Site icon NTV Telugu

JP Nadda :పవన్ పేరు ఎత్తని నడ్డా..! ఆ పార్టీల మధ్య గ్యాప్ పెరుగుతుందా ?

Jp Nadda

Jp Nadda

చాలాకాలం తర్వాత ఏపీపై బీజేపీ హైకమాండ్‌కు ఫోకస్‌ పెట్టింది. ఈ రాష్ట్రాన్ని కూడా ముఖ్యమైన రాష్ట్రాల జాబితాలో చేర్చిందా..? అనే స్థాయిలో బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా రెండు రోజులు ఏపీలో పర్యటించారు. రాష్ట్రంలో బీజేపీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలో కార్యకర్తలకు ఆయన దిశా నిర్దేశం చేశారు కూడా. ఈ సందర్భంగా అధికారపార్టీపై తీవ్ర విమర్శలు చేశారాయన. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ నినాదాన్ని కూడా తెలుగులో వినిపించారు నడ్డా. వైసీపీ పోవాలి.. బీజేపీ రావాలి అంటూ ఆయనే స్వయంగా నినదించారు.

నడ్డా రెండు రోజుల టూర్‌లో జనసేన గురించి కానీ.. జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ గురించి కానీ నామమాత్ర ప్రస్తావన కూడా లేదు. నడ్డా ఏపీకి రేపు వస్తారనగా.. జనసేన నేతలు భారీఎత్తున డిమాండ్స్‌ పెట్టారు. అల్టిమేటాలు జారీ చేశారు. పవన్‌ కల్యాణ్‌ను మిత్రపక్షం తరఫున సీఎం అభ్యర్థిగా ప్రకటించాలనే డిమాండ్‌ గట్టిగానే వినిపించారు. దీంతో నడ్డా పర్యటనలో సీఎం అభ్యర్థి ప్రస్తావన లేకపోయినా.. పవన్‌ కల్యాణ్‌ పేరును ప్రస్తావిస్తారని అంతా భావించారు. ఈ అంచనాలకు భిన్నంగా సాగింది బీజేపీ చీఫ్‌ టూర్‌. శక్తి కేంద్రాల ప్రముఖ్‌లతో జరిపిన సమావేశం.. గోదావరి గర్జన సభలో పవన్‌ గురించి పల్లెత్తు మాట కూడా ప్రస్తావించ లేదు. ఇదే ఇప్పుడు ఏపీలో హాట్‌ టాపిక్‌.

పవన్‌ కల్యాణ్‌ను బీజేపీ హైకమాండ్‌ అంతగా పట్టించుకున్నట్టుగా కన్పించడం లేదని చర్చ మొదలైంది. నడ్డా ఆయన్ను లైట్‌ తీసుకున్నారనే చెవులు కొరుకుడు ఎక్కువైంది. పైగా తనకు ఏపీ బీజేపీ నేతలు ఎవ్వరితోనూ పరిచయం లేదని.. ఢిల్లీ నాయకులతోనే సంబంధాలు ఉన్నాయని ఇటీవల ఒకటికి రెండుసార్లు పవన్‌ చెప్పుకొన్నారు. రీసెంట్‌గా నడ్డాతో కూడా పవన్‌ భేటీ అయ్యారని సమాచారం. ఈ క్రమంలో ఏపీకి వచ్చిన నడ్డా.. కనీసం పవన్‌ ప్రస్తావన తేకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి రాజకీయ వర్గాలు. గోదావరి గర్జనకు ముందురోజు నడ్డాతో ఏపీ బీజేపీ కోర్‌ కమిటీ భేటీ అయింది. ఈ భేటీలో పవన్‌ కల్యాణ్‌ గురించి.. పవన్‌ పెట్టిన ఆప్షన్లు గురించి కొంత కీలక చర్చ జరిగినట్టు సమాచారం. పవన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలంటూ జనసేన నేతలు చేసిన కామెంట్స్‌ కూడా కోర్‌ కమిటీ మీటింగ్‌లో ప్రస్తావనకు వచ్చాయట. అయితే పవన్‌ను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని.. ఆ సమావేశంలోనే నడ్డా కుండబద్దలు కొట్టినట్టు బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

పొత్తుల విషయంలో ఆప్షన్లు అంటూ కొత్త చర్చకు తావిచ్చే విధంగా పవన్‌ చేసిన కామెంట్స్‌ను నడ్డా తీవ్రంగా పరిగణించినట్టు సమాచారం. 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నాం.. కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతోన్న తమకు ఆప్షన్లు ఇస్తారా..? అనే రీతిలో నడ్డా స్పందించినట్టు తెలుస్తోంది. పవన్‌ ఢిల్లీ నేతలతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉన్నారని.. ఆయన్ను ఎలా డీల్‌ చేయాలో తమకు తెలుసంటూ నడ్డా నర్మగర్భంగా వ్యాఖ్యానించినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. ఆ కారణంగా నడ్డా పర్యటనలో పవన్‌ ప్రస్తావన రాకపోయి ఉండొచ్చనే వాదన ఉంది. ఏపీ బీజేపీ నేతలు కూడా సీఎం అభ్యర్థిగా పవన్‌ను ప్రకటించాలనే డిమాండ్‌పై మండిపడుతున్నారట. ఎన్నికలకు రెండేళ్లు ముందుగానే ఈ తరహా డిమాండ్‌ ఎందుకు తీసుకురావడం అని గుర్రుగా ఉన్నారట. అదీ నడ్డా పర్యటనకు లింక్‌ చేస్తూ ఈ తరహా డిమాండ్‌ను తెర మీదకు తేవడాన్ని కమలనాథులు కస్సుమంటున్నారట.

అయితే నడ్డా టూర్‌ను.. తాజా పరిణామాలను జనసేన ఏ విధంగా చూస్తుందనేదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ముందుగా ప్రతిపక్ష ఓట్లను చీలనివ్వనన్న పవన్‌.. చివరికి వచ్చేసరికి.. మిత్రపక్షం బీజేపీతో గొడవకు సిద్దమవుతున్న పరిస్థితిలోకి వచ్చినట్టు అనుమానిస్తున్నారు. ఇక తగ్గేదే లేదంటూ టీడీపీకి కౌంటర్‌ ఇవ్వడం ద్వారా మరో కీలక డెవలప్‌మెంట్‌కు తెర లేపినట్టు చర్చ జరుగుతోంది. ఇది చివరికి ఎటు దారి తీస్తుందో జనసేన నేతలకు కూడా అర్థం కావడం లేదట. గత ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో కలిసి జనసేన పోటీ చేస్తే ఎలాంటి ఫలితాలు వచ్చాయో అందరికి తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఒంటరిగా వెళ్లే పరిస్థితి ఉందా..? ఆ స్థాయిలో జనసేన పుంజుకుందా..? అనే చర్చ మొదలైందట. జనసైనికులు మాత్రం ఒంటరిగానైనా పోటీకి సిద్ధమేనని తొడలు కొడుతున్నారు. గతంతో పోల్చుకుంటే పవన్‌ పొలిటికల్‌ ఇమేజ్‌ పెరిగిందని లెక్కలు వేస్తున్నారు. అయితే తాజా రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కొన్నాళ్లపాటు పొత్తుల విషయంలో సంయమనం పాటిస్తే మంచిదనే వాదన కూడా జనసేన వర్గాల్లో ఉందట. మరి.. జనసేనాని రియక్షన్‌ ఏంటో కాలమే చెప్పాలి.

 

 

Exit mobile version