OTR: కూటమి పెద్దలతో వంగవీటి రాధా వరుస భేటీలకు కారణాలేంటి.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కూటమి పెద్దలతో వంగవీటి రాధా వరుస భేటీల ఆంతర్యం ఏంటి? తాజాగా డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ను ఈ టీడీపీ నాయకుడు ఎందుకు కలిశారు? ఆ మీటింగ్ గురించి రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చలేంటి? వంగవీటి అభిమానులు ఏమంటున్నారు? మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా ప్రస్తుతం ఒక విచిత్రమైన స్థితిలో ఉన్నారట. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి లోకేష్ నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఆయన వెళ్లి కలిసి వస్తున్నారు. అలా వెళ్ళిన ప్రతిసారి ఏదో జరగబోతోందన్న చర్చోపచర్చలు నడవడం, ఆ తర్వాత అంతా కామ్ అయిపోవడం సర్వ సాధారణంగా మారింది. దీంతో…అసలేం జరుగుతోంది? వాళ్ళు ఎందుకు పిలుస్తున్నారు? ఈయన ఎందుకు వెళ్లి వస్తున్నారంటూ రాజకీయవర్గాల్లో సరికొత్త డిస్కషన్ మొదలైంది. కాంగ్రెస్ నుంచి 2004లో ఎమ్మెల్యేగా గెలిచిన రాధా… రెండు సార్లు శాసనసభకు పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ నుంచి ప్రజారాజ్యానికి, అక్కడి నుంచి వైసీపీకి, 2019 ఎన్నికల సమయంలో టిడిపిలోకి రాధా రాజకీయ ప్రయాణం కొనసాగింది. 2019 నుంచి ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నప్పటికీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి మాత్రం దూరంగా ఉంటున్నారు. 2014 తర్వాత జరిగిన 2019, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రాధా పోటీ చేయలేదు. ఇక 24లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో… ఆయనకు ఖచ్చితంగా ఎమ్మెల్సీ దక్కుతుందని అనుకున్నారు అనుచరులు. కానీ… రెండున్నరేళ్ళు అవుతున్నా….ఇప్పటి వరకు ఆ ఊసేలేదు. కానీ… రాధా మాత్రం తరచుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌తో సమావేశం అవటం రకరకాల ఊహాగానాలకు తెర తీస్తోంది. తాజాగా డిప్యూటీ సీఎం పవన్‌తో భేటీ అయ్యారాయన. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతుండగా…ఇటు రాధా వర్గంలో కూడా కొత్త చర్చ జరుగుతోందట. దివంగత నేత వంగవీటి రంగా కుమారుడిగా రాధాకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
ప్రత్యేకించి కాపు సామాజికవర్గంలో ఆయనకు ఫాలోయర్స్ కూడా ఎక్కువ. అటు వైసీపీలో ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీ, జక్కంపూడి రాజా లాంటి నాయకులతో ఆయనకు దీర్ఘకాల స్నేహం ఉంది. తన రాజకీయాలు, పార్టీలతో సంబంధం లేకుండా…. వీరితో స్నేహాన్ని కొనసాగిస్తున్నారాయన. ఆ సంగతి ఎలా ఉన్నా… కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా.. తమ నాయకుడికి ఎమ్మెల్సీ దక్కకపోవడంపై రాధా వర్గం తీవ్ర అసంతృప్తిగా ఉందట. దాన్ని తగ్గించేందుకా అన్నట్టు కూటమి ముఖ్య నాయకులంతా తరచూ ఆయన్ని పిలిచి భేటీ అవుతుండవచ్చన్న విశ్లేషణలు ఇప్పుడు పెరుగుతున్నాయి. అలా పిలిచిన ప్రతిసారి కీలక బాధ్యతలు ఏమన్నా అప్పగిస్తారా అని ఎదురు చూడటం, తర్వాత ఊసూరుమనడం సర్వసాధారణమైపోయిందని అంటోంది వంగవీటి వర్గం. ఏమీలేనికాడికి ఆయన్ని పిలవడం, మీటింగ్ పెట్టి ఫోటోలు దిగడం ఎందుకంటూ రాధా వర్గంలో అసహనం కూడా పెరిగిపోతోందట. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో రాధా భేటీ తర్వాత ఈ చర్చ పీక్స్‌కు చేరింది. రాధాకు ఎమ్మెల్సీ ఇవ్వాలని టీడీపీ అధిష్టానానికి ఉన్నప్పటికీ… కొన్ని ప్రత్యేక సమీకరణల కారణంగా అది ఆలస్యం అవుతోందని చెప్పుకుంటున్నారు. ఈ సమయంలో తాను అసంతృప్తిగా ఉన్నట్టు రాధా ఎక్కడా కనిపించకపోయినా… ఆయన వర్గం బహిరంగంగానే వ్యక్తం చేస్తోంది. ఆ విషయాన్ని గుర్తించిన కూటమి పెద్దలు తరచూ ఆయన్ని పిలిచి సమావేశమై… ఆయన మాకు దూరంగా లేరు, మేమంతా ఒక్కటేనని చెప్పే ప్రయత్నంలో ఉన్నట్టు అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోవైపు తన స్నేహితులైన వైసీపీ నాయకులు వంశీ, ఇతరులను కలిసినప్పుడు ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో రాధా మళ్ళీ వైసీపీలో చేరతారన్న ప్రచారం కూడా ఇటీవల విస్తృతంగా జరిగింది. ఈ పరిస్థితుల్లో ఆయన తమతోనే ఉన్నారని, రాధను తాము మర్చిపోలేదని చెప్పటానికే ఈ భేటీలు జరుగుతున్నాయన్నది పొలిటికల్ అనాలసిస్. ఇక పవన్‌తో ఆకస్మిక భేటీ వెనక స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉండి ఉండవచ్చంటున్నారు. ఆ సంగతి ఎలా ఉన్నా… ఎన్నాళ్ళిలా అంటూ… వంగవీటి వర్గంలో మాత్రం నిరాశ పెరిగిపోతోందన్నది ఒక పొలిటికల్ పరిశీలన.
Also Read
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!