చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం ఎప్పుడూ పొలిటికల్ హీట్‌తో.. గ్రూపు రాజకీయాలతో రచ్చరచ్చగా ఉంటుంది. నిత్యం ఏదో ఒక రగడ ఇక్కడ కామన్. ఇలాంటి క్రమంలో రాజకీయాల్లో ఒకరు ఒక అడుగు ముందుకు వేస్తే.. మనం పది అడుగు వేయలనే ఆలోచనలో టీడీపీ ఇంఛార్జ్ గాలి భాను ప్రకాష్ వ్యూహం మార్చారట. మొన్నటిదాకా సైలెంట్‌గా చక్రం తిప్పిన ఆయన.. రోజాకు మంత్రి పదవి వచ్చాక ప్లాన్ బీ అమలులోకి తెచ్చారట. జిల్లా టీడీపీ నేతలంతా సైలెంట్ మోడ్‌లో ఉంటే.. భాను ప్రకాష్ మాత్రం యాక్టివ్ మోడ్‌లోకి వచ్చేశారని తెలుగు తమ్ముళ్లు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారట. గత ఎన్నికల్లో రెండువేల ఓట్ల తేడాతో భానుప్రకాష్ ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం నగరిలో పసుపు జెండా ఎగరేస్తామని ఆయన ధీమాగా చెబుతున్నారట.
ప్రస్తుతం నగరిలో మంత్రి రోజా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. అదే సమయంలో టీడీపీ నేత భాను ప్రకాష్ సైతం బాదుడే బాదుడు అని టూర్ చేస్తున్నారు. నగరిలో 50 వేలకు పైగా ఉండే పవర్ లూమ్ కార్మికులు విద్యుత్ ఛార్జీల పెంపుపై ఆందోళన చేస్తున్నారు. వారికి టీడీపీ మద్దతు ఇవ్వడంతో అది రాజకీయంగా కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారట. సరిగ్గా ఇదే టైమ్‌లో వైసీపీలో రోజా వ్యతిరేకవ్గం భానుప్రకాష్‌తో టచ్‌లోకి వెళ్లిందనే ప్రచారం కలకలం రేపుతోంది.
మంత్రి పదవి రాగానే తన వ్యతిరేకవర్గానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రోజా. మీ అంతు తేలుస్తా.. లెక్కలు సరిచేస్తానని చెప్పడంతో రోజా వ్యతిరేకవర్గంలోని కొందరు తమ గేమ్ ప్లాన్ మార్చేసినట్టు టాక్. వచ్చే ఎన్నికల్లో రోజా ఓటమే లక్ష్యంగా పావులు కదపడానికి సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది. రోజాకు సొంత పార్టీలో వైరిపక్షంగా ఉన్న అమ్ములుతోపాటు.. వడమాలపేటలోని ఓ నాయకుడు.. మరికొందరు భాను ప్రకాష్‌తో టచ్‌లోకి వెళ్లినట్టు చెవులు కొరుక్కుంటున్నారు. గాలి వారసుడు సైతం.. కొంచెం టచ్‌లో ఉండండి.. కలిసి పనిచేద్దామని వారికి భరోసా ఇచ్చినట్టు ప్రచారం జోరందుకుంది. ఆ వర్గంతో మాటలు కలిశాకే.. భాను ప్రకాష్ నగరిలో దూకుడు పెంచారని చర్చ సాగుతోంది.
మారిన రాజకీయ పరిణామాలు ప్రస్తుతం నగరి పాలిటిక్స్‌ను వేడెక్కిస్తున్నాయి. జనంలో పట్టుసాధించేందుకు టీడీపీ.. పట్టు సడలకుండా మంత్రి రోజా వేస్తున్న ఎత్తుగడలు రేపో మాపో ఎన్నికలన్నట్టుగా ఉన్నాయి. ఇందులో రోజా వ్యతిరేకవర్గం కదలికలు ఉత్కంఠ రేపుతున్నాయి. మరి.. రానున్న రోజుల్లో నగరి పాలిటిక్స్ ఎలాంటి టర్న్ తీసుకుంటాయో చూడాలి.
