Site icon NTV Telugu

Off The Record: పవన్ అక్కడే ఎందుకు గురిపెట్టారు?

Sddefault (5)

Sddefault (5)

పార్టీ ఆవిర్భావ సభకు ఆ ప్రాంతాన్నే పవన్ ఎందుకు ఎంచుకున్నాడు.. ఆ ప్రాంతం పై పవన్ వ్యూహం ఏంటి? | OTR

పార్టీ ఆవిర్భావ సభకు మచిలీపట్నాన్నే జనసేన ఎందుకు ఎంచుకుంది? తమకు పట్టున్న గోదావరి జిల్లాల్లో ఎందుకు సభను పెట్టడం లేదు? జనసేనాని పవన్‌ కల్యాణ్‌ వ్యూహం ఏంటి? వారాహితో బందర్‌కు దండయాత్ర చేపట్టడం వెనుక బలమైన రాజకీయ లెక్కలు ఉన్నాయా?

బందర్‌ సభలో పొత్తులపై క్లారిటీ ఇస్తారా?
ఈ నెల 14న జనసేన ఆవిర్భావ దినోత్సవం. ఏపీలో ఎన్నికల హీట్‌ పెరిగిన క్రమంలో.. అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం పీక్స్‌లో ఉన్న తరుణంలో జనసేన ఆవిర్భావం దినోత్సవం పొలిటికల్‌ టెంపరేచర్‌ను పెంచేస్తోంది. ఆ రోజున జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఏం చెబుతారు? గతేడాది ఇప్పటం సభలో పవన్‌ చేసిన కామెంట్స్‌ చర్చకు దారి తీశాయి. అయితే నాటి పవన్‌ వ్యాఖ్యలకు.. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు చాలా తేడా కనిపిస్తోంది. కొన్ని సందర్భాల్లో టీడీపీ-జనసేన దగ్గరవుతున్నట్టు.. మరో సమయంలో గ్యాప్‌ పెరుగుతున్నట్టు అభిప్రాయం కలుగుతోంది. పవన్‌ కూడా గతంలో మాదిరి కాకుండా బీజేపీపై కొంత సాఫ్ట్‌గానే వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో పవన్‌ అడుగులు ఎటు వేస్తారు? ఏమైనా క్లారిటీ ఇస్తారా?దీనికి జనసేన ఆవిర్భావ సభ వేదిక అవుతుందా?

మచిలీపట్నంలోనే ఎందుకు ఆవిర్భావ సభ?

ఈ ఏడాది పార్టీ ఆవిర్భావ సభను ఉభయగోదావరి జిల్లాల్లో నిర్వహిస్తారని అంతా భావించారు. భారీ స్థాయిలో సభకు ప్లాన్‌ చేసుకోవాలన్నా.. అదే స్థాయిలో పార్టీకి ఊపు తేవాలన్నా గోదావరి జిల్లాలైతే బాగుంటుందనే చర్చ కూడా జరిగింది. అయితే ఎవరూ ఊహించని విధంగా మచిలీపట్నంలో పార్టీ ఆవిర్భావ సభ జరపాలని డిసైడ్‌ చేశారు పవన్‌ కల్యాణ్‌. బందర్‌లో పార్టీ సభ పెట్టడానికి ప్రత్యేక కార్యణాలే ఉన్నాయట. జనసేన ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన బహిరంగ సభ నిర్వహించింది లేదు. పైగా గోదావరి జిల్లాల్లోనే కాకుండా.. ఇతర ప్రాంతాల్లోనూ జనసేనకు పట్టుందని నిరూపించుకోవాలంటే మచిలీపట్నం అయితే బెటర్‌ అనే అభిప్రాయానికి వచ్చారట.

మాజీ మంత్రి పేర్ని నానిపై గురిపెట్టారా?
కృష్ణా జిల్లాలో కాపు సామాజికవర్గం ఎక్కువుగా ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి. మచిలీపట్నం, పెడన, గుడివాడ, అవనిగడ్డ, గన్నవరం తదితర నియోజకవర్గాల్లో కాపు సామాజికవర్గమే డిసైడింగ్‌ ఫ్యాక్టర్‌. దీనికితోడు పవన్‌ కల్యాణ్‌ను ఎక్కువగా టార్గెట్‌ చేసుకుంటున్న వైసీపీ నేతల్లో మచిలీపట్నం MLA పేర్ని నాని ముందు ఉంటున్నారు. ముఖ్యంగా పవన్‌ కల్యాణ్‌కు కౌంటర్‌ ఇవ్వాలంటే చాలు పేర్ని నాని తెరమీదకు వస్తారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు.. కేబినెట్‌లో చోటు కోల్పోయినా.. జనసేనానిపై పదునైన విమర్శలే చేశారు నాని. అప్పుడే జనసేన పేర్ని నానిపై ప్రత్యేక గురి పెట్టిందనే చర్చ సాగింది. ఇప్పుడు మచిలీపట్నంలో పార్టీ ఆవిర్భావ సభ పెట్టడం కూడా అదొక కారణంగా ప్రచారం జరుగుతోంది.

వారాహిపైనే బందర్‌ వరకు పవన్‌ కల్యాణ్‌ రోడ్‌ షో..!
ఒక్క పేర్ని నానికే కాకుండా పవన్ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడే వైసీపీ కాపు సామాజికవర్గం నేతలకు గట్టిగా కౌంటర్‌ ఇవ్వాలంటే మచిలీపట్నమే బెటర్‌ అని జనసేన భావించినట్టు సమాచారం. ఇంకోవైపు ప్రచార రథం వారాహిని తొలిసారి జనం మధ్యలోకి తెస్తున్నారు. పార్టీ సభకు వారాహి వాహనంపైనే పవన్‌ కల్యాణ్‌ బందర్‌ వెళ్లబోతున్నారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మచిలీపట్నం వరకు వారాహిపై రోడ్‌ షో నిర్వహిస్తారని.. మధ్య మధ్యలో ఆగుతూ.. జనం సమస్యలు తెలుసుకుని వెళ్లేలా రూట్‌ మ్యాప్‌ ఫిక్స్‌ చేసినట్టు తెలుస్తోంది. అంటే.. మంగళగిరి, విజయవాడ, పెనమలూరు, పామర్రు, పెడన నియోజకవర్గాలను టచ్‌ చేస్తూ దాదాపు 4 గంటలపాటు వారాహిపై రోడ్‌ షో ఉండొచ్చు.

పేర్ని నానిపై మళ్లీ మాటల దాడి తప్పదా?
బందర్‌ సభలో లోకల్‌ ఎమ్మెల్యే పేర్ని నానిపై పవన్‌ కల్యాణ్‌ ఎలాంటి విమర్శలు చేస్తారు? గతంలో ఇద్దరి మధ్య పరిధులు దాటిన విమర్శలు.. ఇప్పుడు మరో లెవల్‌కు చేరుకుంటాయా? వాటికి నాని రియాక్షన్‌ ఎలా ఉంటుంది? వంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ నెల 14 వరకు ఆగాల్సిందే.

Exit mobile version