Site icon NTV Telugu

Off The Record : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో క్రెడిట్ పాలిటిక్స్..?

Khammam

Khammam

Off The Record : ఆ ఉమ్మడి జిల్లాలో నీటి పోటీలు జరుగుతున్నాయా? క్రెడిట్‌ రేస్‌లో ముగ్గురు మంత్రులు పోటీలు పడుతున్నారా? ఒకరు ముందు, మరో ఇద్దరు కాస్త వెనకగా నీళ్ళు విడుదల చేయించి తమ ఖాతాలో వేసుకునే ప్లాన్‌లో ఉన్నారా? ఎవరా మంత్రులు? ఏంటా క్రెడిట్‌ వార్‌? ఉమ్మడి ఖమ్మం జిల్లా పొలాలకు సాగునీరు ఇచ్చే విషయంలో మంత్రుల మధ్య క్రెడిట్ పాలిటిక్స్‌ నడుస్తున్నాయట. జిల్లాకు చెందిన ముగ్గురు ముఖ్య నాయకులు రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నందున లోకల్‌గా ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్‌ అవుతోంది.

జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రాంతాలు వరి నాట్లకు సిద్ధమయ్యాయి. మరి కొన్ని చోట్ల వేశారు కూడా. ఈ క్రమంలో… ముఖ్యంగా వైరా ప్రాజెక్టు కింద, అలాగే… సత్తుపల్లి ఏరియాలో సాగునీటి అవసరం ఉంది. సాగర్ నీటి విడుదల కోసం రైతుల నుంచి వత్తిడి ఉంది కూడా. అది గమనించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీతారామ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

నాగార్జున సాగర్ నుంచి ఇప్పటికిప్పుడు సాగునీరు విడుదలవుతుందన్న నమ్మకం మొన్న మొన్నటి వరకు లేదు. ఇప్పుడంటే… భారీ వర్షాలు, వరదలతో సాగర్ కూడా భారీగానే నీళ్లు వచ్చాయి. అయినా ఇంకా సాగు కోసం వదల్లేదు. పాలేరు రిజర్వాయర్‌కు మాత్రం తాగు నీటిని వదిలారు. తాగు అవసరాలకు మాత్రమే వాడాలని చెప్పారు కూడా. ఈ పరిస్థితుల్లో… సీతారామ ప్రాజెక్ట్‌ నుంచి నీటిని విడుదల చేయాలని మంత్రి తుమ్మల ఉన్నతాధికారులను ఆదేశించడంతో పాటు అవసరాన్ని గుర్తించాలని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి కూడా చెప్పారట. దీంతో సీతారామ ప్రాజెక్టు నుంచి నీటి విడుదలకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. అయితే… ఎక్కడా తాను తెర మీదికి రాకుండా అధికారులతోనే పని పూర్తి చేయించారు తుమ్మల.

ఆ నీళ్లు వైరా ప్రాజెక్ట్‌కు చేరుకున్నాక… ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మథిర నియోజకవర్గాన్ని కూడా టచ్ చేస్తాయి. దీంతో అవసరాలను గుర్తించి ముందే నీళ్ళు విడుదల చేయించిన క్రెడిట్‌ను తుమ్మల కొట్టేశారన్న టాక్‌ నడుస్తోంది జిల్లాలో. మరోవైపు ఇప్పటికే…నాగార్జునసాగర్ నుంచి త్రాగునీటి కోసమే పాలేరు రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేశారు. పాలేరులో ప్రస్తుతం నీటి నిల్వ 22 అడుగులకి చేరుకుంది. అయితే… కాల్వల మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి.

ఇదే సందర్భంలో సాగర్ ఆయకట్టులో నాట్ల కోసం నీటి అవసరం ఏర్పడింది. దీంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జోక్యం చేసుకుని అధికారులతో మాట్లాడి పాలేరు రిజర్వాయర్‌ నుంచి సాగర్ ఆయకట్టుకి నీళ్ళు విడుదల చేయాలని ఆదేశించారు.

దాంతో తాజాగా పాలేరు నుంచి సాగర్ ఆయకట్టుకి నీళ్ళు విడుదలయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కుని ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పాలేరు నియోజకవర్గంలో మొట్ట మొదటిసారిగా ఇద్దరు మంత్రులు…. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భట్టి విక్రమార్క పాల్గొని నీటి విడుదలలో కీలకంగా వ్యవహరించారు. అటు తుమ్మల నాగేశ్వరరావు సీతారామ నుంచి సాగర్ ఆయకట్టుకి నీళ్ళు విడుదల చేయిస్తే…. ఇటు పాలేరు రిజర్వాయర్ నుంచి మంత్రులు పొంగులేటి. భట్టి విడుదల చేయించారు. అలా… ముగ్గురూ ఈ క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి జిల్లాలో. అదే సమయంలో… వాళ్ళు క్రెడిట్‌ చూసుకున్నారా? లేక సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో వ్యవహరించారా అన్న అనుమానాల్ని పక్కనబెడితే… జరిగింది మాత్రం రైతుల మంచికే కదా అన్న వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Exit mobile version