తిరుపతిని గ్రేటర్‌గా మార్చడంపై టీడీపీలోనే భిన్నాభిప్రాయాలున్నాయా? కొందరు సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఈ విషయంలో అసహనంగా ఉన్నారా? ఇక్కడ వైసీపీ డబుల్ గేమ్ ఆడుతోందన్నది నిజమేనా? మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఏకగ్రీవంగా జై కొట్టినా సమస్య ఎక్కడ వస్తోంది? ఎమ్మెల్యేలు ఎందుకు వ్యచిరేకిస్తున్నారు? జనం నుంచి ఉన్న అభ్యంతరాలేంటి? తిరుపతి మున్సిపాలిటీని గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్‌గా మార్చడం దాదాపుగా ఖాయమైపోయింది. ఈ మేరకు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో పెట్టిన ప్రతిపాదనకు సభ్యులంతా ఏకగ్రీవంగా జై కొట్టారు. కౌన్సిల్ ఆమోదించిన తీర్మాన ప్రతులు, విలీన ప్రతిపాదనలు ఆల్రెడీ సంబంధిత పంచాయతీల కార్యదర్శులకు చేరిపోయాయి. ఇప్పుడు అనుకుంటున్న ప్లాన్ అనుకున్నట్టు జరిగితే… డిసెంబర్ ఆఖరుకల్లా… గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ అవుతుంది. ఆ విషయంలో ప్రభుత్వం కూడా పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ విధంగా ఈ ఏడాది ఆరంభంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలు ఆఖరుకు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. కానీ… ఆ తర్వాత జరిగే మార్పులు, ఎదురయ్యే రాజకీయ సవాళ్ళ గురించి తెలుగుదేశం పార్టీలో సైతం ఆందోళన వ్యక్తం అవుతోందట. ఎక్కడ నామమాత్రంగా మిగిలిపోతామోనని కొందరు సీనియర్ నాయకులు సైతం కంగారు పడుతున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ విషయంలో వైసీపీ రెండు రకాల స్టాండ్స్ తీసుకోవడం ఇంకా ఆసక్తి రేపుతోంది.
తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట, ఏర్పేడు మండలాల పరిధిలోని 53 పంచాయతీల్లో ఉన్న 63 రెవెన్యూ గ్రామాలను గ్రేటర్ తిరుపతిలో విలీనం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అది పూర్తి స్థాయిలో వర్కౌట్ అయితే… మొత్తం తిరుపతి నగర రూపురేఖలే అనూహ్యంగా మారిపోతాయి. ఇపుడు పరిధి 30 చదరపు కిలోమీటర్లు ఉండగా… గ్రేటర్ అయ్యాక 284 చదరపు కిలోమీటర్లకు విస్తరిస్తుంది. ఇప్పుడు నాలుగున్నర లక్షలున్న జనాభా ఏడున్నర లక్షలకు, 149 కోట్లుగా ఉన్న వార్షికాదాయం 182 కోట్లకు పెరుగుతాయి. చంద్రగిరి, రేణిగుంట వంటి మేజర్ పంచాయతీలు మున్సిపల్ కార్పొరేషన్‌లో అంతర్భాగం కావడంతో పాటు విమానాశ్రయం వెలుపలున్న వికృతమాల దాకా సిటీ విస్తరిస్తుంది. చెప్పుకోవడానికి ఇదంతా బాగానే ఉన్నా… రాజకీయంగా చూసుకుంటే మాత్రం తమ ప్రాధాన్యం తగ్గిపోతుందని శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాల నాయకులు టెన్షన్ పడుతున్నారట. గ్రేటర్‌గా మారితే….. మెజార్టీ డివిజన్స్ ఉండే తిరుపతి ఎమ్మెల్యే హవానే నడుస్తుందని, మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలు నామమాత్రంగా మిగిలిపోతారన్న లెక్కలున్నాయట. అలాగే…. కార్పొరేషన్ పరిపాలనలో అధికారుల ప్రమేయం పెరిగిపోయి… ఎమ్మెల్యేల మాట చెల్లుబాటవకుండా పోతుందన్న భయాలు సైతం ఉన్నట్టు తెలుస్తోంది. అదంతా ఒక ఎత్తయితే… అభివృద్ధిపరమైన సందేహాలు సైతం ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం ఉన్న స్థితిలో తిరుపతి నగరాన్నే తీసుకుంటే… మున్సిపల్ పరిధిలో ఉన్న రోడ్లకే మరమ్మతులు చేయలేని నిస్సహాయత. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయినప్పుడు జీవకోనతో పాటు కొన్ని పంచాయితీలు కలిశాయి. 15 ఏళ్ళు గడిచినా…ఇప్పటికీ అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించలేదు.
