Site icon NTV Telugu

Ponguleti : ఆ మాజీ ఎంపీకి పదవి వచ్చినట్టే వచ్చి చేజారిందా..?

Ukapota

Ukapota

ఖమ్మం పార్లమెంటుకు గతంలో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అనుచరులను పెట్టుకున్నారు. అక్కడ రాజకీయాలను ప్రభావితం చేయాలని చూస్తారు ఈ మాజీ ఎంపీ. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు.. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పొంగులేటి పాత్రపై రకరకాలుగా ప్రచారం జరిగింది. క్రాస్‌ ఓటింగ్‌ వెనక పొంగులేటి ఉన్నట్టు సీఎం కేసీఆర్‌కు నివేదికలు వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయనకు పార్టీ పదవులు.. నామినేటెడ్‌ పోస్టులు ఇచ్చేందుకు టీఆర్‌ఎస్‌ ఆసక్తి చూపించడం లేదని టాక్‌. తాజాగా రాజ్యసభ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు రెండు పదవులు ఇచ్చినా.. వాటిల్లో పొంగులేటికి చోటు దక్కలేదు.

కొద్దిరోజులుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రాజ్యసభ సీటు ఇస్తారని ప్రచారం జరిగింది. ఒకవేళ పార్టీ అలాంటి ఛాన్స్‌ ఇస్తే వదలుకోకూడదని మాజీ ఎంపీ కూడా భావించారట. ఆ మేరకు అధిష్ఠానానికి గ్రీన్‌సిగ్నల్‌ పంపినట్టు తెలుస్తోంది. దాంతో ప్రగతి భవన్‌ నుంచి పిలుపు రావడమే మిగిలిందని అనుకున్నారట. మూడు రోజులుగా ఖమ్మం జిల్లాలో వివాహ ఆహ్వానాలు ఉన్నా.. వెళ్లకుండా హైదరాబాద్‌లోనే ఎదురు చూశారట పొంగులేటి. వాస్తవంగా జిల్లాలో ఎవరైనా పెళ్లి పత్రిక ఇస్తే తప్పకుండా వెళ్తున్నారు. అలాంటిది రాజ్యసభ రేస్‌లో పేరు ఉందని భావించి జిల్లా ముఖం కూడా చూడలేదు.

మాజీ ఎంపీ ఆశలు మరోసారి నీరుగారిపోయాయి. టీఆర్ఎస్‌ అధిష్ఠానం నుంచి పిలుపు రాలేదు. పొంగులేటిని కాదని ఇద్దరు పారిశ్రామిక వేత్తలకు ఛాన్స్‌ ఇచ్చింది పార్టీ. ఒకరికి రెండేళ్ల పదవీకాలం ఉన్న రాజ్యసభ ఇస్తే.. మరొకరికి పూర్తికాలం పదవీకాలం ఉన్న రాజ్యసభ సీటు ఇచ్చారు. దీంతో పొంగులేటికి మరోసారి నిరాశ తప్పలేదు. తాజా పరిణామాంతో గులాబీ శిబిరంలో ఉక్కపోత ఫీలవుతున్నారట. ఉక్కిరి బిక్కిరి చెందుతున్నట్టు సమాచారం. పార్టీలో ఉండాలో లేక పోవాలో డైలమాలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే మాజీ ఎంపీ కదలికలను అధికారపార్టీ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయట. మరి.. పొంగులేటి ఏం చేస్తారో చూడాలి.

 

Exit mobile version