Site icon NTV Telugu

Off The Record: షకీల్ కి సీటు ముప్పు తప్పదా?

Maxresdefault (3)

Maxresdefault (3)

ఆ పార్టీ ఎమ్మెల్యే కి సొంత పార్టీ నేతల నుంచే సీటు ముప్పు ఉందా..? | OTR | Ntv

ఆ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకి సొంత పార్టీ నేతల నుంచే సీటు ముప్పు పొంచి ఉందట. గత ఎన్నికల్లో గెలిపించిన వాళ్ళే.. ఇప్పుడు మా రూటు సపరేటు అంటున్నారట. ఆయన మీదే పోటీకి సై అంటున్నారట.శివాజీ విగ్రహం ఏర్పాటుతో మొదలైన లొల్లి.. ఫ్లెక్సీ వార్‌తో పీక్స్‌కు చేరిందట. ఎవరా ఎమ్మెల్యే..? నాడు అయినవాళ్ళే నేడు కాకుండా పోయారెందుకు?

అగ్గికి ఆజ్యం పోసిన ఫ్లెక్సీ వార్‌
నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్‌, మున్సిపల్ ఛైర్ పర్సన్ తూము పద్మశరత్ రెడ్డి దంపతుల మధ్య కొత్తగా పొలిటికల్‌ వార్‌ మొదలైంది. ఇద్దరి మధ్య ఉన్న అభిప్రాయ భేదాలకు ఫ్లెక్సీ వార్‌ ఆజ్యం పోసిందట. దీంతో గ్యాప్‌ పూడ్చుకోలేనంతగా పెరిగిపోయిందట.

ఫ్లెక్సీల్లో పరస్పరం ఫోటోలు తీసేసుకున్న రెండు వర్గాలు
మున్సిపల్ ఛైర్ పర్సన్ భర్త శరత్ రెడ్డి బోధన్ బీఆర్‌ఎస్‌లో కీలకంగా ఉన్నారు. కొంత కాలంగా ఎమ్మెల్యే షకీల్ ఆయన్ను దూరం పెట్టారట. ఇటు మున్సిపల్ ఛైర్ పర్సన్‌కు కూడా సరైన గౌరవం ఇవ్వడం లేదంటూ.. శరత్ రెడ్డి సైతం ఎమ్మెల్యే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. నిన్న నిన్నటి దాకా ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరునిగా ఉన్న శరత్ రెడ్డి.. ఇప్పుడు నా దారి నాదే అంటున్నారు. పార్టీలో ఉంటూనే ఎమ్మెల్యే ను వ్యతిరేకిస్తున్నారట. దీంతో ఇద్దరి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు పెరిగిపోయాయని అంటున్నారు. ఎమ్మెల్యే షకీల్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అనుచరులు బోధన్ పట్టణమంతా ఫ్లెక్సీలు పెట్టారు. కానీ… పట్టణ ప్రథమ పౌరురాలిగా ఉన్న పద్మావతి ఫోటోను మాత్రం వాటిలో ప్రింట్‌ చేయించలేదట. దీంతో ఛైర్ పర్సన్ దంపతులు సైతం ఎమ్మెల్సీ కవిత బర్త్‌డే సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లెక్సీల్లో ఎమ్మెల్యే షకీల్ ఫోటోను వేయించలేదట. ఇలా ప్రతీ కార్యక్రమంలో పరస్పరం ఫోటోలను మిస్‌ చేస్తూ… ఫ్లెక్సీ వార్‌ నడిపిస్తున్నారట బీఆర్‌ఎస్‌ నేతలు ఇద్దరూ.

మంత్రి ప్రశాంత్‌రెడ్డికి పరిష్కార బాధ్యతలు
బోధన్ గులాబీ వర్గపోరు అధిష్ఠానానికి తలనొప్పిగా మారిందట. గత రెండు ఎన్నికల్లో ఎమ్మెల్యే షకీల్‌కు అనుకూలంగా పనిచేసిన శరత్ రెడ్డి ఇప్పుడు మాత్రం.. ఆయన పై పోటీ చేసేందుకు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారట. మున్సిపాలిటీలో కొంత మంది కౌన్సిలర్లను ఆల్రెడీ తన వైపు తిప్పుకున్నారట. ఐతే బీఆర్‌ఎస్‌, లేదంటే మరో పార్టీ నుంచి టికెట్టు తెచ్చుకుని పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారట మున్సిపల్ ఛైర్ పర్సన్ దంపతులు. తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీలో ఉన్న శరత్ రెడ్డి.. ఎమ్మెల్యే షకీల్ కు మొదట్లో మంచి సంబంధాలు ఉండేవట. నిరుడు శివాజీ విగ్రహం ఏర్పాటు సమయంలో తలెత్తిన వివాదంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందట. శరత్‌రెడ్డితో పాటు 12 మంది పై పోలీసులు నాన్ బెయిలెబుల్ కేసులు పెట్టారు. ఎమ్మెల్యే ఒత్తిడితో కేసులు నమోదయ్యాయంటూ.. ఛైర్ పర్సన్ వర్గం గుర్రుగా ఉందట. ఈ మేరకు అధిష్ఠానానికి కూడా ఎమ్మెల్యే పై ఫిర్యాదు చేశారట. ఎన్నికలు సమీపిస్తున్న టైంలో ఈ వివాదం పార్టీకి నష్టం కలిగిస్తుందని,మౌనంగా ఉండాలని ఇద్దరికీ సూచించారట పార్టీ పెద్దలు. వివాద పరిష్కారం బాధ్యతను మంత్రి ప్రశాంత్‌రెడ్డికి అప్పగించిందట అధినాయకత్వం. మరి ఈ వివాదం ఇక్కడితో సమసిపోతుందా.. లేక ఇంకా పెరుగుతుందో చూడాలి.

Exit mobile version