OTR : కూటమి అతి విశ్వాసం దెబ్బ కొట్టిందా? మేయర్కి క్రాస్ ఓటింగ్ జరిగిందా?

Ycp

Ycp

ఏపీ మున్సిపల్‌ కార్పొరేషన్స్‌ అన్నీ కూటమి ఖాతాలో పడ్డా… ఒక్క అనంతపురం మాత్రం ఎందుకు అడ్డం తిరిగింది? అది వైసీపీ బలమా? లేక అధికార పక్షం అతి విశ్వాసమా? మొత్తంగా అసలు సీటు కేటాయింపే తేడానా? అనంతలో ఏ ఫ్యాక్టర్ విపక్షానికి కలిసి వచ్చింది? కూటమి ఎందుకు ఉక్కిరి బిక్కిరి అయింది? అసలు అనంతపురంలోని ప్రత్యేక పరిస్థితులు ఏంటి? ఏపీ మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమి సునామీ సృష్టించింది. మొత్తం 13 మున్సిపల్‌ కార్పొరేషన్స్‌కు ఎలక్షన్లు జరగ్గా…. 12 కూటమి ఖాతాలో పడిపోయాయి. ఇక వైసీపీ పోరాడి గెల్చుకున్న ఒకే ఒక్క కార్పొరేషన్‌ అనంతపురం. దీంతో.. అసలక్కడ ఏం జరిగిందన్న ఆసక్తి పెరుగుతోంది రాజకీయ వర్గాల్లో. మామూలుగా అయితే… తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్న ప్రాంతం అనంతపురం. పైగా ఇక్కడ ఆ పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు కూడా. అలాంటి చోట వైసీపీ ఖాతా తెరిచిందంటే… అది కూటమి నేతల అతి విశ్వాసం ఫలితమా? లేక మేయర్‌ అభ్యర్థికి క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందా అన్న చర్చలు మొదలయ్యాయి పొలిటికల్‌ సర్కిల్స్‌లో. టీడీపీకి పట్టున్న ఈ సీటును పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు. అభ్యర్థి ఎంపికలో వేసిన తప్పటడుగుల నుంచి ఆచరణ సాధ్యం కాని అతి హామీల దాకా.. అన్నీ కలగలిసి కూటమికి పాఠం నేర్పాయని అంటున్నారు పరిశీలకులు. అనంతపురంలో క్షేత్రస్థాయి వాస్తవాలను విస్మరించి… కార్పొరేట్ రాజకీయం చేసిన కూటమికి నగర ఓటర్లు గట్టి షాకే ఇచ్చారని అంటున్నారు.

బలమైన ప్రజా పునాది, విద్యార్థి-బీసీ ఉద్యమాల నేపథ్యం ఉన్న వైసీపీ అభ్యర్థి రమేష్‌గౌడ్ ఇమేజ్‌ను, సీనియర్‌ అనంత వెంకట్రామిరెడ్డి పక్కా వ్యూహాల ముందు బీజేపీ హేమాహేమీల ప్రచారం సైతం తేలిపోయిందని అంటున్నారు. అందుకే రాష్ట్రమంతటా కూటమి గాలి వీచినా, అనంతపురం కార్పొరేషన్ పీఠాన్ని మాత్రం వైసీపీ కైవసం చేసుకుని ఉనికి చాటిందని అంటున్నారు. నిజానికి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సాంప్రదాయకంగా మంచి పట్టుంది. కానీ…ఈ మేయర్ స్థానాన్ని అనూహ్యంగా బీజేపీకి ఇవ్వడం దగ్గరే కూటమి తప్పటడుగులు మొదలయ్యాయన్నది ఓ అనాలసిస్‌. ఇక అభ్యర్థి ఎంపికలో ఆరంభం నుంచే బీజేపీ నాయకత్వం తీవ్ర గందరగోళానికి గురైంది. తొలుత డాక్టర్ విక్రమ్‌కు మేయర్ సీటు ఇవ్వాలని భావించారు. ఆ తర్వాత చివరి నిమిషంలో సమీకరణలు మారి అజేష్ బాబు తెరపైకి వచ్చారు. బీజేపీ తరపున ఆ పార్టీకి చెందిన రాష్ట్ర మంత్రి సత్యకుమార్ స్వయంగా రంగంలోకి దిగి అజేష్ బాబును నడిపించినప్పటికీ…. స్థానికంగా గుర్తింపు లేకపోవడం కూటమికి పెద్ద మైనస్‌ అయింది. జాతీయ నాయకురాలు పురందేశ్వరి, మాధవ్, సోము వీర్రాజులతో పాటు సినీ గ్లామర్ ఉన్న సాయికుమార్, బాబు మోహన్ వంటి హేమాహేమీలను రంగంలోకి దించింది కమలం పార్టీ. మున్సిపల్‌ ఎన్నికల్లో గెలిస్తే అనంతపురానికి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అంతర్జాతీయ హార్టికల్చర్ హబ్ అంటూ ఆకాశమే హద్దుగా హామీల వరద పారించింది కాషాయ దళం. అలాంటి హామీలు ఇవ్వడానికి వాళ్ళు మొహమాటపడకున్నా…. ఆచరణ సాధ్యం కానివిగా భావించిన జనం మాత్రం సిగ్గుపడ్డారట. వాటి గురించి వినడానికి, నమ్మడానికి ఓటర్లు సిద్ధంగా లేకుపోవడమే అనంతపురంలో కూటమికి పెద్ద శాపంగా మారిందంటున్నారు పరిశీలకులు.

లోకల్‌ ఎన్నికల బరిలో బీజేపీ అత్యాధునిక కార్పొరేట్ విధానాలను అవలంబించిందే తప్ప, క్షేత్రస్థాయిలో సామాన్య ఓటర్లను, స్థానిక క్యాడర్‌ను లైన్‌లోకి తెచ్చుకోవాలన్న బేసిస్ అంశాన్ని మర్చిపోయిందని కూడా విశ్లేషిస్తున్నారు కొందరు. దానివల్లే ఇబ్బందులు తలెత్తాయంటున్నారు. వీటన్నిటితో పాటు ఇక్కడ కూటమి ఓటమికి అంతర్గత విభేదాలు, క్రాస్ ఓటింగ్ కూడా గొడ్డలిపెట్టుగా మారాయంటున్నారు. డివిజన్స్‌లో నలుగురు ఇండిపెండెంట్లు విజయం సాధించడమే కాకుండా, బీజేపీ, జనసేన పోటీ చేసిన స్థానాల్లో స్థానిక నాయకులు పూర్తి స్థాయిలో సహకరించకపోవడం కూటమి కొంపముంచిందట. మరోవైపు వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ అత్యంత పకడ్బందీగా వ్యవహరించారు. గ్రౌండ్ లెవెల్‌లో విస్తృతంగా పర్యటిస్తూ… బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టో అమలు అసాధ్యమన్న అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళగలిగారని అంటున్నారు. అలాగే… స్థానిక టీడీపీ ఎమ్మెల్యే తప్పిదాలను హైలైట్‌ చేస్తూ… సేవ్ అనంతపురం నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు. ఇలా రకరకాల ఫ్యాక్టర్స్‌ పనిచేసి అనంతపురం మేయర్ సీటు తమ ఖాతాలో పడటంతో… జిల్లా వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు పండగ చేసుకుంటున్నాయి.