Site icon NTV Telugu

Off The Record : పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్సీల విషయంలో వైసీపీ వ్యూహం ఏంటి ?

Ycp

Ycp

పార్టీ మారిన ఆ ఆరుగురు ఎమ్మెల్సీల విష‌యంలో వైసీపీ వ్యూహామేంటి? వారి మీద అనర్హత వేటు వేయాల‌ని ఫిర్యాదు చేస్తుందా? లైట్ తీసుకుంటుందా? 15 నెల‌లుగా త‌మ రాజీనామాల విష‌యంలో ఎటు తేల్చటం లేదంటూ కోర్టు వ‌ర‌కు వెళ్లిన ఎమ్మెల్సీల‌కు వైసీపీ వ్యూహం అంతుపట్టడం లేదా?వీరి విష‌యంలో జ‌గ‌న్ ట్రీట్మెంట్ ఎలా ఉండ‌బోతోంది? మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే వైసీపీ ప‌రిమితం కావ‌టంతో ప్రతిప‌క్ష హోదా కూడా దక్కలేదు. హోదా లేకుంటే స‌భ‌లో మాట్లాడేందుకు స‌మ‌యం కూడా ఉండ‌దు.అందుకే మేం స‌భ‌కు రాలేమంటున్న వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్రజా సమస్యలపై నేరుగా మీడియాలో మాత్రమే స్పందిస్తున్నారు. మ‌రోవైపు మండ‌లిలో వైసీపీకి స‌రిప‌డా బ‌లం ఉండ‌టంతో ఆ పార్టీ ఎమ్మెల్సీలు అక్కడ అధికార పార్టీకి ట‌ఫ్ ఫైట్ ఇస్తున్నారు.మండలిలో మెజార్టీ ఉండటంతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్న వైసీపీకి ఝలక్ ఇచ్చేందుకు ప్రయ‌త్నించాయి కూట‌మి పార్టీలు.ఆ పార్టీకి చెందిన ప‌లువురు ఎమ్మెల్సీల‌కు గాలం వేయడంతో పోతుల సునీత, జకియా ఖానమ్, కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ్‌ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జ‌య‌మంగ‌ళ వెంక‌ట‌ర‌మ‌ణ‌ వంటి వారు ఇప్పటికే తమ పదవులకు రాజీనామా చేశారు.. పోతుల సునీత, జకియా ఖానమ్ లు బీజేపీలో చేర‌గా, కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ్‌ చక్రవర్తి, మర్రి రాజశేఖర్ ముగ్గురు సైకిలెక్కారు. జ‌య‌మంగ‌ళ వెంక‌ట‌ర‌మ‌ణ జ‌న‌సేన‌కు జైకొట్టారు.ఇప్పటికే ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేసిన సభ్యులు కూట‌మి పార్టీల్లో చేరిపోవ‌టంతో రాజకీయం రసవత్తరంగా మారింది. 13 నెలల నుంచి వైసీపీ స‌భ్యుల‌ రాజీనామాలు చైర్మన్ ఆమోదించడం లేదు. ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ రాజీనామాలపై ఛైర్మన్ తన నిర్ణయాన్ని ప్రకటించడం లేదని కోర్టుకు కూడా వెళ్లారు జంపింగ్ ఎమ్మెల్సీలు.

శాసనమండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58. అందులో గవర్నర్ కోటా కలుపుకుని వైసీపీ సభ్యులు 35. టీడీపీకి 10 మంది, జనసేనకు ఇద్దరు, బీజేపీకి ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. పలువురు ఇండిపెండెంట్లు ఉన్నారు. వైసీపీకి ఆరుగురు రాజీనామా చేయడంతో ఆ పార్టీ ఎమ్మెల్సీల సంఖ్య 29కి పడిపోయినట్లు అయింది..మండలిలో వైసీపీ గట్టిగానే ఫైట్ చేస్తుంది. ప్రభుత్వ వైఫల్యాలను వైసీపీ ఎమ్మెల్సీలు గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. దీంతో రాజీనామాలు త్వర‌గా ఆమోదిస్తే ఆ బ‌లం త‌మ‌కు పెరుగుతుంద‌ని లెక్కలు వేస్తుంది కూట‌మి.కానీ మండలి ఛైర్మన్ మోషెన్‌ రాజు ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదించకపోవడంతో కుత‌కుత‌లాడుతున్నారు కూట‌మి పార్టీల‌ పెద్దనేత‌లు.. ఆయనపై అవిశ్వాసానికి పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో మరికొందరు వైసీపీ ఎమ్మెల్సీలు చేత రాజీనామా చేయించి..వారిని టీడీపీలో చేర్చుకునే ప్లాన్ నడుస్తోందట. రాజీనామా చేసిన సభ్యులు పోను..మిగిలిన ఎమ్మెల్సీలతో మోషెన్‌ రాజు మీద అవిశ్వాస అస్త్రం ప్రయోగిస్తే తామే గెలిచే అవకాశం ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారట.

