Site icon NTV Telugu

Prakasam District Politics : ఆ నియోజకవర్గ వైసీపీలో పరిస్థితులు ఎప్పుడు అయోమయమేనా..?

Bapatla Ycp

Bapatla Ycp

Prakasam District Politics :  ఆ నియోజకవర్గ వైసీపీలో పరిస్థితులు ఎప్పుడూ అయోమయమేనా? ఇంఛార్జ్‌గా ఉన్న నేత డైలమాలో ఉన్నారా? పదవి ఉంటుందో లేదో ఆయనకు అర్థం కావడం లేదా? మరో నాయకుడికి పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరిగినా.. ఎక్కడ పీటముడి పడింది? ఇంతకీ ఎవరా నాయకుడు? ఏమా నియోజకవర్గం?

బాపట్ల జిల్లాలోని పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు రావి రామనాథం బాబు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీచేసిన గొట్టిపాటి భరత్ కుమార్ ఓడిపోవడం.. అప్పట్లో అద్దంకిలో వైసీపీ నుంచి గెలిచిన గొట్టిపాటి రవికుమార్‌ టీడీపీలోకి వెళ్లడంతో భరత్‌ సైలెంట్‌ అయ్యారు. దాంతో వైసీపీ అధిష్ఠానం రావి రామనాథం బాబును పర్చూరు ఇంఛార్జిగా నియమించింది. 2019 ఎన్నికల్లో చివరి నిమిషంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ టికెట్‌ ఇచ్చారు. దాంతో అలిగిన రామనాథంబాబు టీడీపీలో చేరారు. ఆ ఎన్నికలు ముగిసి ఏడాది గడవక ముందే ఏర్పడిన రాజకీయ పరిస్థితుల్లో దగ్గుబాటి సైలెంట్ అయ్యారు. టీడీపీకి గుడ్‌బై చెప్పి రావి తిరిగి వైసీపీలోకి రావడం.. ఇంఛార్జ్‌ కావడం చకచకా జరిగిపోయింది. కానీ.. స్థానిక వైసీపీ నేతలు మాత్రం ఆయన్ని ఓన్‌ చేసుకోవడం లేదు. టీడీపీలో చేరి ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి పెత్తనం ఏంటనేది వారి ప్రశ్న. ఈ వివాదాలు శ్రుతిమించడంతో.. వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందని అభిప్రాయ పడిన వైసీపీ అధిష్ఠానం పర్చూరు ఇంఛార్జ్‌ను మార్చాలనే నిర్ణయానికి వచ్చింది. ఇదే మరోసారి పర్చూరు వైసీపీని డైలమాలో పడేసింది.

సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి కుమారుడు గాదె మధుసూదన్‌రెడ్డిని ఇంఛార్జ్‌గా నియమించాలని అనుకున్నారట. అయితే సామాజిక సమీకరణాల కూర్పులో భాగంగా.. కాపులకు ఆ సీటును కేటాయించాలని భావించారట. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ను పర్చూరు నుంచి పోటీ చేయాలని కోరడం.. ఆయన తిరస్కరించడం.. తర్వాత కొన్ని షరతులతో బాధ్యతలు తీసుకునేందుకు ముందు రావడం జరిగిందని టాక్‌. ఈ పరిణామాలు రామనాథంబాబుకు రుచించలేదని సమాచారం. అధిష్ఠానం ఏదో ఒక ప్రకటన చేసేవరకు కామ్‌గా పార్టీ పనిచేసుకుంటే మంచిదని నిర్ణయించారు రామనాథంబాబు. పార్టీ కోసం తిరుమలకు పాదయాత్ర చేశారు. గడప గడపకు మన ప్రభుత్వంలో చురుకుగా పాల్గొంటున్నారు. అయితే పర్చూరు ప్లీనరీ విషయంలో అనుకున్నంతగా సక్సెస్‌ కాలేదట.

ఇటీవల కాలంలో నియోజకవర్గాలపై పూర్తిస్థాయిలో వైసీపీ అధిష్ఠానం ఫోకస్‌ పెడుతోంది. ఆ క్రమంలో పర్చూరు సమస్యను కొలిక్కి తెచ్చి గాడిలో పెట్టాలని చూస్తున్నారట. పర్చూరు ఇంఛార్జ్‌గా ఎవరిని పెడితే బాగుంటుందో అని మరోసారి చర్చ జరిగిందట. కాపు సామాజికవర్గానికే ఇంఛార్జ్‌ పదవి ఇస్తే కలిసి వస్తుందని వైసీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ బాలినేని శ్రీనివాసరెడ్డి పలువురి పేర్లను సిఫారసు చేశారట. అయితే సీఎం జగన్‌ ఏం ఆలోచిస్తున్నారనేది పెద్ద ప్రశ్న. మరోసారి ఆమంచితో మాట్లాడి ఆయన్నే ఫైనల్‌ చేస్తారా? లేక కొత్త వారిని తెరపైకి తెస్తారా అనేది చర్చగా మారింది. అదే జరిగితే రావి రామనాథంబాబు పరిస్థితి ఏంటి అనేది మరో చర్చ.

 

 

Exit mobile version