Site icon NTV Telugu

Off The Record: రామగుండం ఎమ్మెల్యేకు పదవీ గండం

Koruganti

Koruganti

రామగుండం ఎమ్మెల్యేకు అసమ్మతి టెన్షన్..! సొంత నేతలకే టార్గెట్ ఎందుకయ్యారు ? | OTR | Ntv

అక్కడ అధికారపార్టీ ఎమ్మెల్యేకు అసమ్మతి టెన్షన్‌ పట్టుకుందా? వరుస ఆరోపణలు ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా? అధిష్ఠానానికి దగ్గర అని చెప్పుకొనే ఎమ్మెల్యేకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఎవరు? ఏమా నియోజకవర్గం?

ఎమ్మెల్యే మనుషులపై ఆరోపణల వెల్లువ
కోరుకంటి చందర్‌. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే. 2018 ఎన్నికల్లో ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ నుంచి గెలిచి తర్వాత గులాబీ గూటికి చేరుకున్నారు. అధికారపార్టీలో అయితే చేరారు కానీ.. ఎమ్మెల్యే అయిన నాటి నుంచీ వివాదాలు.. ఆరోపణలతో సావాసం చేస్తున్నారు చందర్‌. ఆయనే చేస్తున్నారో లేక ఎమ్మెల్యే అనుచరుల దూకుడో కానీ వివాదాల ముసురు ఓ రేంజ్‌లో ఉంటోంది. ఇప్పుడు ఎన్నికలు సమీపించే సమయంలో సొంత పార్టీ నేతలకు కూడా ఎమ్మెల్యే టార్గెట్‌ అయ్యారు. విపక్షాల కంటే ఎక్కువగా తమ ఎమ్మెల్యేపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీనికి ఎమ్మెల్యే చందర్‌ వైఖరి కూడా కారణమన్నది గులాబీ పార్టీలో వినిపిస్తున్న టాక్‌. రామగుండంలో ఏ పని జరగాలన్నా ఎమ్మెల్యే మనుషులు చెబితేనే చేపడతారనే ప్రచారం ఉంది. అదే లోకల్‌ బీఆర్‌ఎస్‌లో సమస్య శ్రుతి మించడానికి కారణంగా చెబుతున్నారు.

ఉద్యోగాల్లో మోసం చేశారనే ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి
కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాలు.. RFCL ఉద్యోగాల్లో మోసాలు ఎమ్మెల్యే చందర్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఉద్యోగాల విషయంలో ఎమ్మెల్యే బంధువులు, అనుచరులు కలిసి కోట్ల రూపాయాలు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. బాధితులకు న్యాయం చేస్తానని నమ్మబలికి.. ఆయనే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి మోసం చేశారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కామ్‌లో ఎమ్మెల్యే హస్తం ఉందనేది విపక్షాల ఆరోపణ. ఒకవైపు అధికారపార్టీలో కుంపట్లు.. మరోవైపు RFCLలో ఉద్యోగాల సమస్య ఎన్నికలనాటికి చందర్‌కు ఇబ్బందులు తెచ్చిపెడతాయని చర్చ సాగుతోంది. వీటికితోడు NTPC, RFCLలలో బూడిద అక్రమ రవాణా, కాంట్రాక్టుల్లో ఎమ్మెల్యే అనుచరులు చురుకైన పాత్ర పోషించారని రామగుండంలో కోడై కూస్తున్నారు.

రామగుండంలో బీఆర్‌ఎస్‌ నేతలను కలుపుకొని వెళ్లడం లేదట
కోరుకంటి చందర్‌ పేరుకే ఎమ్మెల్యేగా ఉన్నారని.. అన్నీ ఆయన అనుచరులే చేస్తారని.. అన్నింటా ఆధిపత్యం వారిదేనని బీఆర్‌ఎస్‌ నాయకులు కుత కుతలాడుతున్నారట. రామగుండంలోని పార్టీ సీనియర్లను కలుపుకొని వెళ్లడం లేదని.. గ్రూపులను ఎగదోస్తున్నారని సీనియర్లు గుర్రుగా ఉన్నారట. చివరకు బీఆర్‌ఎస్‌ అనుబంధ సంఘాలను విపక్షాల కంటే ఎక్కువగా సొంత ఎమ్మెల్యేనే టార్గెట్ చేస్తున్నారని చెవులు కొరుక్కుంటున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారనేది చందర్‌పై ఉన్న మరో ఆరోపణ. ఇన్నాళ్లూ వీటిని ఉగ్గబట్టుకుని ఉన్న బీఆర్‌ఎస్‌ శ్రేణులు, నాయకులు ఒక్కొక్కరుగా ఓపెన్‌ అవుతున్నారు. వచ్చే ఎన్నికలు చందర్‌కు అంత తేలిక కాదని.. సొంత పార్టీలో ఉన్న వ్యతిరేకతే ఆయనకు మైనస్‌గా మారుతుందని గుసగసలు వినిపిస్తున్నాయి. ఆరోపణలను ఎమ్మెల్యే చందర్‌ ఎప్పటికప్పుడు కొట్టి పారేస్తున్నా.. అవి ప్రజలకు పెద్దగా కనెక్ట్‌ కావడం లేదట. పార్టీ నేతలు కూడా సంతృప్తి చెందడం లేదట. అందుకే వచ్చే ఎన్నికలు కోరుకంటి చందర్‌కు అగ్నిపరీక్షగా భావిస్తున్నారట రామగుండం గులాబీ నేతలు.

Exit mobile version