Site icon NTV Telugu

హుజురాబాద్ లో ఫోన్ ట్యాపింగ్ టెన్షన్ !

ఉపఎన్నిక వేడి నెలకొన్న హుజురాబాద్‌లో అన్ని పార్టీల నేతలను ఓ అంశం భయపెడుతోంది. ఎటు నుంచి ఎటు ఏ ముప్పు వాటిల్లుతుందో తెలియక టెన్షన్‌ పడుతున్నారు. ఫోన్‌ కాల్‌ వస్తే చాలు ఉలిక్కిపడుతున్నారట. ఫోన్‌ రింగ్‌ వినిపిస్తే.. గుండెల్లో దడ పెరుగుతోందట. ఎందుకో.. ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

ఫోన్‌ వస్తే మాట్లాడటానికి జంకుతున్న హుజురాబాద్‌ నేతలు!

చేతిలో ఫోన్‌ ఉంది కదా అని ఎడా పెడా మాట్లాడేస్తే.. ఆ కాల్‌ రికార్డింగ్‌లు బయటకొచ్చి నేతలను చిక్కుల్లో పడేస్తున్నాయి. క్షణాల్లో వైరలై నేతల జాతకాలు తిరగబడుతున్నాయి. దీంతో ఫోన్‌ మాట్లాడలంటేనే భయపడతున్న రోజులివి. ముఖ్యంగా ఉపఎన్నిక ముంగిట ఉన్న హుజురాబాద్‌లో ఫోన్‌ ట్యాపింగ్‌ ఫోబియా నిద్ర లేకుండా చేస్తోందట. అత్యవసరంగా ఫోన్‌ చేసి మాట్లాడాలన్నా జంకుతున్నారట నాయకులు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులే కాకుండా.. చోటా మోటా పార్టీ శ్రేణులకు సైతం సెల్‌ఫోన్‌ రింగైతే ముచ్చెమటలు పడుతున్నాయట. ప్రస్తుతం హజురాబాద్‌లో ఈ ఫోన్‌ ట్యాపింగ్‌లు.. కాల్ చేసినా ఫోన్లు ఎత్తకపోవడం అన్ని పార్టీల శిబిరాల్లోనూ హాట్ టాపిక్‌గా మారాయి.

చేతిలో ఉన్న ఫోన్‌నే శత్రువుగా చూస్తున్నారా?

ఫోన్లు ట్యాప్ అవుతున్నాయన్న ప్రచారం పెద్దఎత్తున సాగుతుండడంతో హుజురాబాద్‌లోని ఐదు మండలాల నాయకులు సైతం రెగ్యులర్ ఫోన్లు మాట్లాడటం లేదట. ఎవరైనా ఫోన్ చేస్తే కలుద్దామని చెబుతున్నారట. అర్జంటైతే వాట్సాప్ కాల్ చేయమని సూచించి ఫోన్‌ పెట్టేస్తున్నారట. అధికార టీఆర్ఎస్‌ నాయకులకు చేతిలో ఉన్న ఫోన్‌ శత్రువుగా మారిందని జోకులు పేలుతున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే ఒకరిద్దరు లీడర్స్ పార్టీ ముఖ్యనేతలతో చీవాట్లు తిన్నారట. ఆ విషయం తెలిసి క్యాడర్ భయపడుతున్నట్టు సమాచారం. అప్పటి నుంచీ అంతా వాట్సాప్ కాల్స్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారట.

టీఆర్ఎస్‌లో ఉన్న ఈటల అనుచరుల కోసం ఫోన్‌ ట్యాపింగ్‌?

హుజురాబాద్‌ టీఆర్‌ఎస్‌లో కొందరు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు అనుకూలంగా ఉన్నట్టు ముఖ్య నేతలు అనుమానిస్తున్నారట. వారెవరో.. ఏంటో.. ఏం చేస్తున్నారో కనిపెట్టేందుకు రూలింగ్ పార్టీ లీడర్స్‌పై నిఘా విభాగాలు స్పెషల్‌ ఫోకస్‌ పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. స్మార్ట్‌ఫోన్లు కొంతమంది నాయకుల ఇంటర్నల్ విషయాలను బట్టబయలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కొన్ని కంపెనీల మొబైల్స్‌లో ఆటోమెటిక్‌ కాల్‌రికార్డింగ్ ఆప్షన్ ఉండటంతో.. అది తెలియక ఇబ్బంది పడుతున్న నాయకులు చాలామందే ఉన్నారట. పాడి కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్‌ వేటు వేయడానికి ముందు ఆయన ఓ యువకునితో మాట్లాడిన ఆడియో వైరల్ కావడం తెలిసిందే. ఇదే విధంగా ఎవరి ఫొన్లో ఎవరిగుట్టు దాగుందో అంతుచిక్కని పరిస్థితి ఉందట. హుజూరాబాద్ నాయకులకు ప్రస్తుతం ఇదే భయం పట్టుకుంది.

రాజకీయ భవిష్యత్‌కు సెల్‌ఫోన్‌ ఆటంబాంబుగా మారిందా?

మొత్తానికి చేతిలో కాస్ట్‌లీ ఫోన్‌ ఉంటే.. నలుగురిలో షో చేసే నాయకులు.. ఇప్పుడు అదే సెల్‌ఫోన్‌ను చూసి రాజకీయ భవిష్యత్‌కు ఆటంబాంబులా ఫీలవుతున్నారు. ఎంత దగ్గరి వారు ఫోన్‌ చేసినా.. మాట్లాడేందుకు పెదవి పెగలడం లేదు. ఒకప్పుడు గంటలు గంటలు మాట్లాడినవారు సైతం.. సరే.. చూద్దాం… చేద్దాం అని పొడిపొడి మాటలతో సరిపెట్టేస్తున్నారు. మొత్తానికి ఒక ఉపఎన్నిక.. ఫోన్‌ ట్యాపింగ్‌ అన్ని పార్టీల నేతలకు కొత్త టెన్షనే తీసుకొచ్చింది.

Exit mobile version