Site icon NTV Telugu

Off The Road: చుట్టపు చూపుగా కందుకూరు వైసీపీ ఇంచార్జ్ బుర్రా మధుసూదన్ !

Otr Kandukur Ycp

Otr Kandukur Ycp

Off The Road: ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ వైసీపీ పరిస్థితి అయోమయం.. గందరగోళం అన్నట్టు మారిపోయింది. ఇన్ఛార్జ్‌ బుర్రా మధుసూదన్ యాదవ్ చుట్టుపు చూపుగా వచ్చి వెళ్తుండటం.. ముఖ్యమైన కార్యక్రమాలు సైతం ద్వితీయ శ్రేణి నేతలే పర్యవేక్షించాల్సి రావటంతో కేడర్‌లో నైరాశ్యం పెరుగుతోంది. మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా పార్టీ నిర్వహించిన కోటి సంతకాల సేకరణ లాంటి కార్యక్రమంలో కూడా బుర్రా మమ అనిపించడంతో.. భారమంతా ద్వితీయ శ్రేణి నేతలే మోయాల్సి వచ్చింది. దీంతో… ఇలా ఇంకెన్నాళ్ళంటూ… తీవ్రంగా ఫ్రస్ట్రేట్‌ అవుతున్నారు నాయకులు. ఇలాగే వదిలేస్తే…. బలంగా ఉన్న నియోజకవర్గాన్ని శాశ్వతంగా మర్చిపోవాల్సి వస్తుందని కూడా అంటున్నారు నాయకులు. గ్రూప్‌ పాలిటిక్స్‌కు పెట్టింది పేరైన కందుకూరు నియోజకవర్గం రాజకీయం మొత్తం దాదాపు ఆరు దశాబ్దాల పాటు మానుగుంట, దివి కుటుంబాల మధ్యే నడిచింది. అయితే గత ఎన్నికల్లో తొలిసారి ఆ రెండు ఫ్యామిలీల ప్రమేయం లేకుండా పోయింది. టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన ఇంటూరి నాగేశ్వరరావు వైసీపీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ పై గెలిచారు. ఎన్నికల టైంలో చేసిన మార్పుల్లో భాగంగా… అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డిని పక్కన పెట్టిన వైసీపీ అధిష్టానం కనిగిరి నుంచి బుర్రాను ఇంపోర్ట్‌ చేసింది. దీంతో ఎన్నికల ముందు నుంచే మహీధర్ రెడ్డి సహా ఆయన ప్రధాన అనుచర గణం అంతా సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ పార్టీ ఓటమికి అది కూడా ఒక కారణం అంటారు. ఈ పరిస్థితుల్లో ఓటమి తర్వాత కందుకూరు వైసీపీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయినట్టు చెబుతున్నారు కార్యకర్తలు.

తిరిగి కనిగిరి వెళ్ళాలన్న ఆలోచనతో ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్‌ కందుకూరును లైట్ నియోజకవర్గాన్ని లైట్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఏదో… పెద్దోళ్ళు ఓ బాధ్యత నెత్తినేశారు. మనం కూడా కాదనకుండా కొన్నాళ్ళ పాటు అలా… అలా టైంపాస్‌ చేసేస్తే పోలా అన్న ధరణితో నొప్పింపక.. తానొవ్వక అన్నట్టు పండక్కో.. పబ్బానికో మెరుపు తీగలా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారట. సరే… సార్‌ రాకపోతే పోయారు. కనీసం ఆఫీస్‌ ఖర్చుల కోసమైనా డబ్బులిస్తారా అంటే… అదీ లేదంటున్నారు ద్వితీయ శ్రేణి నాయకులు. కార్యాలయం, కార్యక్రమాల నిర్వహణ భారం కలగలిసి తడిసి మోపెడవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తోంది కందుకూరు వైసీపీ ద్వితీయ శ్రేణి. అదే సమయంలోమహీధర్ రెడ్డి కందుకూరులోని తన సొంత కార్యాలయానికి తరచూ వస్తూ అనుచరులకు అందుబాటులో ఉంటున్నా… వైసీపీ వ్యవహారాలతో మాత్రం టచ్‌ మీ నాట్‌ అంటున్నారు. అసలాయన వైసీపీలో ఉన్నారా.. లేరా అన్న చర్చ సైతం జరుగుతోంది నియోజకవర్గంలో. 2029 ఎన్నికల్లో కచ్చితంగా కందుకూరు నుంచే పోటీ చేస్తానని సన్నిహితులతో చెబుతున్న మానుగుంట ఏ పార్టీ నుంచి అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదట.

మరోవైపు గత ప్రభుత్వ హయాంలో కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపటంపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తాజాగా కూటమి ప్రభుత్వం తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపింది. ఆ క్రమంలో ఈ ప్రాంతానికి కీలకమైన రామాయపట్నం పోర్టు కూడా ప్రకాశం జిల్లాలోకి వచ్చినట్లైంది. జిల్లా మార్పు, పోర్ట్‌ క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకుని పట్టు తగ్గకుండా జాగ్రత్త పడుతోంది టీడీపీ. దీన్ని ఇలాగే కొనసాగిస్తే… కందుకూరు తమ కంచుకోట అవుతుందన్నది తెలుగుదేశం నేతల అభిప్రాయం. ఇలాంటి టైంలో ఇన్ఛార్జ్‌ ఉన్నా లేనట్టుగా మారిపోవడం, కీలక నేత మహీధర్ రెడ్డి సైలెంట్ కావటంతో వైసీపీ కేడర్‌లో గందరగోళం పెరుగుతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం కంటే ముందుగానే మేల్కొవటం మంచిదంటూ అధిష్టానానికి విన్నవించుకుంటోంది కేడర్‌. కందుకూరు ఫ్యాన్‌ ఎప్పుడు గిరగిరా తిరుగుతుందో చూడాలి మరి.

Exit mobile version