Off The Record : ఎమ్మెల్యే కొలికపూడి వరుస ట్వీట్లతో దుమారం

  • పాతికేళ్ళ తర్వాత తిరువూరులో ఎగిరిన పసుపు జెండా
  • మంచి రోజులు వచ్చాయనుకున్న టీడీపీ కేడర్‌కు షాక్స్‌
  • ఎమ్మెల్యే వర్సెస్‌ ఎంపీగా మొదలై ముదిరిపోయిన వివాదం
  • గెలుపుని ఆస్వాదించలేకపోతున్నామని ఫీలవుతున్న టీడీపీ కేడర్‌
Tiruvuru

Tiruvuru

అక్కడ ఏకకాలంలో రాజకీయ ప్రత్యర్థులు ఇద్దరూ ఫీలైపోతున్నారా? ఏం ఖర్మరా… దేవుడా…. ఇదెక్కడి గోలరా నాయనా అంటూ… టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఒకేసారి ఎందుకు తలలు బాదుకుంటున్నారు? ఒకరి మైనస్‌ మరొకరికి ప్లస్‌ అవ్వాల్సిన పరిస్థితుల్లో… రెండు పార్టీల వాళ్ళు ఎందుకు ఇబ్బందిగా ఫీలవుతున్నారు? గెలిచిన ఆనందాన్ని తెలుగుదేశం కార్యకర్తలు ఎందుకు ఆస్వాదించలేకపోతున్నారు? పరిస్థితిని వైసీపీ ఎందుకు వాడుకోలేకుపోతోంది? అసలు ఎక్కడుందా పరిస్థితి?

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో వరుసగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఏకకాలంలో ఇటు అధికార, అటు ప్రతిపక్ష పార్టీల కేడర్‌ను నైరాశంలోకి నెట్టేస్తున్నాయట. ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున కొలికపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన స్థానికుడు కాకపోయినా…. చివరి నిమిషంలో అధిష్టానం టికెట్ ఖరారు చేయడంతో పార్టీ లీడర్స్‌, కేడర్‌ అంతా కలిసి కసిగా పని చేసి గెలిపించారు. వాస్తవానికి తిరువూరు నియోజకవర్గం అంతకు ముందు
కాంగ్రెస్‌కి, తర్వాత వైసీపీకి కంచుకోట. అలాంటిది ఐదు ఎన్నికల తర్వాత…. అంటే…. పాతికేళ్ళకు గత ఎన్నికల్లో తెలుగుదేశం జెండా ఎగిరింది. ఇక్కడ గెలుపు కోసం ముఖం వాచిపోయి ఉన్న పసుపు కార్యకర్తలు…ఈసారి గెలవడంతోపాటు రాష్ట్రంలో కూడా పార్టీ అధికారంలోకి రావడంతో ఇక తమకు మంచి రోజులు వచ్చాయని భావించారు. కానీ… ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మాత్రం వాళ్ళకు అస్సలు మింగుడు పడ్డం లేదట. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా మొదలైన వ్యవహారం.. ముదిరి ఎమ్మెల్యే వర్సెస్ టిడిపి అధిష్టానం అనేంత వరకు వెళ్ళింది.

ఈ పరిస్థితుల్లో… రెండున్నర దశాబ్దాల తర్వాత దక్కిన విజయాన్ని లోకల్‌ లీడర్స్‌ పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నారట. దాంతోపాటు నిత్యం తలెత్తుతున్న వివాదాలతో సీన్ రివర్స్ అవుతోందని చెప్పుకుంటున్నారు. కొలికపూడి శ్రీనివాస్‌ ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తల్లో స్థానిక కేడర్ సంతోష పడినప్పటికీ ప్రస్తుతం… ఏం ఖర్మరా బాబూ… ఇది అంటూ లోలోపల మధన పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి మధ్య వివాదాల్ని సెటిల్‌ చేసేందుకు అధిష్టానం చేయిన ప్రయత్నాలు పూర్తిగా ఫలించలేదు. మరోవైపు ఎమ్మెల్యే కూడా ఎంపీ వర్గం వ్యవహారాలతో విసిగిపోయి తాను అనుకున్నదే చేస్తున్నారన్నది లోకల్‌ టాక్‌. ఇలాంటి వాతావరణంలో… టీడీపీ అధిష్టానం కూడా… కొలికపూడి, చిన్ని మధ్య సయోధ్య కుదరదన్న నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. ఇక నియోజకవర్గంలో ఏళ్ళ తరబడి పార్టీ కోసం పనిచేసిన కేడర్ ఆర్థికంగా కాస్త బలపడేందుకు ఏనైనా పనులు ఇద్దామంటే ఎవరు అడ్డుకుంటారోనన్న గందరగోళం కూడా ఉందట. ఎమ్మెల్యే వర్గానికి ఇస్తే ఎంపీ వర్గం, ఎంపీ వర్గానికి కేటాయిస్తే ఎమ్మెల్యే మనుషులు ఇబ్బంది పెడతారన్న భయాలు పెరుగుతున్నాయి.

