OTR: తిరువూరు రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే.. ఫైనల్ పంచ్ ఎవరిది?

Tiruvuru

Tiruvuru

అక్కడ టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య నడుస్తున్న కథ క్లైమాక్స్‌కి చేరబోతోందా? లాస్ట్‌ పంచ్‌ మనదే అయితే ఆ కిక్కే వేరబ్బా అనుకుంటూ… ఆ పంచ్‌ ఇచ్చే దిశగా ఎంపీ అడుగులేస్తున్నారా? ఛాన్స్‌ దొరికినప్పుడల్లా కులం కార్డ్‌ బయటికి తీస్తున్న ఎమ్మెల్యేకి అదే కార్డ్‌తో చెక్‌ పెట్టాలనుకుంటున్న ఎంపీ ఎవరు? ఆ టామ్‌ అండ్‌ జెర్రీ వార్‌లో కొత్త ట్విస్ట్‌ ఏంటి? ఎన్టీఆర్ జిల్లాలో ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్ క్లైమాక్స్‌కు చేరినట్టు కనబడుతోంది. ఎండ్‌ కార్డ్‌ వేసే దిశగా ఎంపీ అడులేస్తున్నారన్న అంచనాలు పెరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల పేరుతోనే…ఈ కార్యక్రమం జరిగిపోవచ్చని అంటున్నారు. తిరువూరు మున్సిపాలిటీతో పాటు పరిషత్‌ పోరు కూడా ముగిసిన క్రమంలో….ఎంపీ ఇప్పుడు తన వ్యూహానికి పదును పెడుతున్నారట. అసలిక్కడ ఈసారి సీట్ల కేటాయింపు నుంచి ఫలితాల వరకు ప్రతి దశలోనూ… ఎమ్మెల్యే మీద పైచేయి సాధించారు ఎంపీ. ఒక రకంగా చెప్పాలంటే తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం మీద చిన్ని పట్టు బిగించినట్టు కనిపిస్తోందని అంటున్నారు పొలిటికల్‌ పరిశీలకులు.

 

లోకల్‌ కాకపోయినా కొలికపూడిని తిరువూరు తీసుకువచ్చి కూటమి అభ్యర్థిగా లాస్ట్‌ మినిట్‌లో ఖరారు చేసింది టీడీపీ అధిష్టానం. 2024 వేవ్‌లో ఫస్ట్‌ అటెంప్ట్‌లోనే అసెంబ్లీ మెట్లు ఎక్కారు కొలికపూడి. ఎన్నికల సమయంలో ఇద్దరి సంబంధాలు బాగానే ఉన్నా… తర్వాతి నుంచి ఎంపీ చిన్నితో ఎమ్మెల్యేకి గ్యాప్ రావటం మొదలైంది. అది పెరిగి పెరిగి చివరికి సొంత పార్టీకే మింగుడు పడని వ్యవహారంగా మారిపోయింది. ప్రతి విషయంలో పరస్పరం పైచేయి కోసం ఇద్దరూ చేస్తున్న ప్రయత్నాలతో జిల్లాలో పొలిటికల్‌ హీట్‌ పెరిగిపోయింది. ఈ క్రమంలో… తాజా ఎన్నికల వ్యవహారం కూడా కొత్త చర్చకు కారణం అవుతోంది. లోకల్‌ ఎలక్షన్స్‌లోఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తన వర్గానికి టికెట్లు ఇప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తిరువూరు మున్సిపాలిటీలో మొత్తం 28 వార్డులు ఉండగా 22 చోట్ల టిడిపి అభ్యర్థులు పోటీ చేశారు. కానీ… పార్టీ బీ ఫామ్స్‌ రాకముందే కొందరు నామినేషన్లు వేశారు.

అందులో 28 మంది ఎమ్మెల్యే మనుషులే ఉన్నారు. కానీ… ఫైనల్‌గా జిల్లా పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ బీ ఫామ్స్‌ ఇచ్చిన వాళ్ళంతా ఎంపీ చిన్ని వర్గానికి చెందిన వారే. దీంతో ఎమ్మెల్యే తరపున నామినేషన్లు వేసిన వాళ్ళలో నలుగురు మినహా మిగతా అంతా ఉపసంహరించుకున్నారు. ఆ నలుగురిలో ముగ్గురు గెలిచినా వారిపై సస్పెన్షన్ వేటు పడింది. ఆ రకంగా తిరువూరు మున్సిపల్ ఎన్నికల్లో కేశినేని చిన్ని వర్గం పూర్తి స్థాయిలో సత్తా చాటింది. అటు మున్సిపల్ చైర్మన్‌గా ఎమ్మెల్యే ఒకర్ని సపోర్ట్ చేస్తూ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయించారు. అయితే జనసేనకు సీటు కేటాయించడంతో…ఆ పోస్ట్‌కు కూడా తన అభ్యర్థితో విత్‌డ్రా చేయించారు కొలికపూడి. ఇక తర్వాత జరిగిన పరిషత్‌ ఎన్నికల్లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది అనేది లోకల్ టాక్. నియోజకవర్గంలో జడ్పిటిసి స్థానాలు కూడా ఎంపీ వర్గానికే దక్కాయి. దీంతో… ఎమ్మెల్యే పూర్తిగా ఎన్నికలకు దూరంగా ఉన్నారనేది తెలుగు తమ్ముళ్ల మాట.

 

ఎన్నికలు జరుగుతున్న సమయంలో కొలికపూడి పూర్తిగా హైదరాబాద్‌కే పరిమితం అయ్యారట. అదంతా ఒక ఎత్తయితే… ఆ తర్వాతే ఎంపీ పొలిటికల్‌గా గట్టి పావు కదిపినట్టు అంచనా వేస్తున్నాయి రాజకీయవర్గాలు. ఎమ్మెల్యే కొలికపూడి తనను ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు ఒక్కోసారి… కులం కార్డు బయటకు తీస్తున్నారని, ఇప్పుడు అదే కార్డ్‌తో ఆయనకు చెక్‌ పెట్టాలని భావిస్తున్నారట. ఎన్టీఆర్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఎస్సీకి రిజర్వ్‌ అయింది. తిరువూరు నియోజకవర్గానికి చెందిన జడ్పీటీసీనే ఆ సీట్లో కూర్చోబెట్టే ప్రయత్నాల్లో ఉన్నారట ఎంపీ. దీనికి సంబంధించిన ప్లాన్‌ ముందే సిద్ధం చేసుకున్న కేశినేని.. ఓసీలకు కేటాయించిన గంపలగూడెం జడ్పీటీసీ స్థానంలో ఎస్సీ మహిళను నిలబెట్టి గెలిపించినట్టు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే సామాజికవర్గానికే చెందిన పుల్లమ్మ అనే మహిళను కమ్మ నాయకులకు ఇవ్వాల్సిన సీట్లో నిలబెట్టి గెలిపించి ఆమెనే జడ్పీ ఛైర్‌పర్సన్‌ని చేయడం ద్వారా… కొలికపూడి కులానికి తాను వ్యతిరేకం కాదని చెప్పాలనుకుంటున్నారట. ఇకపై ఎమ్మెల్యే పదేపదే కులం పేరు తీసి తనను ఇబ్బంది పెట్టకుండా ఫైనల్‌ టచ్‌ ఇవ్వాలనుకుంటున్న ఎంపీ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయోనని ఆసక్తిగా చూస్తున్నాయి జిల్లా రాజకీయవర్గాలు.