NTV Telugu Site icon

TCongress: పార్టీ అక్షింతలు వేసినా.. ఆ నాయకుడి తీరులో మార్పు లేదా..?

Kada Mohan

Kada Mohan

కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో నేతల మధ్య వర్గపోరు.. అధిష్ఠానానికి తలనొప్పిగా మారిందట. కాంగ్రెస్ ఐటీ సెల్ ఛైర్మన్ మదన్ మోహన్‌రావు.. ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌ వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. కార్యకర్తలు, నాయకులు రెండువర్గాలుగా విడిపోయారు. పార్టీ ఏదైనా కార్యక్రమాలకు పిలుపిస్తే.. ఎవరి దుకాణం వాళ్లదే. జహీరాబాద్ పార్లమెంట్ ఇంఛార్జ్‌గా ఉన్న మదన్‌మోహన్ ఎల్లారెడ్డి అసెంబ్లీపై కన్నేసినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రత్యేకంగా ఒకవర్గాన్ని ఏర్పాటు చేసుకుని పార్టీతో సంబంధం లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారట.

ఎల్లారెడ్డితోపాటు కామారెడ్డి, బాన్సువాడల్లోనూ మదన్‌ వేలు పెడుతున్నట్టు అక్కడ కాంగ్రెస్‌ వర్గాలు గుర్రుగా ఉన్నాయి. ఆయా నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలు ఇప్పటికే మదన్‌మోహన్‌పై కాంగ్రెస్‌ పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఆ మధ్య మదన్‌ను కాంగ్రెస్‌ నుంచి సస్పెండ్‌ చేశారు డీసీసీ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌. అయితే మదన్‌మోహన్‌ను సస్పెండ్‌ చేసే అధికారం డీసీసీకి లేదని పార్టీలో పెద్ద దుమారమే రేగింది.

ఆ వివాదంపై చర్చ జరుగుతున్న సమయంలోనే పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఎదుట మదన్‌ హాజరై కామారెడ్డి నేతల ఫిర్యాదులపై వివరణ ఇచ్చారట. కలిసి పనిచేయాలని.. వివాదాలు సృష్టించొద్దని హైకమాండ్‌ పెద్దలు గట్టిగానే మదన్‌కు చెప్పినట్టు సమాచారం. ఆ తర్వాత దూకుడు తగ్గిస్తారని పార్టీ నేతలు భావించారట. కానీ.. ఎల్లారెడ్డిలో అస్సలు తగ్గడం లేదట మదన్‌. ఎల్లారెడ్డి కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌ సుభాష్‌రెడ్డిని కాదని లింగంపేట మండలం కోమట్‌పల్లిలో రచ్చబండ నిర్వహించారట. అదికాస్తా వివాదానికి దారితీసింది. కాంగ్రెస్‌లోని రెండు వర్గాలు ఘర్షణ పడటంతో రచ్చ రచ్చ అయింది. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్‌ను చీల్చేస్తున్నారని సుభాష్‌రెడ్డి వర్గీయులు గుర్రుగా ఉన్నారట. అయితే రైతు డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్తుంటే అడ్డుకుంటున్నారని మదన్‌ వర్గం కౌంటర్‌ అటాక్‌ మొదలుపెట్టింది.

కాంగ్రెస్‌ బలంగా ఉందని లెక్కలు వేస్తున్న చోట వర్గపోరు రకరకాలుగా మలుపులు తిరుగుతుండటం పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారిందట. కేడర్‌ సైతం ఎవరివైపు ఉండాలో తేల్చుకోలేకపోతున్నట్టు సమాచారం. అయితే నేతల మధ్య సమన్వయం చేయాల్సిన అధిష్ఠానం వెయింట్‌ అండ్‌ సీ అనే ధోరణిలో ఉండటం పార్టీ శ్రేణులకు అంతుచిక్కడం లేదట. పీసీసీ చీఫ్ జోక్యం చేసుకుంటే కొలిక్కి వస్తుందని అనుకుంటున్నారట. మరి.. ఎల్లారెడ్డి కాంగ్రెస్‌లో రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో చూడాలి.