NTV Telugu Site icon

TCongress : ఆ పెద్దాయనకు బాధ్యతలు అప్పగిస్తే హ్యాండ్ ఇచ్చాడా..?

Congessjpg

Congessjpg

తెలంగాణ కాంగ్రెస్‌లో నిత్యం ఏదో ఒక అలక సర్వ సాధారణమైంది. సభలు.. సమావేశాలు ఏది జరిగినా అలకలు.. అసంతృప్తులు తెరపైకి వస్తున్నాయి. గతంతో పోలిస్తే రాష్ట్రంలో పార్టీ పరిస్థతి కాస్త మెరుగైందని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్న తరుణంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. ప్రియాంకగాంధీ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే ఓదెలుతోపాటు జడ్పీ ఛైర్‌పర్సన్‌ అయిన ఓదేలు భార్య భాగ్యలక్ష్మి కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారు. అధికారపార్టీ టీఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి ఈ తరహా చేరికలు పార్టీకి పాజిటివ్‌ సంకేతాలు ఇస్తాయని లెక్కలేసుకున్నారు నాయకులు. అయితే ఓదెలు కుటుంబం చేరిక కాంగ్రెస్‌లో చర్చతోపాటు రచ్చకు దారితీస్తోందట. మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు.. డీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్న ఆయన భార్య సురేఖ అక్కడ కాంగ్రెస్‌లో కీలకం. అలాంటిది ఓదేలు చేరిక తమకు తెలియలేదని ప్రేమ్‌సాగర్‌రావు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. మాట మాత్రమైనా చెప్పలేదని నొచ్చుకున్నట్టు తెలుస్తోంది.

ఓదేలు చేరికపై బ్యాక్‌గ్రౌండ్ వర్కు అంతా మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ చేశారట. ఇక్కడో మతలబు ఉంది. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీలో ఎవరు చేరాలి అనే దానిపై పంచాయితీలు లేకుండా సీనియర్ నాయకుడు జానారెడ్డి అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేసింది హైకమాండ్‌. ఆ కమిటీలో జానారెడ్డితోపాటు మరో ఐదుగురు సభ్యులు ఉన్నారు. జిల్లాల వారీగా చేరికలపై పరిశీలన.. అక్కడి నాయకులతో సమన్వయం చేసి పార్టీలో చేర్చుకోవాలనేది ఆ కమిటీ ఉద్దేశం. ఓదేలు విషయంలో అదేమీ జరగలేదట. అయితే TRS నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చే వారి గురించి కమిటీ ముందు పెట్టి చర్చిస్తే.. ఈ లోపు రాజకీయంగా ఒత్తిళ్లు పెరిగి చేరికలు ఆగిపోయే ప్రమాదం ఉందనేది కొందరి వాదన.

ప్రతీ చేరిక వెనక ఏదో ఒక వ్యూహం ఉంటుంది. కమిటీలో చర్చించిన తర్వాతే కండువా కప్పాలని అనుకుంటే ఇక అంతే సంగతులని మరికొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారట. ఈ విషయాలు పైస్థాయిలోని కాంగ్రెస్‌ నాయకులకు తెలియంది కాదు. కాకపోతే.. అన్నీ తెలిసి చేరికల కమిటీ వేసి.. అక్కడ ముందుగా చర్చించాలి అనే నిబంధన పెట్టడం ఎందుకనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఓదేలు విషయంలో ప్రేమ్‌సాగర్‌రావుకు సమాచారం లేదు సరే.. చేరికల కమిటీ ఛైర్మన్‌గా ఉన్న జానారెడ్డికైనా తెలుసా అనేది ప్రస్తుతం చర్చ. పెద్దాయనకు కూడా తెలియకపోతే.. చేరికల కోసం కాంగ్రెస్‌ వేసిన కమిటీని నామ్‌ కే వాస్తేగా మిగిలిపోతుందా? ఇకపైనా చేరికలు వారికి తెలిసే అవకాశం లేదా? గాంధీభవన్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన ప్రశ్నలివి.

ప్రియాంకగాంధీ సమక్షంలో ఓదేలు కుటుంబం కాంగ్రెస్‌లో చేరడంతో.. ఈ అంశంపై పార్టీలో ఎవరూ ఓపెన్‌గా కామెంట్‌ చేయడం లేదు. కాకపోతే సమాచారం లేదన్న అంశంపై మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు తదితరులు అసంతృప్తితో ఉన్నారట. మరి.. ఈ అసంతృప్తులు భగ్గుమని రోడ్డెక్కకుండా కాంగ్రెస్‌ పెద్దలు ఏం చేస్తారో చూడాలి.