తండ్రి మంత్రి, పెదనాన్న ఎమ్మెల్యే, తానేమో ఎంపీ. అయినా సరే….. ఆయనకు పొలిటికల్ పట్టు చిక్కడం లేదట. పైగా తన పరిధిలోని ఎమ్మెల్యేలు దాదాపు ఒంటరిని చేసిన ఫీలింగ్. ఆగర్భ శ్రీమంతుడైన ఆ ఎంపీ చివరికి కులం కార్డు కూడా ఎందుకు వాడాల్సి వచ్చింది? ఆయన చెబుతున్నట్టు అసలు కారణం అదేనా? అంతకు మించిన రీజన్స్ వేరే ఉన్నాయా? ఎవరా లోక్‌సభ సభ్యుడు? ఎందుకా ఒంటరి పోరాటం? పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు, ఆయన పరిధిలోని ఎమ్మెల్యేలకు మధ్య వ్యవహారం ఎడమోహం పెడమోహం అన్నట్టే ఉందట. సొంతపార్టీ ఎమ్మెల్యేలతో ఎంపీకి ఇప్పటికీ సఖ్యత కుదరడం లేదని చెప్పుకుంటున్నారు. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళే. అయినాసరే… రెండేళ్ళ తర్వాత కూడా… ఎంపీకి కెమిస్ట్రీ కుదరకపోవడం ఏంటన్న చర్చలు నడుస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా పరిధిలో నాలుగు, మంచిర్యాల జిల్లా పరిధిలోని మూడు అసెంబ్లీ స్థానాలు ఈ ఎంపీ కిందికి వస్తాయి.
వంశీ తండ్రి వివేక్, పెదనాన్న వినోద్ కూడా ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కుటుంబ సభ్యులు తప్ప వేరే ఎవరూ వంశీని అస్సలు పట్టించుకోవడం లేదట. ప్రోటోకాల్ పాటించడం లేదని, పార్టీ కార్యక్రమాల మాట అటుంచితే… గవర్నమెంట్ ప్రోగ్రామ్స్‌కు సైతం పిలవడం లేదంటూ… మొదట్లో చిన్న స్థాయి యుద్ధమే చేశారు వంశీ. అయితే మారిన రాజకీయ సమీకరణలు.. వంశీ తండ్రి వివేక్ మంత్రి కావడం, పార్టీ పెద్దలు పిలిచి క్లాస్ పీకడంతో కాస్త కూల్ అయ్యారట ఎమ్మెల్యేలు… కొంచెం తగ్గి ఎంపీ ఫోటోను ఫ్లెక్సీల్లో వేయడం, ఫార్మల్‌గా ఆహ్వానాలు పంపడం లాంటివి చేస్తున్నారట. దీంతో…అసలు ఎక్కడ తేడా కొడుతోంది? అంతా అదే పార్టీ వాళ్ళయినా ఎందుకు కలవలేకపోతున్నారన్న చర్చలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే రకరకాల అంశాలు వెలుగు చూస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఎంపీకి, ఓ మంత్రికి మధ్య సంబంధాలు బెడిసికొట్టాయట. అప్పటి నుంచి వంశీని లైట్ తీసుకోవడం మొదలైనట్టు తెలుస్తోంది. నిరుడు జరిగిన సరస్వతి పుష్కరాలతో ఆ గ్యాప్ మరింతగా పెరగిందని చెబుతున్నారు. దానికి సంబంధించి బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు ఎంపీ.
ఆ తర్వాత పెద్దపల్లిలో జరిగిన యువత సభలో సీఎం సాక్షిగా మరోసారి తన ఆవేదనను వ్యక్తం చేశారాయన. ఇక ఒక్కమాటలో చెప్పాలంటే వంశీని ఏకాకిని చేసేశారు సొంతపార్టీ ఎమ్మెల్యేలు. అది ఎంతలా అంటే… డబ్బు ఉండగానే సరిపోదు, కులం కూడా ముఖ్యమేనని తెలిసొచ్చిందంటూ.. స్వయంగా వంశీనే వ్యాఖ్యలు చేసేంత వరకు వెళ్లింది. ఇదే అదనుగా బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ ఎంట్రీ ఇచ్చేసి కాంగ్రెస్ ఎంపీకి మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్‌లో దళితులకు అవమానం జరుగుతోందని ఆయన విమర్శలు చేయడం అప్పట్లో కలకలం రేపింది. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితులు నేపథ్యంలో అప్పట్లో ఉన్నంతగా కాకపోయినా ఎంపీని కనీసం బ్యానర్లలో, శిలాఫలకాల్లో గుర్తిస్తున్నారట. ధర్మపురి, పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలు వంశీని ఇప్పటికీ… ఓన్ చేసుకోవడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకు అసలు కారణాలు వేరే ఉన్నాయన్నది ఇంకో వెర్షన్. తండ్రి, తాత ఎంపీలుగా ఉన్నప్పటి పరిచయాలను ఉపయోగించుకుని అన్ని నియోజకవర్గాల్లోనూ సొంత టీమ్స్ తయారు చేసే పనిలో ఉన్నారట వంశీ. అంది సహించలేకనే ఎమ్మెల్యేలు ఆయన్ని దూరం పెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు.
అటు మంచిర్యా పరిధిలో ఉన్న మూడు నియోజకవర్గాల్లో రెండింట్లో నాన్న, పెదనాన్నలే ప్రాతినిద్యం వహిస్తుండగా… మరో సీటు మంచిర్యాల ఎమ్మెల్యేగా ప్రేమ్ సాగర్‌రావు ఉన్నారు. ప్రేమ్ సాగర్‌రావు, వివేక్ మధ్య ఉన్న విభేదాల కారణంగా…. అక్కడ కూడా టచ్‌మీ నాట్ అన్నట్టే ఉందట పరిస్థితి… ఇక మేజర్ సీట్లున్న పెద్దపల్లి జిల్లా పరిధిలోని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌లకు కూడా వంశీతో అంతగా సఖ్యత లేదట. వివాదానికి కారణమని అప్పట్లో జోరుగా ప్రచారం సాగినా.. మంత్రి శ్రీధర్ బాబు మాత్రం ఇటీవల తన నియోజకవర్గంలోని పలు కార్యక్రమాలకు ఎంపీని పిలిచారు.. ఆయా కార్యక్రమాల్లో ఆయనతో కలిసి పాల్గొన్నారు… శ్రీధర్ బాబుతో ఎంపీ వంశీ కలిసిపోయాక కొంత క్లారిటీ వచ్చినప్పటికీ.. మిగతా ఎమ్మెల్యేలు కలుపుకోక పోవడం ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీస్తోంది… అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల్లో వందకు వందశాతం సీట్లు సాధించిన పెద్దపల్లి కాంగ్రెస్‌లో ఈ గొడవలకు పుల్‌స్టాప్ ఎప్పుడు పడుతుంది..? ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ వార్ ప్రభావం ఆయా నియోజకవర్గాల్లో పరిషత్ ఎన్నికలపై పడుతుందా…? లాంటి ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకడం లేదని అంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు.
