Off The Record : ఎవ్వరూ నోరు మెదపడం లేదని YS Jagan హెచ్చరించారా?

  • తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్టు వైసీపీ సీనియర్స్‌
  • కొందరి మీద పార్టీ అధ్యక్షుడు జగన్‌ సీరియస్‌ అయ్యారా?
  • నీట్‌ పేపర్‌ లీక్‌, పెట్రో ధరల పెంపుపై రియాక్షన్స్‌ లేవని అసంతృప్తి
  • ముఖ్య నేతల నుంచి సరైన రియాక్షన్‌ లేదని పార్టీలో చర్చ
Ysrcp

Ysrcp

వైసీపీ నేతల్లో స్పందనలు కరవయ్యాయా….? వేళ్ళ మీద లెక్కించతగ్గవాళ్లు తప్ప… మెజార్టీ సీనియర్‌ లీడర్స్‌ ముల్లుగర్రతో పొడిస్తే తప్ప ముందుకు కదలడం లేదా? చిన్నా… పెద్దా… అన్నిటికీ నేనే రియాక్ట్‌ అవ్వాల్సి వస్తోందని పార్టీ అధ్యక్షుడు జగన్‌ కూడా ఫ్రస్ట్రేట్‌ అవుతున్నారా? కొందరి మీద సీరియస్ అయ్యారా? ప్రజా సమస్యలపై క్షేత్ర స్థాయిలో పోరాడాల్సిన ప్రతిపక్ష నాయకులు ఎందుకు సైలెంట్ అయిపోతున్నారు..? దాని గురించి పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అధికారం పోయి ప్రతిపక్షంలోకి వచ్చి రెండేళ్ళవుతోంది. ఇప్పటికీ ఎక్కువ మంది సీనియర్‌ లీడర్స్‌ యాక్టివిటీకి దూరంగా ఉంటున్నారు. ఏదో… పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో మొక్కుబడిగా పాల్గొని మమ అనిపిండం తర్వాత… తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్టు టైంపాస్‌ చేయడం రొటీన్‌ అయిపోయిందన్న చర్చ ఇప్పుడు పార్టీ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది. దానికి సంబంధించే తాజాగా పార్టీ అధ్యక్షుడు కొందరు సీనియర్స్‌ మీద సీరియస్‌ అయినట్టు చెప్పుకుంటున్నారు. మరీ ముఖ్యంగా… ప్రస్తుతం నడుస్తున్న రెండు అతి ముఖ్యమైన అంశాలకు సంబంధించి నాయకుల వైఖరి గురించి మాట్లాడుకుంటున్నారు.

 

వేలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేస్తూ జరిగిన నీట్‌ ప్రశ్నాపత్రం లీక్‌, కోట్ల మందిని ప్రభావితం చేస్తున్న పెట్రో ఉత్పత్తుల ధరల పెంపు లాంటి అంశాల్లో వైసీపీ సీనియర్‌ లీడర్స్‌ సైతం చొరవ తీసుకుని ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం లేదన్నది పార్టీ ఇంటర్నల్‌ వాయిస్‌. అలాగే బెజవాడ దుర్గమ్మ ఆలయంలో జరిగిన ఘటన నుంచి ప్రజా సమస్యల వరకు.. అధికార పార్టీని టార్గెట్ చేసే అంశాలు చాలా ఉన్నా… ముఖ్య నేత‌ల‌ నుంచి సరైన రియాక్షన్ రావడం లేదన్న చ‌ర్చ సొంత పార్టీ వ‌ర్గాల్లోనే జ‌రుగుతోంది. ప్రజా సమస్యలు, సంక్షోభాల సమయంలో పార్టీ తరఫున గట్టిగా స్పందించాల్సిన నేతలు సైలెంట్‌గా ఉంటున్నారంటూ అధినేత జగన్ మరోసారి సీరియస్‌ అయినట్టు ప్రజాక్షేత్రంలో సమస్యలపై స్పందించాల్సి వచ్చిన ప్రతిసారీ….ఎవరూ నోరు మెదపడం లేదని నేరుగా సీనియర్లనే టార్గెట్ చేసి మాట్లాడిన‌ట్లు స‌మాచారం. నీట్‌ పేపర్‌ లీకేజీ ప్రభావం రాష్ట్రంలోనే దాదాపు 56 వేల కుటుంబాల మీద పడిందని, దేశ వ్యాప్తంగా దాని గురించి అంత దుమారం రేగుతున్నా.. ఇక్కడ పార్టీ నాయకులు కనీసం స్పందించకపోవడం, బలంగా వాయిస్‌ వినిపించకపోవడం ఏంటని నిలదీసినట్టు చెప్పుకుంటున్నారు.

