Off The Record : ఆ జిల్లా వైసీపీ నేతల్ని కోవర్ట్ భయం వెంటాడుతుందా..?

Ycp

Ycp

ఆ జిల్లా వైసీపీ నేతల్ని కోవర్ట్‌ భయం వెంటాడుతోందా? పార్టీకి సంబంధించిన వ్యవహారాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు రాజకీయ ప్రత్యర్థులకు చేరవేస్తున్నారా? ఏకంగా ఒక మంత్రే మా వాళ్ళతో టచ్‌లో ఉన్నారని ముఖ్య నాయకుడొకరు ఎందుకు ఓపెన్‌ స్టేట్‌మెంట్‌ ఇవ్వాల్సి వచ్చింది? ఏ జిల్లాలో ఉందా వాతావరణం? ఎందుకా పరిస్థితి తలెత్తింది? కర్నూల్‌ జిల్లా పాలిటిక్స్‌లో ఉన్నట్టుండి కలకలం రేగింది. అదీకూడా… రాజకీయాలతో సంబంధం లేని వ్యవహారం కావడం, దాని చుట్టూ వివాదం రేగి టీడీపీ, వైసీపీ నేతలు సవాళ్ళు విసురుకోవడంపై చర్చలు నడుస్తున్నాయి. సతీష్ అనే యువకుడు ప్రేమ వ్యవహారం వికటించి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఈ తాజా కాకకు కారణం. వైసీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి, మంత్రి టీజీ భరత్ మధ్య పరస్పర విమర్శలతో మొదలైంది పొలిటికల్ హీట్ పెరిగింది. దానికి కొనసాగింపుగా… తనను తప్పుడు కేసుల్లో ఇరికించి వేధిస్తున్నారంటూ వైసీపీ నేత బాలును ఆత్మహత్యాయత్నం చేయడంతో మేటర్‌ ఇంకా సీరియస్‌ అయింది.

వైసీపీ నేతలు జక్కంపూడి రాజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బాలుని పరామర్శించి మంత్రి భరత్ పై చేసిన వ్యాఖ్యలతో…. అధికార, ప్రతిపక్షాల మధ్య నువ్వా నేనా అన్నట్టు మారిపోయింది వాతావరణం. వైసీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా, అందుకు పోటీగా టీడీపీ ఆందోళనలతో వివాదం మరింత తీవ్ర రూపం దాల్చింది. మంత్రి భరత్ పై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, సిద్ధార్థ రెడ్డిపై మంత్రితో పాటు టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు కర్నూలు పాలిటిక్స్‌లో కాకరేపాయి. భరత్ కుటుంబాన్ని బైరెడ్డి విమర్శించే క్రమంలో… మా పార్టీలో కూడా కోవర్ట్‌లు ఉన్నారని అనడంతో వ్యవహారం కొత్త టర్న్‌ తీసుకుంది.

మంత్రి టీజీపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, ఆధారాలతో నిరూపిస్తానని అన్నారు సిద్దార్ధ రెడ్డి. జిల్లా వైసీపీ నేతలతో మంత్రి కుటుంబం టచ్‌లో ఉందని, రేపు మేం అధికారంలోకి వచ్చాక ఇబ్బందులు రాకుండా చూసుకునే ఎత్తులు వేస్తున్నారని చెప్పుకొచ్చారు బైరెడ్డి. వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు… టీజీ ఫ్యామిలీకి టచ్‌లో ఉన్నారన్నది ఆయన ఆరోపణ. అదే ఊపులో… త్వరలో జగన్ దగ్గరికి బాధితులను తీసుకువెళ్లి మాట తీసుకుంటానని చెప్పడంతో… కర్నూల్‌ వైసీపీ గ్రూప్‌ రాజకీయాల గురించి కూడా చర్చ మొదలైంది. జిల్లా పార్టీ నాయకులంతా కలిసి ఉంటే… అసలీ పరిస్థితి వచ్చేది కాదని అంటోంది బైరెడ్డి వర్గం. కర్నూలులో రౌడీయిజం పెరిగిందని కూడా అన్నారు
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. మిగతా ఆరోపణల సంగతి ఎలా ఉన్నా…. వైసీపీలో మంత్రి టీజీ భరత్‌కు సహకరించే కోవర్టులు ఉన్నారంటూ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ఇటు సొంత పార్టీలో కూడా చర్చనీయాంశం అయ్యాయి.

నిజంగానే మనవాళ్ళు మంత్రితో ఆఫ్‌లైన్‌లో అంటకాగుతున్నారా? అదే నిజమైతే… వాళ్ళు ఎవరంటూ ఫ్యాన్‌ లీడర్స్‌ ఎవరి అంచనాల్లో వాళ్ళు మునిగిపోయారు. మరోవైపు సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీ లో సీనియర్లు గుర్రుగా ఉన్నారట. పార్టీ కోసం తానొక్కడే పనిచేస్తున్నట్టు బిల్డప్‌లు ఇస్తూ మాట్లాడ్డం సరికాదని, అందరూ అండగా నిలబడకుండానే అధికారం లేకపోయినా ఇంత బలంగా ఉందా అని ప్రశ్నిస్తున్నారట. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సొంత నియోజకవర్గం నందికొట్కూరు మున్సిపాలిటీలో పార్టీ మొత్తం ఖాళీ అయి… నాయకులు టీడీపీ కండువాలు కప్పుకున్నారని, అందుకు బాధ్యులు ఎవరంటూ లాజిక్‌ లాగుతున్నట్టు తెలిసింది. మొత్తమ్మీద కర్నూలు వైసీపీలో కోవర్టుల కామెంట్స్‌ చుట్టూ పార్టీలో హాట్‌ హాట్‌ చర్చలు నడుస్తున్నాయి.