ఆయనో నియోజకవర్గ నేత. సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తారు. పార్టీ కోసం అంతే తీవ్రంగా పనిచేస్తారు. కానీ.. ఎన్నికల నాటికి సీన్ రివర్స్ అవుతుంది. ఆయన్ను పక్కన పెట్టి.. పక్కనున్న వారికి సీటు ఇస్తారు. ఇలా ఒకసారి జరిగితే యాధృచ్చికమో.. దురదృష్టమో అవుతుంది. పదే పదే అదే జరుగుతుంటే.. పాపం అనుకోవాల్సిందే. ఇంతకీ ఎవరా నేత? ఏమా కథ?
పర్చూరులో రామనాథంబాబుకు రెండోసారీ నిరాశేనా?
రావి రామనాథంబాబు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్. వచ్చే ఎన్నికల్లో పర్చూరులో పోటీ చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. నియోజకవర్గంలో కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. సీటుపై వందకి వంద శాతం నమ్మకం పెట్టుకొన్నారు. కానీ… సీన్ మారింది. వరుసగా ఓడిపోతున్న ఆ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరేయాలంటే రామానాథంబాబును మించిన నేత కావాలని పెద్దలు భావించారట. అంతే.. బాబును పక్కన పెట్టి ఇంకో నేతను ఎంట్రీ చేయించారు. దీంతో సీటుపై బోలెడు ఆశలు పెట్టుకున్న బాబుకు నిరాశే మిగిలిందట. ఇది మొదటిసారైతే పెద్దగా ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. రెండోసారి జరిగింది. అదీ వరుసగా..!
2019లో దగ్గుబాటి కోసం సీటు త్యాగం
గత ఎన్నికల ముందు వరకు పర్చూరు ఇంఛార్జ్‌గా రామానాథంబాబు ఉన్నారు. ఆయనకే సీటు అని అంతా అనుకుంటున్నప్పుడు హఠాత్తుగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు సీన్‌లోకి వచ్చారు. బాబును పక్కన పెట్టి.. దగ్గుబాటికి సీటు ఇచ్చారు. దీంతో మనస్తాపం చెందిన రామనాథంబాబు టీడీపీలో చేరిపోయారు. వైసీపీ అధికారంలోకి రావడంతో తిరిగి ఫ్యాన్ గూటికి వచ్చేశారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసిన గొట్టిపాటి భరత్ ఓడిపోయి.. పార్టీకి టచ్‌లో లేకుండా పోవడంతో… పార్టీ పగ్గాలను తిరిగి రావికే అప్పగించారు. అప్పటి నుంచి 2019 ఎన్నికలే లక్ష్యంగా పనిచేసుకున్నారు. 2019లో దగ్గుబాటి రూపంలో షాక్ తగిలింది. ఆ ఎన్నికల్లో ఓడిన దగ్గుబాటి సైతం పార్టీకి దూరం కావడంతో రామనాథంబాబుకు మళ్లీ ఇంఛార్జ్‌గా పగ్గాలు ఇచ్చింది అధిష్ఠానం. దాంతో 2024 ఎన్నికలపై గురిపెట్టి రామనాథంబాబు పనిచేసుకుంటుంటే.. మళ్లీ పాత సీన్ రిపీట్ అయ్యేలా ఉంది. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు పర్చూరు టికెట్ ఇవ్వాలని వైసీపీ అధిష్ఠానం నిర్ణయించిందట. దాంతో రామనాథంబాబు త్యాగరాజు కాక తప్పడం లేదట.
ఆమంచితో కలిసి రావాలని పార్టీ పెద్దలు రావికి చెప్పారా?
పర్చూరులో పాగా కోసం వైసీపీ వేస్తున్న ఎత్తుగడలు ఎలా ఉన్నా.. బలి అవుతోంది మాత్రం ఒక్కరే అనే చర్చ పార్టీ వర్గాల్లో ఉందట. వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏపీలోనే అందరి కంటే ధీటుగా నిర్వహించి సీఎం జగన్ వద్ద మంచి మార్కులే తెచ్చుకున్నారు రామనాథంబాబు. దాంతో ఇంచార్జ్ విషయంలో వస్తున్న ప్రచారాలు నమ్మవద్దని తన మద్దతుదారులకు గట్టిగానే చెప్పారట. ఇంతలో సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా మార్టూరు, పర్చూరు, ఇంకొల్లు ప్రాంతాల్లో ఆమంచి వర్గీయులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇంచార్జ్ విషయంలో స్పష్టత తీసుకునేందుకు జరుగుతున్న పరిణామాలను అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లారట రామనాధంబాబు. కార్యకర్తలు తననే ఇంఛార్జ్‌గా కొనసాగాలని కోరుతున్నారని ఆయన కూడా చెప్పారట. అయితే పర్చూరు ఇంచార్జ్ విషయం ఫైనల్ చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని, మాజీ ఎమ్మెల్యే ఆమంచితోపాటు తమ వద్దకు కలసి రావాలని పార్టీ పెద్దలు సూచించిట్టు సమాచారం.
ఎన్నికలు వచ్చే సరికి నిరాశ తప్పడం లేదా?
గత ఎన్నికల్లో ఓడి తిరిగి పుంజుకోని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు వైసీపీ గట్టిగా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే సీఎం జగన్.. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ను పర్చూరులో పోటీ చేసేందుకు సిద్దంగా ఉండాలని హింట్ వచ్చిందట. అయితే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేయాలని చూస్తున్న రామనాధం బాబుకు పార్టీ అధిష్టానం నిర్ణయంతో మరోసారి నిరాశే మిగిలేలా ఉందని ఆయన అనుచరులు భావిస్తున్నారట. మొత్తానికి ఎన్నికల ముందు వరకూ పనిచేయడం.. తీరా ఎన్నికలు వచ్చే సరికల్లా ఎవరో కొత్త నేత సీటును తన్నుకు పోవటం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట రామనాథంబాబు. మార్పునకు రామనాథంబాబు సర్దుకుంటారా.. లేక 2014లో చేసినట్టు చేస్తారో చూడాలి.
