ఉత్తరాంధ్రలోని ఆ నియోజకవర్గంలో కొత్త సమీకరణలు కనిపిస్తున్నాయా? జనసేన ముఖ్య నాయకుడు అక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టారా? ఆయన ఎంట్రీతో వైసీపీ కూడా యాక్టివ్ అయి రాజకీయాన్ని రక్తి కట్టిస్తోందా? ఒకప్పుడు టీడీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గంలో పోరు మెల్లిగా జనసేన వర్సెస్ వైసీపీగా మారుతోందా? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఎవరా జనసేన ముఖ్య నాయకుడు? శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియెజకవర్గం వైసీపీని గ్రూప్‌వార్ దెబ్బతీస్తోంది. ప్రతి మండలంలో ఏర్పడ్డ గ్రూపులు పార్టీని కోలుకోలేని దెబ్బ కొడుతున్నాయన్న ఆవేదన వ్యక్తమవుతోంది కేడర్‌లో. ఇక్కడ కాపుల ఓట్లు ఎక్కువ. తెలగ, తూర్పుకాపు కలిపి 75 శాతం ఉంటాయి. అలాంటి నియోజకవర్గంలో పోటీ చేసిన గొర్లె కిరణ్ ఓడిపోవడం పార్టీ వర్గాలకే మింగుడుపడ్డం లేదట.
సరే… జరిగిందేదో జరిగిపోయింది. ఇక చేయాల్సింది పార్టీని ఏకతాటిపైకి తీసుకుని రావడమని అనుకుంటున్నా…. ఇన్నాళ్లు ఆ దిశగా ఏ ప్రయత్నాలు జరక్కపోవడంతో కింది స్థాయి లీడర్స్‌లో స్తబ్దత నెలకొంది. ఐతే తాజాగా నియెజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు కాస్త ఆశలు రేపుతున్నాయట. అదే సమయంలో కాపులు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గం మీద జనసేన కూడా దృష్టి పెట్టడం ఆసక్తికరంగా మారింది. పార్టీ అగ్రనేత నాగబాబు ఇటువైపు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. నాగబాబు అందుబాటులోకి రావడం, ప్రతి గ్రామంలో ఉన్న జనసేన నేతలను యాక్టివేట్ చేయడంతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అలాగే… ఇతర పార్టీల్లోని అసంత్రుప్తులు, ఓటర్లను ప్రభావితం చేయగలిగిన నేతల్ని జనసేనలోకి ఆహ్వానిస్తున్నారట నాగబాబు.
కాపు ఓట్లతో పాటు మత్స్యకారులు కూడా అధికంగా ఉండటం, ఆ రెండు వర్గాలు కలిస్తే… జనసేనకు తిరుగుండబోదన్న లెక్కలు ఉన్నాయట. అలాగే…. ఎచ్చెర్ల కాపు సామాజికవర్గంలో ఉన్న అసంతృప్తిని తనకు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం మొదలుపెట్టింది జనసేన. ఈ పరిస్థితుల్లో… ఎచ్చెర్ల రాజకీయం వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా మారిపోతోందని చెబుతున్నారు. వైసీపీలోని అసంతృప్తులు, కొందరు తటస్తులు జనసేన వైపు మొగ్గుతుండటంతో…అప్రమత్తమై నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టారట మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్.
అగ్రనాయకత్వం సూచనలతో పార్టీ మారిన నేతలను కూడా 24 గంటల్లో మేం వైసీపీలోనే ఉన్నామని చెప్పించారాయన. తన లోపాలను సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నానని, కానీ పార్టీకి నష్టం కలిగితే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని అంటున్నారట ఆయన. బలమైన కేడర్ ఉన్న ఎచ్చెర్ల వైసీపీని గత ఎన్నికల్లో గ్రూప్ విభేదాలే దెబ్బతీశాయన్న క్లారిటీ వచ్చినందున దాన్ని సరిద్దుకుని ఐక్యతారాగం ఆలపించేపనిలో ఉన్నారు లోకల్ ఫ్యాన్ లీడర్స్. గతంలో నియోజకవర్గ స్థాయిలో ఉన్న మిస్ కమ్యూనికేషనే సమస్యలకు కారణమైందని, ఇప్పుడు ఒకరిద్దరు మినహా అంతా ఒక్కతాటిపైకి వస్తున్నట్టు కనిపిస్తోందని చెప్పుకుంటున్నారు. మొత్తం మీద నాగబాబు ఎంట్రీతో జనసేన పుంజుకోవడం, లోపాలు సరిద్దుకుని కలిసిపోదామన్న ఇన్ఛార్జ్ మాటలతో వైసీపీ యాక్టివ్ అవడంతో… ఎచ్చెర్ల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది.
