తమ కుమార్తెలకు జడ్పీపీఠం దక్కేలా ఇద్దరు తండ్రులు సామదాన దండోపాయాలు ప్రయోగిస్తున్నారు. మరొకరు తమ సామాజికవర్గం మహిళకు చైర్ పర్సన్ పీఠం వచ్చేలా చక్రంతిప్పుతున్నారు. ముగ్గురు నేతలు..మూడు రాజకీయ సమీకరణాలు..మూడు సామాజిక వర్గాల లెక్కలు. పసుపు దండులో బస్తీమే సవాల్‌గా మారింది విజయనగరం జడ్పీ సింహాసనం కుర్చీ కుస్తీ.
విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ ఉత్కంఠ పెరుగుతోంది. అధికార తెలుగుదేశం పార్టీలో మూడు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సిరి సహస్ర, కర్రోతు చంద్రకళ, పాశల నీరజ. వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుంది..పార్టీ అధిష్టానం ఎలాంటి ప్రాతిపదికన నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.
విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ రేసులోమొదటి నుంచి ఎక్కువగా వినిపిస్తున్న పేరు సిరి సహస్ర. టీడీపీ నేత చిన్న శ్రీను కుమార్తె కావడంతో ఆమె అభ్యర్థిత్వంపై మొదటి నుంచీ ఆసక్తి నెలకొంది. చిన్న శ్రీను టీడీపీలో చేరినప్పటి నుంచే జిల్లాలో తన రాజకీయ ప్రాధాన్యతను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్న చర్చ ఉంది. ఇదే క్రమంలో తన కుమార్తెను తెర్లాం జెడ్పీటీసీగా బరిలో నిలిపి గెలిపించుకోవడంతో ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ పీఠంపై మరిన్ని ఆశలు పెట్టుకున్నారని తెలుస్తోంది. అయితే సిరి సహస్ర కుల ధృవీకరణ పత్రంపై వైసీపీ అభ్యంతరాలు వ్యక్తం చేయడం, ఈ అంశంపై కోర్టు జిల్లా కలెక్టర్ నుంచి నివేదిక కోరడం చిన్న ప్రయత్నాలకు స్పీడ్ బ్రేకర్లుగా మారాయన్న చర్చ జరుగుతోంది.
విజయనగరం జడ్పీ రేసులో వినిపిస్తున్న రెండో పేరు కర్రోతు చంద్రకళ. భోగాపురం జెడ్పీటీసీగా గెలిచిన ఆమె.. నెల్లిమర్ల టీడీపీ ఇన్చార్జ్ కర్రోతు బంగార్రాజు కుమార్తె. కూటమి పొత్తుల కారణంగా నెల్లిమర్ల అసెంబ్లీ టికెట్ జనసేనకు వెళ్లడంతో బంగార్రాజు పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తర్వాత ఆయనకు రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్ బాధ్యతలు దక్కాయి. అంతకుమించి తనకేం చేశారంటూ చంద్రకళ అభ్యర్థిత్వం కోసం బంగార్రాజు తనకున్న అన్ని పరిచయాలనూ ఉపయోగిస్తున్నారు. గెలిచిన దగ్గర్నుంచి అమరావతిలోనే తిష్టవేసి పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
జడ్పీ పీఠం రేసులో వున్న మూడో పేరు పాశల నీరజ. బొండపల్లి జెడ్పీటీసీగా గెలిచిన ఆమె అభ్యర్థిత్వం వెనుక మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ప్రోత్సాహం ఉందన్న ప్రచారం ఉంది. బొండపల్లి నుంచి బొత్స సత్యనారాయణ కుమార్తె అనూష పోటీలో నిలవడంతో, ఆమెకు ప్రత్యర్థిగా నీరజను నిలబెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పుడు నీరజ పేరు జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలోనూ ప్రధానంగా ప్రస్తావనకు వస్తోందట. అలాగే జిల్లాలో వెలమ సామాజిక వర్గానికి చెందిన పలువురు జెడ్పీటీసీలుగా ఎన్నికయ్యారన్న అంశాన్ని ఆ వర్గ నాయకులు ప్రస్తావిస్తున్నారు. మొత్తం 27 జెడ్పీటీసీ స్థానాల్లో ఏడు స్థానాలను వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు గెలుచుకున్నారన్న వాదనను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సొంత పార్టీ వారే చెబుతున్నారు. అయితే ఇప్పటికే అదే సామాజిక వర్గానికి చెందిన కొండపల్లి శ్రీనివాసరావు మంత్రిగా ఉండటం కూడా చర్చలో మరో అంశంగా మారింది. ఒకే సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇవ్వడమేంటని కూడా కొందరు ప్రస్తావిస్తుండటం పాశల నీరజకు ప్రతిబంధకం అవుతోందన్న డిస్కషన్ నడుస్తోంది.
ముగ్గురు ఆశావహులకు ప్లస్సులు, మైనస్సులు రెండూ వున్నాయి. ఎవరికి వారే తమదైన అస్త్రాలనూ సంధిస్తున్నారు. అయితే ఈ అంశాలన్నింటికంటే అధిష్టానం తీసుకునే తుది నిర్ణయమే కీలకం కానుందని పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు నిర్ణయంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలు, జిల్లా నాయకత్వం సమ్మతి, పార్టీ కోసం పనిచేసిన వారి సేవలు, సామాజిక సమీకరణాలు, భవిష్యత్ రాజకీయ అవసరాలు.. ఇలా అనేక అంశాలు ప్రాధాన్యం ఉండే అవకాశం ఉందన్నది పార్టీ సీనియర్ల మాట. మరి ఇన్ని వడబోతల్లో ముగ్గురిలో విజయనగరం జడ్పీ పీఠం ఎవరికి దక్కుతుందో…ఈ ముగ్గురూ కాకుండా నాలుగో వ్యక్తిని వరిస్తుందో…హైకమాండ్ ఆలోచన ఏంటన్నది ఉత్కంఠగా మారింది.

