NTV Telugu Site icon

నిర్మల్‌ సభలో ఈటలకు ప్రాధాన్యం!

నిర్మల్‌ సభలో బీజేపీ అగ్రనేత అమిత్‌ షా.. వైరిపక్షాలకు చురకలు వేశారా? తెలంగాణ కమలనాథులు ఆశించింది జరిగిందా? కాషాయ శ్రేణుల్లో ఉత్సాహం నింపారా లేదా? షా పర్యటనపై బీజేపీ శ్రేణుల్లో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్‌ వాచ్‌!

అమిత్‌ షా మాటలు చురుకు పుట్టించాయా?

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్‌లో ఏర్పాటు చేసిన సభకు వచ్చారు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా. ఈ కార్యక్రమానికి భారీగా జనాన్ని సమీకరించేందుకు బీజేపీ నేతలు శ్రమించారు. షా వేదికపై ఉండగానే రాష్ట్ర బీజేపీ నేతలు తమ ప్రసంగాలలో వేడి.. వాడి తగ్గకుండా జాగ్రత్త పడ్డారు. నిర్మల్‌ సభలో అమిత్ షా ఏం మాట్లాడతారు? టీఆర్ఎస్‌పై ఆయన ఎలా విరుచుకుపడతారు అని కార్యకర్తలతోపాటు నాయకులు ఎదురు చూశారు. షా వచ్చారు.. వెళ్లారు. మరి.. ఆయన మాటలు చురుకు పుట్టించాయా? వైరిపక్షాలకు చురకలు వేశారా? అనేది చర్చగా మారింది.

ఊహించిన స్థాయిలో అమిత్‌ షా విమర్శలు లేవా?

బీజేపీ అధికారంలోకి వస్తే.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని సభా వేదికగా పార్టీ నేతలు ప్రకటించారు. ఇక అమిత్‌ షా ప్రసంగంపై బీజేపీ శ్రేణుల్లో సంతృప్తి వ్యక్తమవుతున్నా.. ఆయన ఇంకా గట్టిగా మాట్లాడితే బాగుండేదనే అభిప్రాయం నెలకొందట. సీఎం కేసీఆర్‌పైన, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపైనా ఊహించిన స్థాయిలో షా విమర్శలు చేయలేదని అనుకుంటున్నారట. గతంలో వివిధ సందర్భాలలో తెలంగాణకు వచ్చిన అమిత్‌ షా.. ఎంత ఘాటుగా రాష్ట్ర ప్రభుత్వంపైన, సీఎం కేసీఆర్‌పైన విరుచుకుపడ్డారో ఆ రేంజ్‌లో నిర్మల్‌ ప్రసంగం లేదన్నది పార్టీ వర్గాల అభిప్రాయం.

నిర్మల్‌ సభలో ఈటలకు ప్రాధాన్యం!
సంజయ్‌ సంగ్రామ యాత్ర ప్రస్తావన!

టీఆర్ఎస్‌, బీజేపీకి ఎలాంటి రాజకీయ బంధుత్వం లేదని అమిత్‌ షా మాటలతో క్లారిటీ వచ్చిందంటున్నాయి పార్టీ వర్గాలు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ని బీజేపీ పట్టించుకోవడం లేదనే అనుమానం నిర్మల్‌ సభతో పటాపంచలైందని అనుకుంటున్నారు. ఈటలకు సభలో చాలా ప్రాధాన్యం ఇచ్చారని టాక్‌. హుజురాబాద్‌ ఉపఎన్నికకు సిద్ధమైన ఈటలలోనూ విశ్వాసం పెరిగిందని చెబుతున్నారు. హుజూరాబాద్ ఎన్నికల అంశాన్ని అమిత్ షా ప్రస్తావించారు. సీఎం కేసీఆర్ డబ్బులు పెట్టి ఎన్నికలు గెలవాలని అనుకుంటున్నారని ఆరోపించారు. ఉపఎన్నికలో ఈటలను గెలిపించాలని కోరారు షా. ఇక రాష్ట్ర బీజేపీ చీఫ్‌ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతంగా నడుస్తోందని.. స్పందన బాగుందని చెప్పడం ద్వారా పార్టీ శ్రేణులను ఉత్సాహ పరిచారు అమిత్ షా.

ఎంఐఎంపై మరోసారి షా గురి!

సీఎం కేసీఆర్, కాంగ్రెస్‌ నేతలు MIMకు భయపడతారని.. బీజేపీ అలా కాదని మరోసారి గట్టిగా చెప్పారు అమిత్ షా. వచ్చే ఎన్నికల్లో MIMని ఓడించాలని కూడా ఆయన పిలుపిచ్చారు. దాంతో బీజేపీ అజెండాను మరోసారి స్పష్టం చేసినట్టు అయిందని కేడర్‌ భావిస్తోంది. అభివృద్ధితోపాటు హిందుత్వ అజెండాను పార్టీ వీడలేని షా మాటల్లో కనిపించింది. కాకపోతే.. అమిత్ షా ప్రసంగంలో మరిన్ని చమక్కులు.. చురకలు ఆశించారు కమలనాథులు. అదొక్కటే లోటుగా చర్చించుకుంటోందట కాషాయ శిబిరం.