OTR : ఉమ్మడి గుంటూరులో రీఛార్జ్ అవని వైసీపీ లీడర్స్

Ycp

Ycp

వైసీపీ అధ్యక్షుడు జగన్‌ వేవ్‌లెంగ్త్‌కు ఆ ఉమ్మడి జిల్లా నేతలు సింక్‌ అవలేకపోతున్నారా? ఆయన సీరియస్‌గా చెప్పిన మాటలు కూడా వాళ్ళ బుర్రలకు ఎక్కడం లేదా? ఎలాగైనా యాక్టివ్‌ చేద్దామని ఆయన ప్రయత్నిస్తుంటే… వాళ్ళు మాత్రం ససేమిరా అంటున్నారా? పార్టీ వరుస కార్యక్రమాలకు పిలుపునిస్తున్నా… అధినేత వార్నింగ్‌ ఇస్తున్నా… మాకు కాదులే అన్నట్టుగా ఉన్న ఆ నాయకులు ఎవరు? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ నాయకులు చాలా మంది వ్యవహారశైలి పార్టీ పెద్దలకే అంతుబట్టడం లేదట. ఎన్నికల ఓటమి నుంచి కోలుకుని రాష్ట్రం మొత్తం మీద పార్టీ లీడర్స్‌ రీ ఛార్జ్‌ మోడ్‌లోకి వచ్చేసినా, జిల్లాలో కూడా కొందరు యాక్టివ్‌గా తిరుగుతున్నా… ఎక్కువ మంది మాత్రం ఇంకా చూద్దాం చేద్దాం దగ్గరే ఆగిపోయారంటూ అసంతృప్తిగా ఉంది కేడర్‌. రాజధాని అమరావతి ఉన్న కీలకమైన జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే ఎలాగన్న ప్రశ్నలు పార్టీ వర్గాల్లో పెరుగుతున్నాయి. ఒకవైపు పార్టీ అధిష్టానం ప్రభుత్వ వ్యవహారశైలికి నిరసనగా వరుస కార్యక్రమాలకు పిలుపునిస్తోంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తూ ప్రజల్లో ఉండేలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అటు రాబోయే స్థానిక ఎన్నికల కోసం సిద్ధమవమని కూడా పార్టీ అధ్యక్షుడు జగన్‌ పిలుపునిచ్చారు. నాయకుల అలసత్వాన్ని ఏమాత్రం సహించబోమని, ఏకపక్ష ఏకగ్రీవాలను అంగీకరించే ప్రసక్తే లేదంటూ క్లియర్‌గా చెప్పేశారు కూడా. అలా… అధినేత ఆలోచన ఒకలా ఉంటే… ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కొంతమంది నేతలు మాత్రం మరోలా వ్యవహరిస్తున్నారంటూ పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఎక్కువ మంది నాయకులు అసలు నియోజకవర్గాలవైపే కన్నెత్తి చూడడం లేదట. పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించినప్పుడు మాత్రం ఇలా వచ్చి అలా ముఖం చూపించి వెళ్ళిపోతున్నారని, ఆ తర్వాత ఇక్కడేం జరుగుతోందో అస్సలు పట్టించుకోవడం లేదని అంటున్నారు.

ప్రకటించిన కార్యక్రమం అయిపోగానే….వెళ్ళిపోయి సొంత పనుల్లో బిజీగా ఉంటున్నారన్నది కేడర్‌ వాయిస్‌. ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితే ఉండడం పార్టీకి ఇబ్బందిగా మారుతోందంటున్నారు. కొన్ని చోట్ల నాయకులు యాక్టివ్‌గా పనిచేస్తూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నా… ఎక్కువ శాతం మాత్రం సొంత పనులు తప్ప పార్టీని పట్టించుకోవడం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. బాపట్ల ఇన్ఛార్జ్‌ కోన రఘుపతి కార్యకర్తలకు అందుబాటులో ఉండడంలేదన్న ప్రచారం జరుగుతోంది. పార్టీ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చినప్పుడు రావడం, తర్వాత వెళ్ళిపోవడం షరా మామూలుగా మారిపోయిందట. ఈ మధ్యలో కార్యకర్తలకు, ద్వితీయ శ్రేణి నాయకులకు ఏదైనా అవసరం పడితే… ఎవరి దగ్గరకు వెళ్ళాలో తెలియని గందరగోళం. ఇలాగే కొనసాగితే…. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగంటూ క్యాడర్ మథనపడుతోందట. ఇక రేపల్లెలో ఇన్ఛార్జ్‌ని మార్చిన కొత్తల్లో కొంత జోష్ కనిపించినా…. తర్వాత నియోజకవర్గంలోని ఇద్దరు కీలక నేతలకు పొసగకపోవడం ఇబ్బందిగా మారిందంటున్నారు. సత్తెనపల్లి ఇన్ఛార్జ్‌ సుధీర్ భార్గవ్ రెడ్డి ఇప్పటికీ నర్సరావుపేట నుంచి రాజకీయాలు చేస్తుండడం లోకల్‌ లీడర్స్‌కు ఇబ్బందిగా ఉందట. రాజధాని ప్రాంతం ఉన్న నియోజకవర్గం తాడికొండ ఇన్ఛార్జ్‌ డైమండ్ బాబు గుంటూరు నుంచే పాలిటిక్స్ చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు తప్ప నియోజకవర్గంవైపు చూడడం లేదని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లో మరీ ఇంత ఘోరంగా లేకున్నా… తేడాగానే ఉందన్నది కేడర్‌ చెబుతున్న మాట. ఇన్ఛార్జ్‌లు ఇలాగే వ్యవహరిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవన్నది కార్యకర్తల అభిప్రాయం. అధినేత అంత క్లారిటీగా తేల్చిచెప్పినా… నేతల్లో మార్పురాకపోతే ఎలాగంటూ పార్టీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.