రహదారుల అభివృద్ధి, డ్రైనేజ్‌ని మెరుగుపరచడమన్న మాటలే లేవు. పైగా… ఈ పదిహేను ఏళ్ళలో ఒక్కసారి మాత్రమే ఎన్నికలు జరిగాయి. మిగతా టైం మొత్తం అధికారుల పెత్తనమే నడిచింది. ఐఎఎస్ అధికారులైతే… డైరెక్ట్ టు సీఎం అంటారు తప్ప స్థానిక నాయకత్వానికి విలువ ఇవ్వరనే భయాలు సైతం ఉన్నాయి నాయకులకు. ఈ పరిస్థితుల్లో ఇటు ఎమ్మెల్యేలు, అటు పంచాయితీ స్థాయి నాయకులు సైతం గ్రేటర్ ప్రతిపాదనపై విముఖంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. అదే సమయంలో పన్నుల భారం పెరిగిపోతుందని, ఏవైనా అనుమతులు కావాలంటే… పెద్ద మొత్తంలో లంచాలు ఇచ్చుకోవాల్సి వస్తుందన్న భయం ఆయా గ్రామాల్లో ఉందట. గ్రామ పంచాయితీ, తుడా పరిధిలో అయితే… ఎమ్మెల్యే ఒక మాట చెబితే పనవుతుందని, అదే గ్రేటర్‌లో అయితే…టౌన్ ప్లానింగ్ అధికారుల హవా పెరగడంతోపాటు వాళ్ళ అవినీతి కూడా హద్దులు దాటుతుందన్న అభిప్రాయం ఉందట. అది నిజమేనా అన్నట్టు తిరుపతిలో తాజాగా ఇంటి నిర్మాణానికి ఖచ్చితంగా పన్నులతో పాటు లంచం కూడా చెల్లించాల్సి వస్తోందన్న అంశంపై పెద్ద గొడవే జరిగింది. అధికారం మారినా అధికారులు మాత్రం మారబోరని, ఇలాంటి సమయంలో గ్రేటర్ పేరుతో రోట్లో తలపెట్టడానికి సిద్ధంగా లేమన్నది జనం మాటగా తెలుస్తోంది. గ్రేటర్ విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని, లేదంటే… పార్టీలకతీతంగా అందోళనలకు సిద్ధమని హెచ్చరిస్తున్నారు పంచాయితీ స్థాయి నాయకులు.దానికి లోకల్ ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇక్కడే ప్రతిపక్ష వైసీపీ గురించి కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఆ పార్టీ డబుల్ గేమ్ ఆడుతోందన్న విమర్శలు పెరుగుతున్నాయి. గ్రేటర్ తిరుపతి తీర్మానానికి అనుకూలంగా నగర పాలక సంస్థలో మద్దతిచ్చిన వైసీపీ… చంద్రగిరి, తిరుపతి రూరల్ మండలాల సర్వసభ్య సమావేశాల్లో మాత్రం వ్యతిరేక తీర్మానాలు చేసింది. దీంతో ఈ అంశంతో ప్రతిపక్షం పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేసిందా అన్న చర్చలు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో జీటీఎంసీ భవిష్యత్ చిత్రం ఎలా ఉంటుందోనని ఆసక్తిగా చూస్తున్నారు అంతా.
