Site icon NTV Telugu

Kothagudem Tension: మాట వినకుంటే సరెండర్‌

ఆ మున్సిపాలిటీలో ఒకరి వెంట ఒకరు సరెండర్‌ అవుతున్నారా? మాట వినని వారికి అదే పనిష్మెంటా? కావాలని తీసుకొచ్చినవాళ్లే.. తిరుగు టాపా కట్టించేస్తున్నారా? దీంతో అక్కడికి రావడానికి అధికారులు, ఉద్యోగులు జంకే పరిస్థితి ఉందా?

మాట వినకపోతే కౌన్సిల్‌లో తీర్మానం చేసి సరెండర్‌ చేస్తున్నారా?
ఈ మధ్య కాలంలో కొత్తగూడెం రాజకీయాలు చాలా హాట్ హాట్‌గా ఉంటున్నాయి. వనమా రాఘవ ఎపిసోడ్‌ తర్వాత అక్కడ చీమ చిటుక్కుమన్నా అటెన్షన్‌ వచ్చేస్తోంది. ఇప్పుడు కొత్తగూడెం మున్సిపాలిటీ వంతు వచ్చింది. పురపాలక సంఘం అధికారులకు.. కౌన్సిలర్లకు అస్సలు పడటం లేదు. గిట్టనివారిని విచిత్రంగా పంపించి వేస్తున్నారు ప్రజాప్రతినిధులు. అధికారులు తమకు తాముగా వెళ్లిపోతే ఏ గొడవా లేదు. లేకపోతే కౌన్సిల్‌లో తీర్మానం చేసి ప్రభుత్వానికి సరెండర్‌ చేయడం చర్చగా మారింది.

మొన్నటి వరకు వనమా రాఘవ మాటే చెల్లుబాటు
కొత్తగూడెం మున్సిపాలిటీలో అధికార, విపక్షపార్టీల మధ్య గొడవలు కామన్‌. అదే అధికారుల దగ్గరకు వచ్చేసరికి ప్రజాప్రతినిధుల మధ్య పార్టీల సరిహద్దులు చెరిగిపోతున్నాయి. అంతా ఒక్క మాటపైకి వచ్చేస్తున్నారు. మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా కాపు సీతామహాలక్ష్మి ఉన్నప్పటికీ.. నిన్న మొన్నటి వరకు అక్కడ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవ చెప్పిందే నడిచేది. మున్సిపాలిటీలో ఎవరికి పోస్టింగ్‌ ఇవ్వాలన్నా రాఘవ అనుమతి కావాల్సిందే. దాంతో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌, కమిషనర్లు డమ్మీలనే ముద్ర పడింది. అవినీతి శ్రుతిమించి ఆరోపణలు గుప్పమనడంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్న ఉదంతాలు ఉన్నాయి.

కలెక్టర్‌ ఆగ్రహంతో లాంగ్‌ లీవ్‌లో కమిషనర్‌
కమీషన్‌ వస్తుందంటే చాలు.. మున్సిపాలిటీ పరిధిలో లేని వాటికి కూడా పనులు చేసిన ఘనత కొత్తగూడెం పురపాలక సంఘానికే చెల్లుతుంది. వీధి వ్యాపారుల కోసం కట్టిన నిర్మాణాలు నిరుపయోగంగా పడిఉన్నాయి. మొక్కల పెంపకం పేరుతో నిధులు దుర్వినియోగం చేయడంతో కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తే.. మున్సిపల్‌ కమిషనర్‌ లాంగ్‌ లీవ్‌ పెట్టి వెళ్లిపోయారు. అన్ని విధాలుగా సహకరిస్తున్న కమిషనర్‌ వెళ్లిపోవడంతో కౌన్సిలర్లు ఇరకాటంలో పడ్డారట. ఇంఛార్జ్‌ కమిషనర్‌గా వచ్చిన నవీన్‌ అనే అధికారి మాట వినకపోవడంతో.. ఆయన్ని ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తూ ఏకంగా మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో తీర్మానం చేసేశారు. అంతకుముందు ఓ డీఈకి కూడా ఇదే విధంగా గేట్ పాస్‌ఇచ్చారు.

కొత్తగూడెం వచ్చేందుకు అధికారులు జంకు
పొలిటికల్‌ లీడర్స్‌ జోక్యం ఎక్కువ కావడంతో మున్సిపాలిటీని సెట్‌రైట్‌ చేయడం ఉన్నతాధికారులకు సాధ్యం కావడం లేదట. ఈ విషయంలో కలెక్టర్‌ కొంత చొరవ తీసుకుని చేతులు కాల్చుకున్నట్టు లోకల్‌గా చెవులు కొరుక్కుంటున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో అందరికీ తెలిసిపోవడంతో.. కొత్తగూడెం మున్సిపాలిటీకి వచ్చేందుకు అధికారులు జంకుతున్నారట. ఉన్నతాధికారులు నచ్చచెప్పినా తల అడ్డంగా ఊపుతున్నారట. మరి.. కొత్తగూడెం పురపాలక సంఘాన్ని గాడిలో పెట్టేందుకు ఎవరు చొరవ తీసుకుంటారో చూడాలి.

Exit mobile version