సిక్కోలు ప్రాంతంలో మరో థర్మల్ పోరాటం ఊపందుకుంటుందా? గిరిజన ప్రజా సంఘాలు చేస్తున్న పోరాటానికి ప్రతిపక్ష వైసీపీ మద్దతుగా నిలుస్తుందా? కానీ ఈ థర్మల్ పోరాటంలో ఆ జిల్లా వైసీపీ బడా నేతలు ఇరకాటం లో పడ్డారా? ఇంతకీ ఎవరా నేతలు..?ఎంటా ఇబ్బందులు..? శ్రీకాకుళం జిల్లా రాజకీయాలలో ధర్మాన సోదరులు , తమ్మినేని సీతారాం పాత్ర సుస్పష్టం. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న ఈ ముగ్గురు నేతలు ఇప్పుడు ఇరకాటంలో పడ్డారంట. దానికి ప్రధాన కారణం ఆమదాలవలస ధర్మల్ ప్లాంట్ ఉద్యమమే. నాడు సోంపేట కాకరపల్లి పవర్ ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమాలలో ఎక్కడ ధర్మాన ప్రసాదరావు స్థానిక ప్రజా సంఘాలకు గానీ, ప్రజలకు గానీ మద్దతుగా నిలబడింది లేదు. పై పెచ్చు నాడు కాంగ్రెస్ హయాంలో మంత్రిగా ఉన్న ధర్మాన పవర్ ప్లాంట్ కు అనుకూలంగా వ్యవహరించారు. సోంపేట , కాకరాపల్లి లో ప్రజా పోరాటాలతో ప్లాంట్లు వెనుకడుగు వేశాయి. కాల్పులు దారితీసేంతగా ఉద్యమాలు నడిచినా నాడు ధర్మాన ప్రసాదరావు కిమ్మనలేదు. ప్రస్తుతం పరిస్థితులు మారాయి.
ఆముదాలవలసలో థర్మల్ పవర్ ప్లాంట్ కోసం స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ పావులు కదుపుతున్నారు. దీంతో వైసీపీ ఆమదాలవలస ఇంఛార్జ్ చింతాడ రవికుమార్ బాహాటంగానే పవర్ ప్లాంట్ వ్యతిరేక విధానం ఆ పార్టీ ఎంచుకుందని ప్రజా పోరాటానికి మద్దతుగా నిలబడతామని చెబుతున్నారు. థర్మల్ వ్యతిరేక పోరాటంలో గిరిజన జేఏసీకి మద్దతుగా సమావేశాలు నిర్వహించారు వైసీపీ నేతలు. నాడు ధర్మల్ విద్యు త్ కేంద్రాలకు అనుకూలంగా మాట్లాడిన ధర్మాన..ఇప్పుడు ఆముదాలవలసలో జరుగుతున్న ప్రజా పోరాటంలో ఎటువైపు ఉంటారనేది చర్చగా మారింది.పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా నిలబడతారా లేదా? తన సొంత ఆలోచన విధానానికి అనుకూలంగా ఉండిపోతారా అనేది హాట్ టాపిక్ గా మారిందట.
శ్రీకాకుళం జిల్లాలో అధికారం ప్రతి పక్షంలో ఉన్న బడానేతలు అంతా ప్రాజెక్ట్ లకు అనుకూలంగా వ్యవహరించారు. నేడు జిల్లా అధ్యక్షుడు గా ఉన్న ధర్మాన కృష్ణ దాస్ అఖిలపక్ష సమావేశానికి వస్తారా? కూటమి ప్రభుత్వం తీసుకున్న థర్మల్ అనుకూల విధానాన్ని పార్టీ పరంగా ఖండించిన పాపాన పోలేదంటే అర్థం చేసుకోవచ్చు. ధర్మాన కృష్ణ దాస్ తీరు ఈవిధం గా ఉంటే మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పరిస్థితి దాదాపు ఇదే తీరుగా ఉందట. తమ్మినేని సొంత నియోజకవర్గం ఆముదాలవలసలో ఈ పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం అధికారులు సన్నద్ధమవుతున్నారు. తాజాగా రెవెన్యూ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. అయితే ఇప్పటివరకు గిరిజన సంఘాల సమావేశాలు కానీ ర్యాలీలు సభలు జరిపినా తమ్మినేని తన వైఖరి ఏంటనేది బయట పెట్టలేదట.
ప్రస్తుత ఇన్చార్జిగా ఉన్న చింతాడ రవికుమార్ పవర్ ప్లాంట్ కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి మద్దతు తెలపడంతో తమ్మినేని వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా అనేది చర్చగా మారింది. థర్మల్ ప్రభావిత గ్రామాలలో పార్టీలకతీతంగా జనాలు సమీకృతమవుతున్న తరుణంలో తమ్మినేని స్థానికులకు మద్దతుగా నిలవాల్సి ఉందని వైసీపీ శ్రేణులు కోరుతున్నాయట. ఆడకత్తెరలో పోక చెక్క మాదిరి తయారైంది అంట సిక్కోలు వైసీపీ సీనియర్ నేతల పరిస్థితి థర్మల్ ప్లాంట్ వ్యతిరేక నిర్ణయానికి మద్దతుగా ఉండాలని బాధితులు కోరుతున్నారంట.మొత్తానికి ఈ బడా నేతలు ఏ వైపు ఉంటారనేది మరి కొన్ని రోజుల్లో తేలబోతోంది.
