Site icon NTV Telugu

హుజురాబాద్‌ టీఆర్‌ఎస్‌లో మళ్లీ వేడి.. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఎవరికి?

హుజురాబాద్‌ ఉపఎన్నిక రాష్ట్రంలో ఓ రేంజ్‌లో రాజకీయ వేడి రాజేసింది. అక్కడ ఫలితం వచ్చాక చర్చ అటువైపు వెళ్లలేదు. ఓటమిని లైట్‌ తీసుకున్నట్టుగా టీఆర్‌ఎస్‌ కనిపించింది. అయితే హుజురాబాద్‌ రాజకీయ క్షేత్రంలో కీలక నియోజకవర్గంగా మారిపోయింది. ఉపఎన్నికలో గుర్తించిన పొరపాట్లు రిపీట్‌ కాకుండా.. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే అక్కడ ఫోకస్‌ పెడుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం అధికార పార్టీలో ఇద్దరు నేతలు ఉన్నారు. ఒకరు ఉపఎన్నికలో ఓడిన గెల్లు శ్రీనివాస్‌ కాగా.. రెండో వ్యక్తి హుజురాబాద్‌ ఉపఎన్నికకు ముందు టీఆర్ఎస్‌లో చేరి.. ఎమ్మెల్సీ అయిన పాడి కౌశిక్‌రెడ్డి. ఉపఎన్నికలో ఓడినా.. గెల్లు శ్రీనివాస్‌ హుజురాబాద్‌ను వీడలేదు. అక్కడే ఉంటూ.. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్టు కేడర్‌ చెప్పేమాట.

హుజురాబాద్‌లో పట్టుకోసమే కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చినట్టు చెబుతున్నారు. ఒకవైపు టీఆర్ఎస్‌ ఇంఛార్జ్‌గా గెల్లు శ్రీనివాస్‌..ఎమ్మెల్సీగా కౌశిక్‌రెడ్డి నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు. ఇద్దరూ పోటాపోటీగా తిరుగుతుండటంతో వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫున బరిలో దిగేది ఎవరో అన్న చర్చ మొదలుపెట్టేసింది కేడర్‌. గెల్లుకు మరోసారి అవకాశం ఇస్తారా లేక పాడి కౌశిక్‌రెడ్డి వైపు మొగ్గు చూపుతారా అన్నది పార్టీ శ్రేణుల ప్రశ్న. ఉపఎన్నిక సమయంలోనే గెల్లు, పాడి వర్గాలు వేర్వేరుగా పని చేశాయి. ఇద్దరినీ సమన్వయం చేయడం సమస్యే అన్నది పార్టీ వర్గాల మాట. పైగా ఈటల రాజేందర్‌ను హుజురాబాద్‌లో ఎదుర్కోవాలంటే టీఆర్ఎస్‌ నేతలు ఐక్యంగా పోరాడాలన్నది గులాబీ నేతల ఆలోచన. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు ఉన్నాయా అన్నది ప్రశ్న. ఇద్దరు నాయకులు తమ పట్టు సడలకుండా జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం.

ఎమ్మెల్సీగా ఉన్న కౌశిక్‌రెడ్డి నియోజకవర్గంలో పట్టు సాధించేలా పనిచేస్తారన్నది టీఆర్ఎస్‌ వర్గాల్లో కొందరి వాదన. ఇదే సమయంలో గెల్లు మరోసారి బరిలో దిగి సత్తా చాటుతారని అనుకుంటున్నారట. గెల్లును పార్టీ ఇంఛార్జ్ గానే ఉంచి.. ఏదైనా కార్పొరేషన్‌కు ఛైర్మన్‌ను చేస్తారని ప్రచారం కూడా జరుగుతోంది. టీఆర్ఎస్‌ను వీడిన కొందరు నాయకులు ఘర్‌వాపసీ అవుతుండటంతో పాత, కొత్త నేతల మధ్య సఖ్యత కుదిర్చేలా పార్టీ అధిష్ఠానం ప్రణాళికలు రచించినట్టు సమాచారం. వచ్చే ఎన్నికలలో ఎవరు అభ్యర్థో చెప్పకుండా.. పార్టీ పెద్దలు మాత్రం.. హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌ అనుకూల వాతావరణం తీసుకొచ్చేలా పనిచేయాలని గెల్లు శ్రీనివాస్‌కు, పాడి కౌశిక్‌రెడ్డికి చెప్పినట్టు తెలుస్తోంది. హుజురాబాద్‌ ఉప ఎన్నిక బ్యాక్‌ డ్రాప్‌లో నియోజకవర్గానికి చెందిన పలువురు టీఆర్ఎస్‌ నేతలకు పదవులు దక్కాయి. ఇదే క్రమంలో వచ్చే ఎన్నికల లోపు మరికొందరికి పదవులు రావొచ్చని అనుకుంటున్నారట. మరి.. హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌ ఆపరేషన్‌ ఎలాంటి మలుపులు తిరుగుతుందో.. ఎవరికి పదవులు కట్టబెడుతుందో.. అభ్యర్థిగా ఎవరిని తెరపైకి తీసుకొస్తుందో చూడాలి.

Exit mobile version