పలాసలో రాజకీయం సలసలా కాగుతోంది. మంత్రి.. విపక్షపార్టీ ఎంపీ ఇద్దరూ ఒక్కచోటే ఫోకస్ పెట్టడంతో హీట్ పెరిగింది. దూకుడుగా వెళ్తున్నారు. అక్కడేం జరుగుతుందా అని జిల్లా అంతా చూస్తున్న పరిస్థితి. ఇంతకీ ఎవరా నాయకులు? పలాస పొలిటికల్ స్క్రిన్‌పై మారుతున్న రంగులేంటి?
పలాసలో మంత్రి వర్సెస్ టీడీపీ ఎంపీ!
పేరుకి వెనకబడిన ప్రాంతమే అయినప్పటికీ శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఎప్పుడూ హీటు పుట్టిస్తూనే ఉంటాయి. నాయకుల మధ్య సాగే మాటలయుద్ధం రాష్ట్రస్థాయిలో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం జిల్లాలో మంత్రి సీదిరి అప్పలరాజు.. టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు మధ్య డైలాగ్ వార్ షురూ అయ్యింది. మాట పడటానికి ఎవరూ ఇష్టపడటం లేదు. నువ్వొకటి అంటే.. నేను రెండు అంటాను అని వాగ్భాణాలు సంధించుకుంటున్నారు. ఇదే ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
read also : చంద్రబాబు ప్రస్తావన లేకుండానే కొత్త ఫ్రంట్ దిశగా అడుగులు !
అప్పలరాజును టీడీపీ శ్రేణులు కట్టడి చేయలేకపోతున్నాయా?
జిల్లాలోని వైసీపీ ముఖ్యనేతలు కీలక పదవుల్లో ఉన్నారు. ధర్మాన కృష్ణదాస్ డిప్యూటీ సీఎంగా … ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న తమ్మినేని సీతారాం స్పీకర్‌గా.. పలాస నుంచి తొలిసారి గెలిచిన సీదిరి అప్పలరాజు మంత్రిగా కొనసాగుతున్నారు. వీరిలో కృష్ణదాస్ వివాదాలకు దూరం. స్పీకర్ తమ్మినేని సంగతి సరేసరి. టాపిక్ ఏదైనా.. ఆయన ఎంట్రీ ఇస్తే అది మరో లెవల్‌కు వెళ్తుంది. ఫస్ట్ అటెమ్ట్‌లోనే మినిస్టర్ అయిన అప్పలరాజు సైతం సీనియర్ల బాటలోనే నడుస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. తమ్మినేని తరహాలోనే ప్రతిపక్షంపై విరుచుకుపడుతున్నారు. అయితే స్పీకర్‌గా ఉన్న తమ్మినేని ఏది మాట్లాడినా.. టీడీపీలో ఉన్న ఆయన మేనల్లుడు కూన రవికుమార్ వెంటనే కౌంటర్ ఇస్తున్నారు. మంత్రి అప్పలరాజునే తెలుగు తమ్ముళ్లెవరూ కట్టడి చేయలేకపోతున్నారట.
మంత్రిని ఎంపీ గురిపెట్టడం వెనక కారణం అదేనా?
అచ్చెన్నాయుడి నుంచి మొదలుపెట్టి చంద్రబాబు వరకు ఎవరినీ వదలడం లేదు అప్పలరాజు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీ నేతలు తలోదిక్కైపోవడంతో మంత్రి స్పీడ్‌కు లోకల్‌గా బ్రేక్‌లు వేసేవారు లేకుండా పోయారని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయట. ఇది గ్రహించారో ఏమో ఆ బాధ్యతలను ఇటీవలే ఎంపీ రామ్మోహన్‌నాయుడు తీసుకున్నారు. అవకాశం చిక్కితే మంత్రిపై మాటల దాడి చేస్తున్నారు ఎంపీ. గతేడాది మత్స్యకార డీజిల్ సబ్సిడీ గోల్‌మాల్‌తో మొదలుపెట్టి.. పలాసలో భూ కబ్జాలు, విగ్రహ వివాదం వరకూ దేన్నీ వదలకుండా మంత్రిని కార్నర్ చేస్తున్నారు రామ్మోహన్‌నాయుడు. అప్పలరాజు సైతం వెనక్కి తగ్గడం లేదు. ఎంపీ ఏదైనా అంటే కౌంటర్ ఇవ్వడానికి క్షణం ఆలోచించడం లేదు.
మున్సిపల్ ఎన్నికల్లో మంత్రిదే పైచెయ్యి!
ఆసక్తిగా పలాసలో నేతల డైలాగ్ వార్!
ఆ మధ్య జరిగిన పలాస మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి అప్పలరాజు ఆధిపత్యానికి గండి కొట్టాలని ఎంపీ రామ్మోహన్‌నాయుడు ప్లాన్ వేశారు. కానీ.. వైసీపీ పాచికల ముందు టీడీపీ ఎత్తులు పారలేదు. దీంతో మున్సిపల్ ఎన్నికల తర్వాత మంత్రిపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారట ఎంపీ. ఇటీవల మత్స్యకార భరోసా కార్యక్రమంలో మంత్రి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు రామ్మోహన్‌నాయుడు. వీటిపై కౌంటర్ అటాక్ చేస్తున్నారు అప్పలరాజు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ జిల్లా రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. ఇద్దరు యువ నేతల దూకుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో అన్న చర్చ కూడా మొదలైంది. మరి.. పలాసలో ఎవరి ప్లాన్ వర్కవుట్ అవుతుందో చూడాలి.
