Site icon NTV Telugu

టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఝలక్ ఇస్తున్న పార్టీ కార్యకర్తలు ?

అక్కడ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు టైమ్‌ చూసి ఝలక్‌ ఇస్తున్నారట పార్టీ నేతలు. నిరసనలు చేపడితే ఒక్కరు కనిపించడం లేదు. ముందురోజు వస్తామని చెప్పినవాళ్లే తర్వాతిరోజు పత్తా లేకుండా పోతున్నారట. ప్రస్తుతం ఆ జిల్లాలో ఆ ఎమ్మెల్యే.. అక్కడి కార్యకర్తల తీరుపైనే గులాబీ శిబిరంలో ఓ రేంజ్‌లో చర్చ జరుగుతోంది.

పార్టీ శ్రేణుల తీరు ఎమ్మెల్యేకు అంతుచిక్కడం లేదా?

బిగాల గణేష్‌ గుప్త. నిజమాబాద్‌ అర్బన్‌ టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే. పార్టీకి బలం.. బలగం భారీగానే ఉన్న ఈ నియోజకవర్గంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు టీఆర్ఎస్‌ వర్గాలను ఆశ్చర్య పరుస్తున్నాయి. ఎమ్మెల్యే బిగాల.. కేడర్‌కు మధ్య చాలా గ్యాప్‌ వచ్చినట్టు సమాచారం. ఆ ఎఫెక్ట్‌ పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలపై పడుతోంది. దీంతో పార్టీ శ్రేణుల తీరు ఎమ్మెల్యేకు కూడా అంతుచిక్కడం లేదట.

ధర్నాకు అడ్డాకూలీలను తీసుకొచ్చిన నేతలు..!

ధాన్యం సేకరణపై అధికార టీఆర్‌ఎస్‌ ఇప్పటికే విడతల వారీగా క్షేత్రస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తోంది. దీక్షలు చేపట్టిన సమయంలో రైతులను సమీకరించేందుకు అర్బన్‌, రూరల్‌ నియోజకవర్గాలు కలిపి జిల్లా కేంద్రాన్ని ఎంచుకున్నాయి. ఆ దీక్షలో అర్బన్‌ కంటే నిజమాబాద్‌ రూరల్‌ నుంచి వచ్చిన వాళ్లే ఎక్కువగా కనిపించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేపట్టిన సమయంలోనూ ఇదే పరిస్థితి ఉందట. ఇక లాభం లేదని భావించిన కొందరు పార్టీ నేతలు.. ఎమ్మెల్యే మెప్పు కోసం అడ్డాకూలీలను తీసుకొచ్చారు. తీరా వాళ్లకు ఇచ్చే డబ్బుల్లోనూ చేతివాటం ప్రదర్శించడంతో రచ్చ రచ్చ అయింది.

18 మంది కార్పొరేటర్లలో ఐదారుగురే ధర్నాకు హాజరు..!

తాజాగా ధాన్యం సేకరణపై ధర్నాలు నిర్వహించేందుకు టీఆర్ఎస్‌ పిలుపిచ్చింది. ఆ కార్యక్రమమైనా ఘనంగా చేయాలని మేయర్‌, నుడా డైరెక్టర్‌, మున్సిపల్ కార్పొరేషన్‌లోని టీఆర్ఎస్‌ కార్పొరేటర్లతో ముందురోజు సమావేశం నిర్వహించారు. ఆ మీటింగ్‌కు అందరూ వచ్చారు. తీరా ధర్నా ప్రదేశానికి వచ్చే సరికి మళ్లీ స్థానిక గులాబీ నేతలు గాయబ్‌. 18 మంది టీఆర్ఎస్‌ కార్పొరేటర్లతో ఐదారుగురు మినహా మిగతా వాళ్లు రాలేదు. ఎమ్మెల్యే మేయర్, నుడా డైరెక్టరే కనిపించారు. ఇదే కాదు.. ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే చేసిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ ప్రోగ్రామ్స్‌కు సైతం ఇదే విధంగా హ్యాండిస్తున్నారట కేడర్‌.

నిధుల విషయంలో ఎమ్మెల్యేపై కార్పొరేటర్ల గుర్రు..!

టీఆర్ఎస్‌ కేడర్‌ను ఎమ్మెల్యే పట్టించుకోక పోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. కొత్తగా టీఆర్ఎస్‌లోకి వచ్చినవారికి బిగాల ప్రాధాన్యం ఇస్తున్నారట. అందుకే టైమ్‌ చూసి కేడర్‌ హ్యాండిస్తోందని చెబుతున్నారు. బిగాల స్వయంగా పట్టుబట్టి కొందరికి పదవులు ఇప్పించారు. వాళ్లు కూడా ఇప్పుడు తుపాకీ దెబ్బకు కనిపించడం లేదట. ఇక నిధుల విషయంలో ఎమ్మెల్యే సహకరించడం లేదని టీఆర్ఎస్‌ కార్పొరేటర్లు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. నిజామాబాద్‌లో రోడ్ల నిర్మాణం.. లైటింగ్‌ పనుల వల్ల పార్టీకి హైప్‌ వచ్చినా.. వాటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో కార్పొరేటర్లకు ప్రాధాన్యం ఇవ్వలేదట. అది మనసులో పెట్టుకునే కార్పొరేటర్లు ఎమ్మెల్యేకు ఝలక్‌ ఇస్తున్నారని తెలుస్తోంది. మరి.. ఈ లోపాలను ఎమ్మెల్యే గుర్తించారో లేదో.. బిగాలకు పార్టీ కేడర్‌ సహాయ నిరాకరణపై పెద్ద చర్చే జరుగుతోంది.

Exit mobile version