మరోవైపు ఎమ్మెల్యే కొలికపూడి… నియోజకవర్గంలో జరిగే ప్రతి విషయంపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో ఏ పని చేయాలన్నా…. స్థానిక కేడర్ కూడా భయపడుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల వరుసగా నియోజకవర్గంలోని బార్ అండ్ రెస్టారెంట్ల గురించి ఎమ్మెల్యే పెడుతున్న పోస్ట్‌లు చర్చనీయాంశం అయ్యాయి. గతంలో కూడా ఇదేవిధంగా పేకాట, మైనింగ్, పీడీఎస్‌ బియ్యం అంటూ అన్ని విషయాలపై పెట్టిన పోస్టులు రాజకీయంగా పెద్ద దుమారం రేపాయి. దీంతో…లోకల్‌ టీడీపీ క్యాడర్ ఏ పని చేయాలన్నా ఒకటికి పది సార్లు ఆలోచిస్తోందట. ఆ గందరగోళంలోనే… గెలుపు ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నామంటూ లోలోపల మధనపడుతున్నట్టు తెలుస్తోంది. గెలిచి బాధపడుతున్న కార్యకర్తల పరిస్థితి అలా ఉంటే… ఇక విపక్షం కేడర్‌ పరిస్థితి కూడా అంతకంటే భిన్నంగా ఏం లేదట. తిరువూరు వైసీపీ కేడర్‌ కూడా పూర్తి నైరాశ్యంలో ఉందంటున్నారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత వరుసగా రెండుసార్లు ఇక్కడి నుంచి వైసీపీ గెలిచి….. గత ఎన్నికల్లో మాత్రమే ఓడిపోయింది.

వచ్చే ఎన్నికల్లో తిరిగి పట్టు దక్కించుకోవానికి, క్షేత్ర స్థాయిలో బలోపేతం కావడానికి ఇప్పుడు విస్తృత అవకాశాలున్నా, అధికార పార్టీలో ఉన్న పరిస్థితిని వాడుకునే వీలున్నా…. నాయకత్వం మాత్రం దృష్టి పెట్టడం లేదన్నది లోకల్‌ ఫ్యాన్‌ కేడర్‌ ఆవేదన. ఎమ్మెల్యేగా కొలికపూడి గెలిచినప్పటికీ టీడీపీలో నిత్యం నడుస్తున్న గ్రూప్ వార్, ఎమ్మెల్యే సొంత పార్టీకే రివర్స్‌ అవడం లాంటివి తమకు కలిసొచ్చే అంశాలైనా… వాటిని క్యాష్‌ చేసుకోవడంలో మా నాయకులు వెనుకబడుతున్నారంటూ తిరువూరు వైసీపీ కార్యకర్తల్లో అసహనం పెరుగుతోందట. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ పూర్తి స్థాయిలో అందిపుచ్చుకోలేకపోతున్నారన్న చర్చ కింది స్థాయిలో జరుగుతోంది. ఎమ్మెల్యే కొలికపూడి చేస్తున్న రచ్చ మాత్రమే టీడీపీని డ్యామేజ్‌ చేస్తోంది తప్ప…. ప్రతిపక్షంగా తామేం చేయలేకపోతున్నట్టు చెబుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ మధ్య ఉన్న వర్గపోరును అనుకూలంగా మార్చుకుని బలపడే వీలున్నా…. మా నాయకత్వం ఆ స్థాయిలో పని చేయలేకపోతోందన్నది వైసీపీ కార్యకర్తల ఆవేదన. ఈ రకంగా…. తిరువూరులో ఒకేసారి అధికార, ప్రతిపక్ష కేడర్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్న విచిత్రమైన వాతావరణం ఉంది. సాధారణంగా ఒకరి మైనస్‌ మరొకరికి ప్లస్‌ అవుతుంది. కానీ… ఇక్కడ మాత్రం రెండూ మైనస్‌లు కావడమే అసలైన విషాదం అంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌.