అక్కడ పాత పంచాయితీలు కొత్తగా తెరమీదకు వచ్చాయా? మినిస్టర్ ఎంట్రీతో ఎమ్మెల్యేకు ట్రబుల్స్ రెట్టింపు అయ్యాయా? ప్రొటోకాల్‌తో పనులు చక్కబెడుతోంది ఎవరు? అంతా లైట్ తీసుకుంటున్నారని ఎవరు ఫీలవుతున్నారు? లెట్స్ వాచ్..!
కొద్దిరోజులుగా సైలెంట్‌గా ఉన్న రాజోలు రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. పదేళ్లనాటి ఆధిపత్యపోరు.. సరికొత్తగా తెరమీదకు రావడంతో అధికారపార్టీ వర్గాల్లో ఒక్కటే చర్చ జరుగుతోంది. మంత్రి వేణుగోపాల కృష్ణ వర్సెస్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నట్టుగా రాజకీయపోరు మారడంతో మరింత ఆసక్తి కలిగిస్తోందట.
గత ఎన్నికల్లో రాజోలులో జనసేన నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక వరప్రసాద్ వైసీపీకి జైకొట్టేశారు. కొత్తలో బాగానే ఉన్నా.. వైసీపీ నుంచి పోటీచేసి ఓడిన బొంతు రాజేశ్వరరావుతో విభేదాలు వచ్చాయి. తర్వాత రాజోలు వైసీపీ ఇంఛార్జ్‌గా వచ్చిన అమ్మాజీ తోనూ రాపాకకు పొసగలేదు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచిన ఉదంతాలు అనేకం. కోల్డ్‌వార్ పీక్స్‌కు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అమ్మాజీని ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్‌ను చేశాక.. రాజోలులో రాపాకకు ఫుల్ పవర్స్ ఇచ్చారు వైసీపీ పెద్దలు. అప్పటి నుంచి అధికారపార్టీ ఎమ్మెల్యేగా చెలమాణి అయ్యేందుకు రాపాక వేయని ఎత్తులు.. జిత్తులు లేవు. కానీ.. సీన్ మళ్లీ మొదటికి వచ్చిందని టాక్. రాజోలులో రాపాకకు చెక్ పడిందని చెవులు కొరుక్కుంటున్నారట పార్టీ కేడర్. మంత్రి వేణుగోపాల్ స్పీడ్‌తో అంతా మారిపోయిందట.
మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ సొంతూరు రాజోలు నియోజకవర్గంలోని అడవిపాలెం. 2001, 2006లో రాజోలు కాంగ్రెస్ జడ్పీటీసీగా గెలిచారు. వైఎస్ ఆశీసులతో జడ్పీ ఛైర్మన్‌గానూ చేశారు. 2009 నుంచి ఇదే రాపాక వరప్రసాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రాజోలులో గెలిచారు. ఆ సమయంలోనే జడ్పీ ఛైర్మన్‌గా వేణు.. ఎమ్మెల్యే రాపాకల మధ్య రాజోలులో ఆధిపత్యపోరు నడిచేదని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడూ అదే జరుగుతోందట. కాకపోతే వేణు మంత్రి కావడంతో ప్రొటోకాల్ పవర్స్‌తో గట్టిగానే పెత్తనం చేస్తున్నారట.
రాజోలు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కావడంతో వేణు ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం లేక.. 2014లో కాకినాడ రూరల్, 2019లో రామచంద్రాపురంలో పోటీ చేశారు. 2019లో గెలిచి అనూహ్య పరిణామాల మధ్య మంత్రిగా ఛాన్స్ దక్కించుకున్నారు. ఇందుకు జిల్లాలో సామాజిక సమీకరణాలు ఆయనకు కలిసి వచ్చాయి. ప్రస్తుతం పాత పరిచయాలు.. రాజకీయ సమీకరణాలతో రాజోలులో పట్టుసాధించేందుకు వేణు పావులు కదుపుతున్నారట. రాజోలులోని అధికారులను వివిధ పనులపై ఆదేశాలు ఇస్తున్నట్టు కేడర్ కథలు కథలుగా చెప్పుకొంటోంది. తన మనుషులతో ప్రత్యేకంగా ఒకవర్గాన్ని మెయింటైన్ చేస్తున్నారట మంత్రి. ఈ విషయంపై విమర్శలు రావడంతో.. దానికి గట్టిగానే రిప్లయ్ ఇస్తున్నారట మినిస్టర్. తాను మంత్రిని.. ఇదే జిల్లాకు చెందిన నాయకుడిని.. జోక్యం చేసుకుంటే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారట వేణు. అయితే ఈ వ్యవహారం ఎమ్మెల్యే రాపాకకు మింగుడు పడటం లేదట. వేణు పవర్ సెంటర్‌గా మారడంతో పార్టీ కేడర్ ఎమ్మెల్యేను లైట్ తీసుకుంటోందట. కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యే దృష్టికి రాకుండానే పనులు చక్కబెట్టేస్తున్నారట. దీంతో పైకి చెప్పుకోలేక.. జరుగుతున్న పరిణామాలను చూసి జీర్ణించుకోలేక అనుచరుల దగ్గర చెప్పి వాపోతున్నారట ఎమ్మెల్యే. మరి.. ఈ రాజోలు రచ్చ రానున్న రోజుల్లో ఎన్నెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.