Site icon NTV Telugu

OFF The Record: విశాఖ చుట్టూ రాజకీయ చదరంగం

Vizag 1

Vizag 1

దున్నపోతు ఈనిందంటే…దూడను కట్టేయమన్నారట వెనకటికి ఎవరో. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ వ్యవహారం కూడా ఇలాగే ఉందట. ఎవరికి వారు పొలిటికల్‌ మైలేజీ కోసం పాకులాడుతున్నారు తప్ప… ఎవ్వరూ వాస్తవంలో లేరట. కేంద్రం నుంచి ఒక ప్రకటన రాగానే… ఎక్కడ వెనకబడిపోతామో అన్నట్టుగా వెంటనే రియాక్షన్స్‌ ఇచ్చేస్తున్నారు తప్ప వాస్తవం తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదట. ఇంతకీ ఈ గేమ్‌లో ఎవరెక్కడ ఉన్నారు?

తెలుగు రాష్ట్రాల రాజకీయం మొత్తం ఇప్పుడు విశాఖ ఉక్కు చుట్టూనే తిరుగుతోంది. నేతల మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఏపీలో అధికార పక్షం వర్సెస్‌ తెలంగాణ పాలకపక్షం అన్నట్లు తయారైంది వ్యవహారం. క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకునేందుకు పోటీలు పడుతున్నాయట పార్టీలు.

ప్రైవేటీకరణ ప్రక్రియ ఇప్పటికి ఇంతేనని కేంద్ర మంత్రి సంకేతాలు
స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ తప్పదన్న అంచనాల మధ్య అనూహ్యంగా బీఆర్ఎస్‌ ఎంట్రీ ఇచ్చింది. ఆర్‌ఐఎన్‌ఎల్‌ కోసం సింగరేణి సంస్థ బిడ్‌ వేయబోతున్నట్టు ప్రకటించి కాక రేపారు కేసీఆర్‌. పార్టీలు, ప్రభుత్వాలు స్టీల్‌ప్లాంట్‌ కొనుగోలుకు ఆసక్తి చూపకూడదు గనుక సింగరేణిని రంగంలోకి దించింది తెలంగాణ సర్కార్‌. అక్కడ మొదలైన క్రెడిట్‌ గేమ్‌ ఒక రేంజ్‌కు చేరింది. స్టీల్‌ ప్లాంట్‌ కోసం సింగరేణి
సిద్ధమన్న ప్రకటన వచ్చిన మరుసటిరోజే… కేంద్రమంత్రి ఫగ్గన్‌సింగ్‌ కులస్తే విశాఖ వచ్చారు. ప్రైవేటీకరణ విషయంలో కాస్త వెనక్కు తగ్గుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఆ విషయంలో ప్రస్తుతం ఉన్న పొజిషన్‌కంటే ముందుకు వెళ్లడం లేదన్నారాయన. ప్లాంట్‌ను పూర్తి స్థాయిలో పనిచేయించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఆయన అలా చెప్పారో లేదో… వెంటనే రంగంలోకి దిగింది బీఆర్‌ఎస్‌. కేసీఆర్‌ దెబ్బ అంటే.. అలా ఉంటుందని, తమ దెబ్బకు కేంద్రమే దిగివచ్చిందని అన్నారు కేటీఆర్‌. కేసీఆర్‌ ఒక్క మాట మాట్లాడితే… ఎవ్వరైనా దిగి రావాల్సిందేనని అన్నారు. ఏపీలోని అధికార పార్టీకి గాని, ప్రతిపక్షానికి గాని, బీజేపీనిఎదిరించే దమ్ము లేదని, తాము ఆ పని చేస్తున్నామన్నది కేటీఆర్‌ మాటల సారాంశం అట.

బీఆర్‌ఎస్‌కు వైసీపీ కౌంటర్‌
కేటీఆర్‌ మాటలు ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ వైసీపీకి ఎక్కడో తగిలాయట. వెంటనే ఆయనకు కౌంటర్‌ ఇచ్చేశారు వైసీపీ నేత పేర్ని నాని. బీఆర్‌ ఎస్‌ మాటలు ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగిరినట్టు అన్న సామెతను గుర్తు చేస్తున్నాయని విమర్శించారు పేర్ని. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ విషయంలో కేంద్రం వీళ్లను చూసి వెనక్కి తగ్గిందా… అంటూ సెటైరికల్‌గా అన్నారాయన. అదే టైంలో… మేమేం తక్కువ తిన్నామా అన్నట్టు ముందుకు వచ్చారు ఏపీ బీజేపీ నేతలు. మీరు చెప్పేదంతా తూచ్‌…. అసలు మీకందరికీ ఏం తెలుసు… చేసిందంతా మేమైతే అంటూ స్వరం సర్దుకున్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను నిలబెట్టేందుకు మేం కృషిచేస్తే… బీఆర్‌ఎస్ డబ్బా కొట్టుకుంటోందన్నది ఆయన వెర్షన్‌.

అంతా మేమే చేశాం అంటూ జనసేన నేతల ట్వీట్స్‌
విశాఖ ఉక్కు మీద ఎవరి ఆట వాళ్ళు ఆడేస్తుంటే…మేమేం తక్కువ తిన్నామా అంటూ లైనప్‌ అయ్యారు జనసేన నాయకులు. అంతా మేమే చేశాం. అదంతా మావల్లే జరిగింది. క్రెడిట్‌ మొత్తం మాకే దక్కాలంటూ ట్వీట్స్‌ చేశారు జనసేన లీడర్స్‌. ఇదిగో ప్రూఫ్‌ అంటూ గతంలో పవన్‌కల్యాణ్‌ ప్రధాన మంత్రికి ఇచ్చిన వినతి పత్రం తాలూకు ఫోటోలను కూడా జత చేశారు. అప్పుడే అంతా జరిగిపోయిందన్నట్టుగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపిన ఘనత మాదే… కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చేసిన ప్రకటనే అందుకు సాక్ష్యం అంటూ తెగ ట్వీటేశారు.

ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగబోదన్న కేంద్రం
ఇలా…. ఎవరికి వారు క్రెడిట్‌ గేమ్‌ ఆడుతున్నారు గానీ…. అసలు ట్విస్ట్‌ వేరే ఉంది. కేంద్ర మంత్రి కులస్తేను కలిసిన కార్మిక సంఘ నాయకులు ప్రైవేటీకరణ ఉండబోదని ఒక ప్రకటన చేయమంటే… అప్పుడు చల్లగా విషయం చెప్పారాయన. ప్రైవేట్‌ పరం చేయబోమన్న మాట చెప్పడానికి నేనెవర్ని? ఓ మేటర్‌ బహుత్‌ బడా హై. అందుకు నా స్థాయి చాలదని చెప్పారట కేంద్ర మంత్రి. ఆయన అలా చెప్పి 24 గంటలు గడవక ముందే కేంద్ర పెట్టుబడుల ఉహసంహరణ శాఖ అధికారికంగా ప్రకటన ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రక్రియను ఆపే ప్రసక్తే లేదన్నది దాని సారాంశం. అంటే… ఇప్పుడు స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రక్రియ లైవ్‌లో ఉన్నట్టా? ఆగిపోయినట్టా? చెప్పాల్సింది క్రెడిట్‌ గేమ్ ఆడుతున్న పార్టీల నాయకులే. కేంద్రం ప్రకటన మీద సదరు నాయకులంతా ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి.

Exit mobile version