Site icon NTV Telugu

ఏపీలో ఆసక్తిగా ప్రతిపక్ష పార్టీల రాజకీయం..!

ఏపీలో ప్రతిపక్ష రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. వద్దనుకుని వదిలేసుకున్న పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో చేతులు కలుపుతున్నాయి. చెట్టపట్టాలేసుకు తిరుగుతున్నాయి. అవసరాలకు తగ్గట్టు పావులు కదుపుతున్నాయి. పక్క పార్టీ పొడే గిట్టని వాళ్లు ఈ పొత్తులకు ఎలా ఒప్పుకున్నారో….

బీజేపీని వదిలి టీడీపీ వెంట జనసేన పరుగులు?

2019 ఎన్నికలకు ముందు ఏపీలో.. టీడీపీ బీజేపీని వదిలేసింది.. జనసేన టీడీపీని వద్దనుకుంది. ఎన్నికల తర్వాత బీజేపీ-జనసేన పొత్తుపెట్టుకున్నాయి. ఇప్పటికీ అదేపొత్తు కొనసాగుతోంది. రాష్ట్రస్థాయిలో ఏదైనా విషయం వస్తే ఇప్పటికీ జనసేన, బీజేపీలు టీడీపీని టార్గెట్ చేసేస్తూనే ఉన్నాయి. కానీ స్థానిక ఎన్నికల్లో సీన్ మారిపోయింది. టీడీపీ-జనసేన చేతులు కలిపేశాయి. ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. మాకు మీరు మీకు మేం అంటూ యుగళగీతం ఆలపిస్తున్నారు. పొత్తు పెట్టుకున్న బీజేపీని పక్కన పెట్టేసిన జనసేన టీడీపీ వెంట పరగు పెడుతోంది.

పరిషత్‌ పీఠాల కోసం ఒట్టుతీసి గట్టున పెట్టిన టీడీపీ..!
ఎంపీపీ పీఠాల కోసం తూ.గో.జిల్లాలో టీడీపీ, జనసేన జట్టు..!
ప.గో. జిల్లాలోనూ టీడీపీ, జనసేనల మధ్య పదవుల పంపకం..!

పార్టీ పెద్దల అనుమతి ఉందో లేదో కానీ తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల పరిషత్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పని చేస్తున్నాయి. ఎన్నికలను బహిష్కరించాం అని చెబుతున్న టీడీపీ కూడా ఇక్కడ మండల పరిషత్తుల కైవశం కోసం ఒట్టు తీసి గట్టున పెట్టేసింది. పరిషత్ పీఠాల కోసం హోరాహోరీ పోరాడుతోంది. తూర్పుగోదావరి జిల్లా కడియం, పి. గన్నవరం, ఆలమూరు, రాజోలు, వి.ఆర్. పురం మండలాల్లో వైసీపీకి ఆశించిన మెజార్టీ రాలేదు. ఇక్కడ విడివిడిగా పోటీ చేసిన టీడీపీ, జనసేనలు కలిస్తే మండలాధ్యక్ష పదవులను కైవశం చేసుకునే అవకాశం వచ్చింది. ఇంకేం ఉంది. రెండు పార్టీలు రంగంలోకి దిగాయి. పదవులు పంచేసుకున్నాయి. అలాగే పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం, ఆచంటలోనూ ఇదే సీన్. ఈ రెండుచోట్ల కూడా టీడీపీ-జనసేన జట్టుకట్టాయి. మండల పరిషత్తు అధ్యక్ష పదవులను బలాబలాను బట్టి రెండేళ్లు, మూడేళ్ల చొప్పున ఈ పార్టీలు పంచేసుకుంటున్నాయట.

భవిష్యత్‌పై ఆలోచనతో టీడీపీతో జనసేన కలిసిపోయిందా?
జనసేన విషయంలో టీడీపీకి అభ్యంతరాలు లేవా?
ఏమీ తెలియనట్టుగా ఉండిపోయిన బీజేపీ..!

వద్దనుకున్న టీడీపీతో కలిసి పదవులు పంచుకోడానికి జనసేన హైకమాండ్ ఎలా అనుమతి ఇచ్చిందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. టీడీపీపై గతంలో చేసిన ఆరోపణలను జనసేన అధినాయకత్వం మరిచిపోయిందో.. లేక భవిష్యత్తుపై ఆలోచనతో ఉందో కానీ.. టీడీపీతో కలిసిపోయింది. తమతో ఉన్న జనసేనపార్టీ టీడీపీతో కలవడానికి బీజేపీ ఎలా ఒప్పకుందన్నదీ ఆసక్తికరమే. పైగా ఈ ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లా పార్టీ రహితం కాదు కూడా. పార్టీ గుర్తుల మీద జరిగినవే. పొత్తు అంటే పొత్తే. అది ఏ ఎన్నికైనా అలానే కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఇలాంటి పొత్తుల్నే చూశాం. మరి ఈ లెక్కలు ఏంటో.. ఏమిటో.? జనసేన విషయంలో టీడీపీకి అభ్యంతరాలు లేవు. ఆ పార్టీ దూరం కావాలని టీడీపీ కోరుకోలేదు. 2019 ఎన్నికల్లో జనసేన కారణంగా దాదాపు 30 అసెంబ్లీ స్థానాల్లో ఓడిపోయామని టీడీపీ లెక్కలు వేసుకుంది. జనసేన అవసరం టీడీపీకి బాగా తెలుసు. అందుకే ఆ పార్టీ అడిగిందే తడవుగా స్థానిక పొత్తులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. వద్దనుకున్నటీడీపీతో కలవడం పదవుల కోసం.. పార్టీ భవిష్యత్తు కోసమా? అన్నది చెప్పాల్సింది జనసేనే. బీజేపీ మాత్రం మొత్తం ఎపిసోడ్ ను చూస్తూనే ఏమీ తెలియనట్టు ఉందట.

తూ.గో. జిల్లా ఏజెన్సీలో వైసీపీ, సీపీఎం జట్టు!

ఈ రెండు పార్టీలే కాదు… వైసీపీ, సీపీఎం కూడా ఓ మండలంలో చేతులు కలపబోతున్నాయట. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలోని వీఆర్ పురం మండలంలో 8ఎంపీటీసీ స్థానాలకుగాను వైసీపీ 4, సిపిఎం 3,జనసేక ఒకచోట గెలిచాయి. మండలాధ్యక్ష పీఠం దక్కించుకునేందుకు వైపీసీ-సిపిఎం జతకట్టే పరిస్థితి వచ్చింది. అధికారాన్ని చెరో రెండేళ్లు పంచుకునేలా ఈ పార్టీల మధ్య ఒప్పందం కుదిరిందట. మరి.. పార్టీల మిలాప్‌లు రానున్న రోజుల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తాయో చూడాలి.

Exit mobile version