OTR : టెంపుల్ సిటీలో కుల సమీకరణాల కలకలం.. డిప్యూటీ మేయర్ ఎవరికి?

Tirupati

Tirupati

టెంపుల్‌ సిటీలో క్యాస్ట్‌ కార్డ్‌ మోత మోగిస్తోందా? డిప్యూటీ మేయర్‌ పోస్ట్‌ కోసం ఎవరికి వారు కుల బలాల లెక్కలు తీస్తూ…. మా సంగతేంటని అడుగుతున్నారా? కూటమి నేతల మధ్య పోటీలో కొత్త కొత్త లెక్కలు తెర మీదికి వస్తున్నాయా? కొందరు ఛలో అమరావతి అంటుంటే… మరి కొందరు రహస్య సమావేశాలతో పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్నారా? ఇంతకీ… తిరుపతి కార్పొరేషన్‌లో ఏం జరుగుతోంది? తిరుపతి రాజకీయాల్లో ఇప్పుడు డిప్యూటీ మేయర్ పదవి హాట్ టాపిక్‌గా మారింది. చిత్తూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎంపికలో అక్కడి నేతలు క్యాష్ కార్డ్‌ వాడేయడంతో మేటర్‌ తేలిగ్గా తెగింది. కానీ… టెంపుల్‌ సిటీలో మాత్రం క్యాష్‌కు బదులు క్యాస్ట్‌ కార్డ్‌ తెరమీదికి రావడంతో మేటర్‌ చాలా తేడాగా ఉందట. తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో మొత్తం 66 స్థానాలకు గాను 60 సీట్లు గెలుచుకుని కూటమి తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది.

 

ఇందులో టీడీపీ 38, జనసేన 19, బీజేపీ 3 స్థానాలు దక్కించుకోగా, వైసీపీ కేవలం 3 సీట్లకే పరిమితమైంది. స్వతంత్ర అభ్యర్థులు మరో మూడింటిని గెల్చుకున్నారు. అయితే ఈనెల 23న జరగనున్న డిప్యూటీ మేయర్‌ ఎన్నిక కోసం తెర వెనక రచ్చ తారాస్థాయికి చేరిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి తిరుపతి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి బాగా సెంటిమెంట్ ఉన్న ప్రాంతం. అయినప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా దీన్ని జనసేనకు కేటాయించడంతో, ఆ పార్టీ ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు భారీ మెజారిటీతో గెలిచారు. తాజాగా జరిగిన మేయర్ ఎన్నికల్లోనూ చివరి వరకు జనసేనకే మేయర్ సీటు దక్కుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా చివరి నిమిషంలో టీడీపీ దక్కించుకుంది. టీడీపీ నుంచి జేబీ శ్రీనివాస్ మేయర్‌గా బరిలోకి దిగి భారీ మెజారిటీతో విజయం సాధించారు. దీంతో.. డిప్యూటీ మేయర్ పదవి కచ్చితంగా తమకే కావాలని గ్లాస్ పార్టీ నేతలు గట్టిగా పట్టుబడుతున్నారట. 19 కార్పొరేటర్‌ సీట్లు గెలిచామని, పైగా తిరుపతి ఎమ్మెల్యే మా పార్టీ నాయకుడు కాబట్టి నగరంలో పార్టీని మరింత బలోపేతం చేసుకోవడానికి డిప్యూటీ మేయర్ పోస్టు తమకే ఇవ్వాలని జనసేన కేడర్ డిమాండ్ చేస్తోందట. ఆ పార్టీ తరఫున నగర అధ్యక్షుడు, కార్పొరేటర్ రాజా రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రజారాజ్యం పార్టీ కాలం నుంచి చిరంజీవి కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉంటూ వస్తున్న రాజా రెడ్డి, నగరంలో తమ సామాజిక వర్గం ఓట్లు గణనీయంగా ఉన్నాయని లెక్కలు చెబుతూ రెడ్డి కోటా కింద డిప్యూటీ మేయర్‌ తనకే ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు తెలిసింది. మరోవైపు ఇన్ఛార్జ్‌ కిరణ్ రాయల్ తన అనుచరుడు, ఎస్సీ వర్గానికి చెందిన మనోజ్ పేరును తెరపైకి తెస్తుండగా, మైనారిటీ కోటా నుంచి ఎస్కే బాబు కుమార్తె, మరో కార్పొరేటర్, విద్యాసంస్థల అధినేత భార్య కూడా రేసులో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇక మూడు కార్పొరేటర్ స్థానాలే గెల్చుకున్నప్పటికీ.. బీజేపీ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదట. అయితే ఆ పార్టీకి ఇప్పటికే జెడ్పీ వైస్ చైర్మన్ పదవిని ఇచ్చినందున, డిప్యూటీ మేయర్ కుదరదని అంటున్నారు. ఇలా డిప్యూటీ మేయర్‌ కోసం మూడు పార్టీల మధ్య పోటీ కూటమి పెద్దలకు కొత్త తలనొప్పి అయిందంటున్నారు. ఆ లెక్కలు అలా ఉంటే… టీడీపీలోని మరో వర్గం ఎక్కాలు ఇంకోలా ఉన్నాయట.పార్టీలతో సంబంధం లేకుండా కులం ఆధారంగా తమకే పదవి ఇవ్వాలని టీడీపీలోని ఓ బలమైన వర్గం పట్టుబడుతోంది.

తిరుపతి నగరంలో అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన బీసీ.. యాదవ సామాజికవర్గం కూటమి ఘనవిజయానికి వెన్నెముకగా నిలిచిందని, కాబట్టి డిప్యూటీ మేయర్ పదవిని తమకే కేటాయించాలన్నది ఆ వర్గం డిమాండ్‌. మేయర్ పదవి అనితా యాదవ్‌కు వస్తుందని చివరి వరకు ఆశించినా…. ఊహించని విధంగా బలిజ సామాజిక వర్గానికి చెందిన జేబీ శ్రీనివాస్‌ను వరించింది. దీంతో ఎలాగైనా డిప్యూటీ మేయర్ పదవిని తామే దక్కించుకోవాలన్న టార్గెట్‌తో యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకులంతా తిరుపతిలో రహస్య సమావేశం పెట్టుకున్నట్టు గుసగుసలాడుకుంటున్నారు. ఇలా… రెడ్డి, యాదవ, ఎస్సీ, మైనారిటీ వర్గాల నేతలు కులం కార్డుతో డిప్యూటీ మేయర్ సీటును టార్గెట్‌ చేయడం ఉత్కంఠ రేపుతోంది. దీంతో.. ఎటూ తేల్చుకోలేక ఎమ్మెల్యేలు, ఏం జరుగుతుందో తెలియక అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారట. ఆశావాహులంతా ఛలో అమరావతి అంటూ…పెద్ద సంఖ్యలో అమరావతి బాట పడుతున్నారు. వీళ్ళలో ఏ ఒక్కరిని నొప్పించినా… నగరంలో కూటమి ఐక్యత గాడితప్పే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. మూడు పార్టీల పెద్దలు దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారన్నది ఇప్పుడు ఇంట్రస్టింగ్‌ పాయింట్‌.