పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల బెడద కిందిస్థాయి కార్యకర్తలకు ఇబ్బందులు తెచ్చి పెడుతోందట. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు, ఓదెలు జడ్పీటీసీ గంటా రాములు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. రెండు గ్రూపులుగా విడిపోయి పార్టీ వేరు కుంపటి పెట్టేశారు. దీంతో ఎవరి వైపు వెళ్లాలో కాంగ్రెస్ శ్రేణులకు అర్థం కావడం లేదట.
రాజకీయంగా విజయ రమణారావు, రాములు ఇద్దరు గురు శిష్యులు. గతంలో టీడీపీ ఉన్నవాళ్లే. మారిన రాజకీయ సమీకరణాలతో టీడీపీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఇద్దరూ ఉబలాట పడుతుండటంతో ఒకరంటే ఒకరికి గిట్టడం లేదు. పెద్దపల్లి కాంగ్రెస్ ఇంఛార్జ్‌గా విజయ రమణారావు ఉన్నప్పటికీ పార్టీలో తనకున్న పరిచయాల ఆధారంగా పావులు కదుపుతున్నారట రాములు. దీంతో ఆయనపై విజయ రమణారావు, డీసీసీ అధ్యక్షుడు కొమురయ్యలు కారాలు మిరియాలు నూరుతున్నారట. పార్టీ లైన్ దాటి రాములు పనిచేస్తున్నారని పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.
పెద్దపల్లిలో గంటా రాములు చేపడుతున్న పార్టీ కార్యక్రమాలకు మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు హాజరవుతున్నారు. దీంతో రాములు వెనక శ్రీరాములు ఉన్నట్టు ఓపెన్ టాక్. కాంగ్రెస్ ఎమ్మెల్యేనే హాజరైనప్పుడు తన కార్యక్రమాలకు పార్టీకి వ్యతిరేకమని ఎలా చెబుతారని రాములు ప్రశ్నిస్తున్నారు. పెద్దపల్లిలో బీసీ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారని.. అదే సామాజికవర్గానికి చెందిన తనకే టికెట్ వస్తుందని రాములు చెబుతున్నారట. అయితే మాజీ ఎమ్మెల్యేగా పెద్దపల్లి గురించి పూర్తి అవగాహన తనకే ఉందని.. పార్టీ గుడ్‌లుక్స్ సైతం తనపైనే ఉన్నాయని విజయ రమణారావు వ్యాఖ్యానిస్తున్నారట.
పెద్దపల్లిలో కాంగ్రెస్ కేడర్ బలంగానే ఉందన్నది పార్టీ నేతల మాట. కానీ.. విజయ రమణారావు, గంటా రాముల మధ్య నెలకొన్న ఆధిపత్యపోరు కారణంగా శ్రేణులు డీలా పడుతున్నాయట. ఇద్దరూ ఒకప్పుడు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అనుచరులే కావడంతో ఎవరికి ఏం చెప్పాలో పాలుపోవడం లేదని జిల్లా నేతలు అంతరంగిక సమావేశాల్లో కామెంట్స్ చేస్తున్నారట. సుల్తానాబాద్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని.. ఓదేల మండలానికి చెందిన గంటా రాములు టికెట్ రాకపోతే పార్టీ మారి అయినా బరిలో ఉంటానని అనుచరులకు స్పష్టం చేస్తున్నారట రాములు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి పెద్దపల్లి కాంగ్రెస్ రాజకీయం హీట్ పెరుగుతోంది. మరి.. ఈ సమస్యను పార్టీ పెద్దలు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.