తెలుగు రాజకీయాల్లో వాళ్లిద్దరూ చాలా పాపులర్. ఒకరు పార్టీ పెట్టి దేశ సేవ చేస్తానంటే…..మరొకరు ఉన్నత ఉద్యోగం వదిలేసి పొలిటికల్ ప్లే గ్రౌండ్లో కష్టపడుతున్నారు. అలాంటి వారిద్దరూ ఇప్పుడు ఒకే వేదిక మీదికొచ్చి కామన్ అజెండా ప్రకటించడం కలకలం రేపుతోంది. ఎవరా ఇద్దరు? ఆ కలయిక వెనక ఆంతర్యం ఏంటి?
తెలుగు రాజకీయాలకు ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రధాన ముడి సరకుగా మారిపోయింది. కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టిన సంస్థను పరిరక్షించడంలో ఛాంపియన్స్ అనిపించుకోవాలని పార్టీలు తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. బీఆర్‌ఎస్ ఎంట్రీ ఏపీ పార్టీలను డిఫెన్స్‌లోకి నెట్టేసింది.ఆ తర్వాతి నుంచి ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతున్నాయి. కొత్త కలయికలు కనిపిస్తున్నాయి. తాజాగా అలాంటి కలయికే ఒకటి జరగ్గా…..వాళ్ళిద్దరూ పరస్పర విరుద్ధమైన వ్యక్తులు కావడం చర్చకు కారణం అయింది. ఆ ఇద్దరిలో ఒకరు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ కాగా….మరొకరు CBI మాజీ జేడీ లక్ష్మీ నారాయణ.
స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉమ్మడి అజెండా?
ఈ ఇద్దరు తొలిసారి ప్రత్యక్షంగా కలవడమే కాదు… ఉమ్మడిగా ప్రెస్‌మీట్ పెట్టడం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఆ వేదిక నుంచే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ అజెండాగా ప్రకటించారు ఇద్దరూ.ఇప్పటికే EOI కోసం దరఖాస్తు చేసిన లక్ష్మీనారాయణ….ప్రజల భాగస్వామ్యం ద్వారా నిధుల సమీకరణకు పూనుకున్నారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా 8 వేల 500కోట్లు సమీకరించడమే లక్ష్యం అంటున్నారాయన. అదే సమయంలో పాల్ సైతం విశాఖ ఉక్కు పరిరక్షణ తన బాధ్యతగా ప్రకటించుకున్నారు. 45 వేల కోట్ల రూపాయల విదేశీ నిధులు తెచ్చి ప్రయివేటీకరణను అడ్డుకుంటానని హడావిడి చేస్తున్నారాయన. పాల్ లాంటి వ్యక్తి… లక్షల కోట్ల విలువ చేసే ప్లాంట్‌ను కొనేయడం పెద్ద లెక్క కాదని మాట్లాడడం అంత పెద్ద మేటర్ కాదంటున్నారట పరిశీలకులు. అంతకు మించి ఆయనతో లక్ష్మీనారాయణ కలవడాన్నే ఎలా చూడాలో అర్ధంగాక బుర్రలు గోక్కుంటున్నారట.
గత ఎన్నికల్లో లక్ష్మీనారాయణకు 2లక్షల 88వేల ఓట్లు
రాజకీయంగా విశాఖను తన అడ్డాగా మార్చుకున్న మాజీ జేడీ….గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేయగా 2లక్షల 88వేల ఓట్లు వచ్చాయి. అప్పట్లో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థి కావడంతో గాజువాకలోనే ఆయనకు ఎక్కువ ఓట్లు పడ్డాయి. అందుకే…. ఆ ప్రాంత ఎదుగుదలకు కారణం అయిన ఉక్కు పరిశ్రమను అమ్మేస్తామంటే సహించేది లేదని ప్రకటించి.. ఇప్పటికే న్యాయపోరాటం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతున్న మాజీ జేడీతో కలవడం ద్వారా తాను రేసులోకి రావాలనేది పాల్ లెక్కఅట. దీనితో ఎన్నికలకు ముందు నిద్రావస్తలో ఉన్న ప్రజాశాంతి పార్టీని తట్టి లేపే ప్రయత్నాల్లో ఉన్నారట. లక్ష్మీనారాయణ, పాల్ కలయిక వెనుక ప్రత్యేకమైన కారణాలు లేనప్పటికీ ఇద్దరి మధ్య ఆసక్తికరమైన చర్చలు జరిగినట్టు సమాచారం. తనను తాను అంతర్జాతీయ రాజకీయాలను శాసించే లోకరక్షకుడిగా చెప్పుకునే పాల్…..లక్ష్మీనారాయణతో జరిగిన సమావేశంలోనూ అటువంటి ధోరణే ప్రదర్శించారట.
ప్రజాశాంతి పార్టీలో చేరమని మాజీ జేడీని ఆహ్వానించిన పాల్
రాజకీయంగా బలోపేతం కావాలంటే… ప్రజాశాంతి పార్టీలో చేరాలని లక్ష్మీనారాయణను ఆహ్వానించారట పాల్. ఈ ప్రతిపాదనతో.. నవ్వుకున్న మాజీ జేడీ….ముందు ఢిల్లీ పెద్దలతో ఉన్న సంబంధాలను ఉపయోగించి స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అడ్డుకోండి అప్పుడు చూద్దాం అనేశారట. అంతే కాదు ప్రయివేటీకరణ ఆపుతానంతే పాల్ పార్టీ అయినా… బీజేపీ అయినా నాకు ఒక్కటేనని చెప్పేశారట. అసలు మీటింగ్‌లో పాల్ దూకుడును అడ్డుకోవడం లక్ష్మీనారాయణకు కనాకష్టం అయిందట. లక్షల కోట్లు, విదేశీ నిధులు, ప్రపంచ స్థాయి నేతల పరిచయాలు ఇలా పాల్ ఓ రేంజ్‌లో లెక్కలేసి చెప్పేస్తుంటే… లక్ష్మీనారాయణ కూడా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా మారిపోవాల్సి వచ్చిందట. పాల్ లెక్కలను ఎక్కడికక్కడ క్రాస్ ఎగ్జామిన్ చేసేశారట ఆయన. మొత్తంగా భిన్న నేపధ్యాలున్న నాయకుల తొలి సమావేశమే చిత్ర విచిత్రంగా జరిగిపోయిందట. చివరిగా రాజకీయాలు వద్దని, స్టీల్ ప్లాంట్ కోసం అయితే కలిసి పనిచేయడానికి సిద్ధమని లక్ష్మీనారాయణ ముఖం మీదే చెప్పేశారట. మాజీ జేడీ కాస్త గట్టిగానే తన అభిప్రాయాన్ని చెప్పేసరికి పాల్ వాక్ ప్రవాహానికి అడ్డుకట్ట పడిందట. మొత్తంగా ఈ మీటింగ్ అతి రహస్యం…బట్టబయలు అన్నట్టే జరిగిందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయట.

