జనగామలో ఎక్కడో ఒకచోట భారీ సభ పెట్టే ఆలోచనలో ఉన్నారట. ఈ అంశంపై ఇద్దరు నేతల మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం.

మునుగోడు, నల్లగొండ, నకిరేకల్‌ సీట్లపై చర్చ
కోమటిరెడ్డి వెంకటరెడ్డి AICC ప్రధాన కార్యదర్శి పదవి ఆశిస్తున్నారు. దీనికి తెలంగాణ పీసీసీ నుంచి సూచనలు కూడా ముఖ్యమే. ఆ అంశం కూడా కోమటిరెడ్డి.. రేవంత్‌ మధ్య చర్చకు వచ్చిందట. నల్గొండ జిల్లా రాజకీయల్లో మునుగోడు.. నల్గొండ.. నకిరేకల్‌ నియోజకవర్గాలు కోమటిరెడ్డి బ్రదర్స్ చేతిలోనే ఉన్నాయి. ఈ సెగ్మెంట్లపైనా చర్చించినట్టు చెబుతున్నారు. ఈ భేటీకి సూర్యాపేట టికెట్ ఆశిస్తున్న పటేల్ రమేష్ రెడ్డి కూడా వెళ్లారు. ఆయన రేవంత్‌కి సన్నిహితుడు. సూర్యాపేట టికెట్ కోసం చర్చలు జరిగాయట.

సూర్యాపేట, తుంగతుర్తి, పాలేరుపై క్లారిటీ రావాలా?
వాస్తవానికి సూర్యాపేట సీటు మాజీ మంత్రి దామోదర్‌రెడ్డిది. దామోదర్‌రెడ్డి తుంగతుర్తి సీటుపై కూడా పీటముడి వేస్తున్నారు. సూర్యాపేటలో పటేల్ రమేష్ రెడ్డి.. తుంగతుర్తిలో అద్దంకి దయాకర్‌ల వ్యవహారం చర్చకు వచ్చిందట. దామోదర్‌రెడ్డిని గతంలోనే ఖమ్మం జిల్లాలోని పాలేరు వెళ్లాలని సూచన వచ్చింది. కానీ అది కొలిక్కి రాలేదు. వచ్చే ఎన్నికల నాటికి సూర్యాపేట.. తుంగతుర్తి.. పాలేరు మీద క్లారిటీ రావాల్సి ఉంది. వీటిల్లో సూర్యాపేట.. తుంగతుర్తిలో కోమటిరెడ్డి సోదరులకు బలం ఉంది. ఆ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్‌ నేతలు కూడా రావడంతో వాటిపై గట్టిగానే చర్చ సాగిందట.

20-30 టికెట్లు తన వారికి ఇప్పించే ప్లాన్‌లో కోమటిరెడ్డి
ఉమ్మడి పాలమూరు జిల్లాలో జడ్చర్ల టికెట్‌ను కోమటిరెడ్డి సన్నిహితుడు అనిరుద్‌రెడ్డి ఆశిస్తున్నారు. గడిచిన ఎన్నికల్లో అక్కడి నుండి.. మల్లు రవి పోటీ చేశారు. వచ్చే ఎన్నికల్లో మల్లు రవిని కంటోన్మెంట్‌కు పంపిస్తారనే టాక్‌ ఉంది. దీంతో రేవంత్.. ఎర్ర శేఖర్‌ను తెరమీదకు తెచ్చారు. కానీ ఎర్ర శేఖర్‌ కంటే ముందు నుంచే జడ్చర్లలో అనిరుద్‌రెడ్డి పని చేసుకుంటున్నారు. పైగా రేవంత్‌, కోమటిరెడ్డి భేటీకి అనిరుధ్‌రెడ్డి కూడా వచ్చారు. వచ్చే ఎన్నికల్లో కనీసం 20 నుంచి 30 మధ్య టికెట్లు తన వారికి ఇప్పించే ప్లాన్‌లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నట్టు సమాచారం. అందులో జడ్చర్ల కూడా ఉందట. అయితే ఎర్ర శేఖర్‌ను కాంగ్రెస్‌లోకి తీసుకుంటే సామాజిక కోణంలో ఆ ప్రభావం జిల్లా అంతా ఉంటుందనేది రేవంత్‌ లెక్క. అవసరమైతే ఎర్ర శేఖర్‌ను మహబూబ్‌నగర్‌లోనైనా పోటీ చేయించొచ్చనే వాదన పార్టీలో ఉంది. ఈ అంశం కూడా రేవంత్‌, కోమటిరెడ్డి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్‌లో కలిసి పనిచేయాలనే అజెండా..!
సీట్ల లెక్కల పంచాయితీ ఎలా ఉన్నా.. ప్రస్తుతం కాంగ్రెస్‌లో అందరూ కలిసి పనిచేయాలనే అజెండాతో రేవంత్‌, కోమటిరెడ్డి మీటింగ్‌ సాగినట్టు ప్రచారం జరుగుతోంది. మరి.. ఈ కలయిక కాంగ్రెస్‌కు కొత్త బలాన్ని ఇస్తుందో లేదో కాలమే చెప్పాలి.

Exit mobile version