దాంతో ఆ విషయంలో ఆలస్యం జరిగిందని నేతలు కూడా జగన్ ముందు ఒప్పుకోక తప్పలేదట‌. ఇదే స‌మ‌యంలో రాష్ట్ర ప్రభుత్వ అదనపు సుంకాలతో చుట్టు పక్కల రాష్ట్రాలన్నిటికన్నా… ఏపీలోనే పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు ఎక్కువగా ఉన్నాయని టాక్ నడుస్తున్నా.. ఇక్కడ పన్నులు తగ్గించాలని జనం కోరుకుంటున్నా.. ధరల పెంపుపై ఇతర పార్టీలు నిరసనలు వ్యక్తం చేసినా.. మనవైపు నుంచి క‌నీస స్పందన ఎందుకు కనిపించలేదని కూడా సీనియర్స్‌ని జగన్‌ ప్రశ్నించినట్టు తెలిసింది. అటు విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో పెచ్చులూడి పడి ఓ చిన్నారికి తీవ్ర గాయాలైనా పార్టీ నేత‌ల నుంచి రియాక్షన్ లేక‌పోవ‌టం కూడా చ‌ర్చనీయాంశమైంది. సున్నితమైన అంశాలను స్థానిక నేతలు వెంటనే అడ్రస్ చేయాల్సి ఉండగా.. ఎవరూ ముందుకు రాకపోవడంపై జ‌గ‌న్ అసహనం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. నిజానికి నాయకుల మీద వైసీపీ అధ్యక్షుడు ఇలా అసహనం వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు.

ఏ అంశానికి సంబంధించి అయినా…. నేనే మాట్లాడాల్సి వస్తోంది, నాయకులు చొరవ తీసుకోవడం లేదంటూ గతంలో పలుమార్లు బహిరంగంగానే వ్యాఖ్యానించారాయన. మా వాళ్లు ఇంకా గేర్ మార్చలేదని క్యాజువ‌ల్‌గా అన్నా…తన అసంతృప్తిని నేరుగానే అర్దమ‌య్యేలా చెప్పార‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది పార్టీలో. కొంద‌రు నేత‌లు మిన‌హా ఎక్కువ మంది సీనియర్స్‌… ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవడం లేదన్న అసంతృప్తి పెరుగుతోందట. క‌రెంట్ అఫైర్స్‌పై స్పందించాల్సిన స‌మ‌యంలో స్పందించ‌కుండా…. ప్రభుత్వం వైపు నుంచి క‌రెక్షన్స్ కూడా జ‌రిగి పోయిన త‌ర్వాత తీరుబ‌డిగా మాట్లాడి అభాసుపాలు కావాల్సి వస్తోందని పార్టీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. ఈ వ్యవహారాలు ఇలాగే సాగితే.. మున్ముందు కష్టమేనన్న ఆందోళన కూడా కొందరు నేతల్లో వ్యక్తమవుతోందట. వైసీపీ సీనియర్స్‌లో ఎక్కువ మంది సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్ళిపోగా…. పార్టీ అధిష్టానం నుంచి క‌బురు వ‌స్తే రియాక్ట్ అయ్యే వారు కొంద‌రు. మరీ…. త‌ప్పనిస‌రి అయితే చూద్దాంలే… అప్పుడు మాట్లాడదాంలే అనుకునే బ్యాచ్‌ ఇంకోటి. అందుకే నాయకుల తీరు మారాలంటూ కేడర్‌ వాయిస్‌ కూడా పెరుగుతోంది. ఇప్పటికైనా ఈ నేతలు ప్రజా సమస్యలపై గళం విప్పకపోతే.. అధినేత జ‌గ‌న్ యాక్షన్ ప్లాన్ వేరేలా ఉంటుందనే హెచ్చరికలు కూడా గట్టిగానే వెళ్తున్నాయట. మరి ఆ నేత‌లు గేరు మార్చి ముందుకు వెళ్తారా.. లేక జ‌గ‌నే కొత్త గేరు వేస్తారా అన్నది చూడాలి.