మండ‌లి నుంచి ఆరుగురు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామ‌లు చేసినా జ‌గ‌న్ మాత్రం స్పందించ‌లేదు. గ‌తంలోనే ప‌లువురు కీల‌క నేత‌లు పార్టీని వీడిన స‌మ‌యంలోనే పోయేవాళ్లు పోతారు.. ఉండేవాళ్లు ఉంటారు.. ఉన్నవాళ్లతోనే రాజ‌కీయం చేసుకుంటాన‌ని చెప్పిన జ‌గ‌న్ అదే త‌ర‌హాలోనే ఉన్నారు..బలమైన నాయకులు పార్టీని వీడి వెళ్లినా.. జగన్ వారిని ఆపడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. వారికి ఫోన్ చేసి మాట్లాడలేదు.. చర్చలు జరపలేదు.. ఇప్పుడు కూడా ఆయన అదే విధమైన ధోరణిలోనే ఉన్నారు.. పార్టీ నుంచి ఎవరైనా వెళ్ళిపోతే పట్టించుకోవడం కంటే.. ఉన్నవారితోనే ముందుకు వెళ్లడమే జగన్ పాలసీ అని ఆ పార్టీ నేత‌లు చెప్పుకుంటారు.ఇప్పుడు కూడా అదే త‌ర‌హాలోనే ఉన్నట్లు స‌మాచారం.. రాజీనామాలు చేసిన‌ ఎమ్మెల్సీలు త‌మ గూడు తాము వెతుక్కోవ‌టం.. జ‌య‌మంగ‌ళ వంటి వారు కోర్టు వ‌ర‌కూ వెళ్లినా త‌మ పార్టీకి వ‌చ్చే న‌ష్టమేమి ఉండ‌ద‌ని భావిస్తుండ‌వ‌చ్చంటున్నారు ప‌రిశీల‌కులు. వీరి రాజీనామాలు ఆమోదం పొందితే మ‌రికొంద‌రు రాజీనామాలు చేసే అవ‌కాశం ఉండ‌టంతో…వీరి రాజీనామాలు ఆమోదించుకుండా చూసుకుంటే స‌రిపోతుంద‌ని లెక్కలు వేసుకుంటున్నారు.ఎలాగూ ఛైర్మన్ రాజీనామాల విష‌యంలో గ‌ట్టిగానే ఉండ‌టంతో 2027 వ‌ర‌కూ త‌మ‌కొచ్చిన ఇబ్బందేమీ ఉండ‌ద‌ని ఆ పార్టీ అభిప్రాయంగా క‌నిపిస్తుంది.. అయితే కోర్టు నుంచి మండ‌లి ఛైర్మన్‌కు ఇప్పటికిప్పుడు ఏధైనా డైరెక్షన్ వ‌చ్చే అవ‌కాశం ఉండ‌క పోవ‌చ్చని అంచ‌నా. పార్టీ అంచ‌నాలు తారుమారు అయితే అప్పుడు ఆలోచించుకోవ‌చ్చని ఆ పార్టీ భావిస్తుందట. వారి రాజీనామాలు ఆమోదం పొందినా మండ‌లిలో బ‌లం విష‌యంలో త‌మ‌కు వ‌చ్చే న‌ష్టమేమీ ఉండ‌ద‌ని లెక్కలు క‌ట్టిన‌ట్లు స‌మాచారం.. దీంతో ప్రస్తుతానికి జ‌రిగే తంతును ప‌రిశీలిస్తూ ఉండ‌ట‌మే స‌రైన వ్యూహం అని ఆ పార్టీ భావిస్తూ ఉండ‌వ‌చ్చని భావిస్తున్నారు పొలిటిక‌ల్ పండిట్స్.. మ‌రి రాజీనామాలు చేసిన ఎమ్మెల్సీల విష‌యంలో జ‌గ‌న్ లెక్కలు ఏంటి.. ఆ పార్టీ ఏం చేస్తుంద‌నేది చూడాలి..

 

Exit mobile version