Site icon NTV Telugu

Off The Record: కాంగ్రెస్ సర్కారులో బీఆర్ఎస్ కోవర్టులు ? సీఎం సీరియస్, దర్యాప్తుకు ఆదేశం ?

Congress

Congress

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో బీఆర్‌ఎస్‌ కోవర్ట్‌లు ఉన్నారా? అదీకూడా… పై స్థాయిలోనే ఉన్నారా? ప్రభుత్వంలో చీమ చిటుక్కుమన్నా వెంటనే సమాచారాన్ని ప్రతిపక్షానికి చేరవేస్తున్నారా? ఆ దొంగలెవరో ఇప్పుడు రేవంత్‌ సర్కార్‌ పసిగట్టేసిందా? హిల్ట్‌ పాలసీ లీక్‌తో తీగ లాగితే డొంకలే కదులుతున్నాయా? ఇంతకీ ఎవరా కోవర్ట్‌లు? వాళ్ళ విషయంలో ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతోంది? తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన పాలసీ హిల్ట్‌. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ పేరుతో… పారిశ్రామిక వాడల్లో మల్టీపర్పస్‌ జోన్స్‌ అభివృద్ధికి ఉద్దేశించిన విధానం అది. నగర అభివృద్ధిలో ఇదో మైలురాయిగా నిలిపోతుందని ప్రభుత్వం భావిస్తుండగా… అసలా పాలసీ పూర్తి స్థాయిలో రూపు దిద్దుకోకముందే వివరాలు, బ్లూ ప్రింట్‌ మొత్తం ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ చేతికి చేరింది. కొంతమంది మంత్రులకంటే ముందుగా వివరాలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తెలియడం, ఆయన మీడియా సమావేశం పెట్టి ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేయడంతో షాకయ్యారు ప్రభుత్వ పెద్దలు. ఇక సీఎం రేవంత్‌ రెడ్డి అయితే…దీనిపై తీవ్ర అసహనానికి గురయ్యారు. మేటర్‌ అసలు మంత్రివర్గంలో చర్చకు రాక మునుపే బీఆర్ఎస్ వాళ్ళ చేతికి ఎలా చేరిందో తేల్చమని విజిలెన్స్‌ దర్యాప్తునకు ఆదేశించారాయన. స్వయంగా ముఖ్యమంత్రే సీరియస్‌ అయిపోవడంతో… అలర్ట్‌ అయిన దర్యాప్తు అధికారులు బాగా లోతుల్లోకి వెళ్ళి పూర్తి వివరాలు సేకరించి ఓ డిటైల్డ్‌ రిపోర్ట్‌ని ప్రభుత్వానికి అందజేశారట. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత స్థానంలోనే కోవర్టులు ఉన్నారంటూ ఆ రిపోర్ట్‌లో ఉందన్న వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేపుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమర్పించిన నివేదికలో పలు కీలకమైన అంశాలను ప్రస్తావించినట్టు తెలుస్తోంది. హిల్ట్ పాలసీ సమాచారాన్ని ముందే ప్రతిపక్షానికి లీక్ చేసిన వ్యవహారంలో ఇద్దరు ఐఎఎస్‌ అధికారులతో సహా నలుగురు ఆఫీసర్స్‌ పాత్ర ఉన్నట్టు విజిలెన్స్ గుర్తించిందట.

విజిలెన్స్‌ రిపోర్ట్‌లో పేరుందని ప్రచారం జరుగుతున్న ఓ ఐఎఎస్‌ ఇప్పటికే ప్రభుత్వ పెద్దల్ని కలిసి అందులో తన పాత్రేమీ లేదని వివరణ ఇచ్చుకున్నట్టు కూడా సచివాలయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కి చెందిన ఇద్దరు అధికారుల ప్రమేయంపై విచారణ జరుగుతుండగా, ఇటీవల అదే శాఖలోని మరో అధికారిని బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. హిల్ట్ పాలసీపై కొద్ది రోజులుగా రాజకీయ దుమారం నడుస్తోంది. దీని ద్వారా దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల భూ దోపిడీకి తెర తీశారంటూ బీఆర్ఎస్, బీజేపీ తీవ్రంగా విమర్సిస్తున్నాయి. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి అతి పెద్ద అవినీతికి తెరలేపారంటూ డైరెక్ట్‌గా టార్గెట్‌ చేస్తున్నారు విపక్ష నాయకులు. దాంతో సీరియస్‌నెస్‌ పెరిగిపోయింది. అసలు ప్రాధమిక దశలోనే వివరాలు విపక్షానికి లీక్‌ అవడంతో… ప్రభుత్వంలో ప్రతిపక్ష కోవర్ట్‌ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయింది. హిల్ట్‌ పాలసీ ముసాయిదా లీకు కావడంపై తొలుత పరిశ్రమల శాఖ, టీజీఐఐసీ ఉన్నతాధికారులను అనుమానించారు. వాళ్ళలో ఎవరో ఒకరు ఈ నిర్వాకానికి ఒడిగట్టారని, ముసాయిదా ప్రతిని హార్డ్ కాపీ రూపంలో పంపించారని అంచనాకు వచ్చారు.

దాంతో పరిశ్రమల శాఖ ఉన్నతాధికారుల్లో బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నవారు ఎవరంటూ ఆరా తీసి, వారి కదలికలపై నిఘా పెట్టారు. అదే సమయంలో పాలసీ డ్రాఫ్ట్ లీకేజీ పై మంత్రివర్గంలో పెద్ద ఎత్తున చర్చ జరిగినట్లు తెలుస్తోంది. క్యాబినెట్ లో జరిగిన నిర్ణయాలు వెంటనే ప్రతిపక్షాలకు వెళ్లాడాన్ని ముఖ్యమంత్రి సీరియస్ గా తీసుకున్నారు. దాంతో అన్ని మార్గాల్లో కూపీ లాగిన విజిలెన్స్‌ ఫైనల్‌గా పరిశ్రమల శాఖకు చెందిన ఇద్దరు, ముగ్గురు అధికారుల ద్వారానే సమాచారం లీక్ అయినట్టు నిర్ధారణకు వచ్చింది. అయితే… ఇంటి దొంగలెవరో తెలిసిపోయింది.ఇక వారి విషయంలో ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందన్నది ఉత్కంఠగా మారింది. ప్రతిపక్షానికి ప్రభుత్వ సమాచారం చేరవేయడాన్ని సీరియస్‌గా తీసుకుని వాళ్ళని ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తుందా? లేక శాఖపరమైన చర్యలు తీసుకుంటా అన్నది చూడాలి.

 

Exit mobile version