NTV Telugu Site icon

Off The Record: ఎమ్మెల్యేలు లేకున్నా.. ఏంటీ ధీమా?

Maxresdefault (1)

Maxresdefault (1)

సంఖ్యాబలం లేకపోయినా టీడీపీ లెక్క వేరే ఉందా.? l Off the Record l NTV

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. బలం లేకున్నా అభ్యర్థిని నిలబెట్టింది. ఇంతకీ టీడీపీకి ఉన్న ధీమా ఏంటి? పసుపు శిబిరం వేస్తున్న లెక్కలేంటి?

సంఖ్యాబలం లేకపోయినా.. టీడీపీ లెక్క వేరే ఉందా?
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయని అంతా భావించారు. మొత్తంగా ఏడు స్థానాలు ఖాళీ అవుతోంటే.. వాటికి అభ్యర్థులను కూడా చాలా ముందుగానే వైసీపీ ప్రకటించింది. ఎవ్వరూ ఊహించని విధంగా టీడీపీ ఈ ఎన్నికల రణ రంగంలోకి దూకింది. పూర్తిస్థాయిలో సంఖ్యాబలం టీడీపీ దగ్గర లేదు. కానీ.. తమ లెక్కలు తమకు ఉన్నాయనేది టీడీపీ వాదన. విజయవాడ మాజీ మేయర్‌ పంచుమర్తి అనురాధతో నామినేషన్‌ వేయించింది.

టీడీపీ ఎమ్మెల్యేలు 23 మంది.. వారిలో నలుగురు జంప్‌
అధికారికంగా టీడీపీ సంఖ్యాబలం 23. అయితే నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీలోకి జంప్ అయ్యారు. కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాల గిరిధర్, వాసుపల్లి గణేష్ అధికారపార్టీ గూటికి చేరుకున్నారు. వీరి ఓట్లు ఎలాగూ టీడీపీకి పడే ఛాన్స్ తక్కువే. ఒకవేళ టీడీపీ విప్ జారీ చేసినా.. ఏదోక మాయ చేసి ఆ ఓట్లు చెల్లుబాటు కాకుండా.. రెబెల్స్‌ ప్రయత్నించొచ్చు. ఈ క్రమంలో టీడీపీకి పక్కాగా పడే ఓట్లు కేవలం 19 అనే చెప్పాలి. ఇంత తక్కువ ఓట్లతో ఎమ్మెల్సీ స్థానాన్ని ఎలా గెలుచుకుంటారనేది ప్రస్తుతం ప్రశ్న. అయితే టీడీపీ గణాంకాలు వేరే విధంగా ఉన్నాయట. ఎమ్మెల్సీగా గెలుపొందాలంటే 2188.5 పాయింట్స్‌ కావాలి. టీడీపీకి 19 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉండటంతో.. 1900 పాయింట్లే పడతాయి. ఇక్కడే టీడీపీ అధినేత చంద్రబాబు మరో ప్లాన్‌ వేస్తున్నారట. వైసీపీ రెబెల్స్‌గా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి వంటి వారు టీడీపీ అభ్యర్థికి ఓటేస్తే 2100 పాయింట్లు దక్కుతాయి. అప్పుడు ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవాలంటే టీడీపీ ఇంకా 88.5 పాయింట్ల కొరత ఉంటుందని అనుకుంటున్నారు.

చివరి నిమిషంలో జరిగే అద్భుతాలపై టీడీపీ ఆశ..!
కొరతలో ఉన్న 88.5 పాయింట్లను భర్తీ చేయాలంటే కచ్చితంగా మరో ఎమ్మెల్యే కావాలి. ఈ పరిస్థితుల్లో టీడీపీకి సహకరించే వైసీపీ ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారా..? లేక ట్రై చేసి చూద్దామనే ఉద్దేశ్యంతో చంద్రబాబు పోటీకి నిలబెట్టారా..? అనే చర్చ జరుగుతోంది. టీడీపీ అధిష్టానం మదిలో ఓ వ్యూహం ఉందట. చివరి నిమిషంలో అద్భుతాలు జరుగుతాయని చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో మరో అంశమూ ప్రస్తావనకు వస్తుంది. వైసీపీ ఎమ్మెల్యేల్లో ఎవరో ఒకరు రాంగ్ ఓటింగ్ చేయకపోతారా? వాళ్ల ఓటు మురిగిపోకుండా ఉంటుందా..? అనే ఆశ.. ఆలోచనలతో అభ్యర్థిని సిద్ధం చేస్తున్నారట.

ఓడితే రాజకీయ విమర్శలు తప్పవని టీడీపీలో కొందరు ఆందోళన
అయితే ఇంత ప్రయాసపడి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం దేనికనే చర్చా నడుస్తోంది. అభ్యర్థిగా బీసీ సామాజికవర్గానికి చెందిన మహిళ నేతను ఎంపిక చేశారు. తమ ప్లాన్‌ వర్కవుట్ అయి.. గెలిస్తే సరేసరి.. లేకుంటే బీసీ.. అందులోనూ మహిళను ఇబ్బంది పెట్టారనే విమర్శలు వస్తాయని కొందరు ఆందోళన చెందుతున్నారట. ఇది కొత్త పంచాయితీకి దారితీస్తుందని చెబుతున్నారు. గతంలో వర్ల రామయ్యను కూడా ఇదే విధంగా రాజ్యసభకు అభ్యర్థిగా నిలిపి విమర్శల పాలైన అంశాన్ని గుర్తు చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు రాజ్యసభ, శాసనమండలి సీట్లు ఇవ్వకుండా.. ఓడిపోతామని తెలిసి మరీ ఆ టికెట్లను బీసీలకు ఇచ్చారనే విమర్శలు వస్తాయని భయపడుతున్నారట. మరి.. ఈ విషయంలో టీడీపీ వ్యూహం వర్కవుట్ అవుతుందో బెడిసి కొడుతుందో కాలమే చెప్పాలి.