NTV Telugu Site icon

Off The Record: వినోద్ వర్సెస్ సంజయ్.. ఈసారి టఫ్ ఫైట్?

Maxresdefault (1)

Maxresdefault (1)

వినోద్ , సంజయ్ లో మళ్ళీ బరిలో ఉంటే హైఓల్టేజీ పోరేనా ? | Bandi Sanjay vs Vinod | Off The Record | Ntv

గత అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ కారు పార్టీ జోరు కొనసాగింది. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి సీన్ రివర్స్. అధినేతకు అత్యంత సన్నిహితుడైన నాయకుడు అనూహ్యంగా ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో ఆ స్థానాన్ని తిరిగి ఎలాగైనా దక్కించుకోవాలనేది గులాబీపార్టీ టార్గెట్‌. దీంతో రాబోయే పోరు ఉత్కంఠగా మారుతుందా? అమీతుమీకి నాయకులు సిద్ధమా? ఏంటా నియోజకవర్గం?

మళ్లీ కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థిగా వినోద్‌కుమార్‌ పోటీ..!
గతంలో అనేక మంది ప్రముఖులు గెలిచిన లోక్‌సభ స్థానం కరీంనగర్‌. సంచలన రాజకీయాలకు కేంద్రం. టీఆర్ఎస్‌ పార్టీ ఏర్పడిన తర్వాత ఆ పార్టీ నుంచి తొలిసారి ఎంపీ అయ్యారు కేసీఆర్‌. 2009లో ఈ సీటు గులాబీ పార్టీ నుంచి బోయినపల్లి వినోద్‌ కుమార్‌ చేతికి వచ్చింది. కానీ.. 2009లో వినోద్‌ ఓడిపోయారు. 2014లో మాత్రం 2 లక్షల పైచిలుకు ఓట్లతో ఆయన గెలిచారు. 2019 ఎన్నికల్లో వినోద్‌కు చేదు ఫలితం తప్పలేదు. ఇక్కడ బీజేపీ ఎంపీగా బండి సంజయ్‌ గెలిచారు. ఇక్కడో విచిత్రం ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్‌ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గులాబీపార్టీనే గెలిచింది. కానీ.. తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితం అధికారపార్టీకి రాలేదు. ఆ ఎన్నికల్లో ఓడినా.. ప్రస్తుతం రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ ఛైర్మన్‌గా ఉన్నారు వినోద్‌. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ వినోదే తిరిగి పోటీ చేస్తారని అధికారపార్టీలో చర్చ జరుగుతోంది. కొంతకాలంగా వేములవాడ లేదా కరీంనగర్‌ అసెంబ్లీకి ఆయన పోటీ చేయొచ్చని ప్రచారం జరిగినా.. పార్టీ పెద్దలు మాత్రం వినోద్‌ను లోక్‌సభకు పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

సిరిసిల్ల ఆత్మీయ సమ్మేళనంలో స్పష్టత ఇచ్చిన మంత్రి కేటీఆర్‌
కొద్దిరోజులుగా కరీంనగర్‌ లోక్‌సభ పరిధిలో బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతున్నాయి. ఈసారి ఎలాగైనా వినోద్‌ను గెలిపించాలని నాయకులు ప్రకటించడంతో క్లారిటీ వస్తున్నట్టు చెబుతున్నారు. సిరిసిల్ల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యల చుట్టూనే ప్రస్తుతం చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో తాను గెలిచిన సిరిసిల్లలో తప్ప మిగతా చోట్ల వినోద్‌కు మెజారిటీ రాలేదని.. ఈసారి ఆ తప్పు పునరావృతం చేయకుండా ఎంపీగా గెలిపించాలని కోరారు కేటీఆర్‌. ఇదే సభలో పాల్గొన్న వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ మరో అడుగు ముందుకేశారు. ఈసారి మా బావను ఎంపీగా చూడాలని ఆకాంక్షిస్తున్నట్టు రమేష్‌ చెప్పారు. వేములవాడలో పార్టీ నుంచి తనకు ఇంకెవరూ పోటీ లేకుండా ముందుగానే కర్చీఫ్‌ వేసేశారు రమేష్‌. అయితే ఆయన పౌరసత్వంపై వివాదం కోర్టులో పెండింగ్‌లో ఉండటంతో రమేష్‌కు సీటు ఇస్తారో లేదో అనే చర్చ కొన్నాళ్లుగా పార్టీ వర్గాల్లో ఉంది. అలాంటిది వినోద్‌ను అడ్డంపెట్టుకుని రమేష్‌ తన మనసులో మాటను బయటపెట్టేశారు.

బీజేపీ నుంచి బండి బరిలో ఉంటే హైఓల్టేజ్‌ పోరేనా..?
ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో క్లారిటీ రాలేదు. మరి.. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో తిరిగి కరీంనగర్‌ నుంచి బరిలో ఉంటే.. వినోద్‌.. సంజయ్‌ కాంబినేషన్‌లో బిగ్‌ఫైట్‌ తప్పదనే వాదన నెలకొంది. గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను రిపీట్‌ కానివ్వకుండా.. పక్కా రణతంత్రంతో వినోద్‌ను ఎంపీగా గెలిపించాలనేది గులాబీ నేతల ఆలోచన. అందులో భాగంగానే వినోద్‌ అభ్యర్థిత్వంపై ముందుగానే స్పష్టత ఇస్తున్నారని భావిస్తున్నారు. దీంతో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నేతలు అప్రమత్తం కావడంతోపాటు.. ఎన్నికల వ్యూహరచనకు సమయం చిక్కుతుందని లెక్కలేస్తున్నారు నాయకులు.