టెంపుల్ సిటీలో సీటు పోరు ముదురుతోందా? తిరుపతి మేయర్ పీఠం కూటమిలో విభేదాలకు కారణం అవుతోందా? మాక్కావాలంటే మాకేనంటూ టీడీపీ, జనసేన నేతలు పోటాపోటీగా పావులు కదుపుతున్నారా? అందుకు జనసేన చెబుతున్న లెక్కలేంటి? టీడీపీ చేస్తున్న వాదనేంటి? తిరుపతి పీఠం కోసం రెండు పార్టీలు ఎందుకంత పట్టుదలగా ఉన్నాయి? టెంపుల్ సిటీ తిరుపతి ఆధ్యాత్మిక శోభ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ…. పాలిటిక్స్ విషయానికి వస్తే మాత్రం… ఇక్కడ ఎప్పుడూ ఒక రేంజ్ హీట్ ఉంటుంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆ సెగలు సుడులు తిరుగుతున్నాయట. గత అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యే సీటును కూటమి కలిసికట్టుగా కొట్టింది. జనసేన తరపున బరిలోకి దిగిన ఆరణి శ్రీనివాసులు భారీ మెజారిటీతో అసెంబ్లీలో అడుగుపెట్టారు. అంతవరకు బాగానే ఉంది. కానీ… అసలు సినిమా ఆ తర్వాతే మొదలైంది. తిరుపతికి రాజకీయంగా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. సెంటిమెంట్ కూడా. అందుకే… ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు పెద్ద పెద్ద నాయకులు సైతం ఆసక్తి చూపుతుంటారు. ఇక త్వరలోనే…స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగబోతోంది. ముందుగా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. దీంతో ప్రతిష్ఠాత్మక తిరుపతి కార్పొరేషన్ ఛైర్మన్ సీటు కూటమిలోని ఏ పార్టీకి దక్కుతుంది అన్నది ఇప్పుడు రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. జనసేన నుంచి ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి…..మేయర్ సీటు మాదేనని లెక్కలు వేసుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఆశావహులు అమరావతికి క్యూ కట్టేస్తున్నారు కూడా. మేయర్ అభ్యర్థిగా తమ పేరు పరిశీలించాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారు. కానీ… ఇక్కడే పీటముడి కూడా బిగుసుకుంటోంది. మేయర్ టిక్కెట్ మాక్కావాలంటే మాకేనంటూ టీటీడీ వాళ్ళే గింజులాడుతుంటే… మరి మా సంగతేంటని అడుగుతున్నారట జనసైనికులు. తిరుపతి ఎమ్మెల్యేగా మా పార్టీ నుంచి ప్రాతినిధ్యం ఉన్న మాట వాస్తవమేగానీ…. ఆ ఒక్కటి తప్ప… మిగతా పదవులన్నీ మీ చేతిలోనే ఉన్నాయి కదా…? ఆ సంగతేంటని టీడీపీని అడుగుతున్నారట.
ఎమ్మెల్యేని మినహాయిస్తే.. టీటీడీ చైర్మన్, ఏపీ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్, ఎస్వీబీసీ చైర్మన్, తుడా చైర్మన్, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, గంగమ్మ ఆలయ చైర్మన్, శాప్ చైర్మన్… ఇలా ఒకటేమిటి ఏది చూసుకున్నా… అన్నీ మీ కోటాలోనే ఉన్నాయి కదా… అందుకే తిరుపతి మేయర్ సీటును మేం వదులుకునే ప్రసక్తే లేదని అంటున్నట్టు తెలుస్తోంది. అయితే… అదే సమయంలో అసలు తిరుపతిపై జనసేనకు ఉన్న పట్టు ఎంతన్న చర్చ సైతం తెర మీదికి వస్తోంది. ఇటు తిరుపతి కార్పొరేషన్‌లో గానీ.. అటు టీటీడీలో గానీ ఎమ్మెల్యేకు పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వడం లేదట. ఎమ్మెల్యే ఒక్కరే జనసేన కావడం.. మిగిలిన కీలకమైన పదవుల్లో టీడీపీ నేతలే ఉండటమే అందుకు కారణం అంటున్నారు. ఈ లెక్కలన్నీ వేసుకునే… తిరుపతి మేయర్ పీఠాన్ని వదులుకోవడానికి జనసేన సిద్ధంగా లేదని అంటున్నారు. పైపెచ్చు రాయలసీమ ప్రాంతంలో ప్రాధాన్యత కలిగిన మరో కార్పొరేషన్‌ను జనసేనకు కేటాయించే అవకాశాలు కూడా కనిపించడం లేదు. అందుకే… మేయర్ సీటు వదులుకోవడానికి జనసేన ససేమిరా అంటున్నట్టు సమాచారం. మరోవైపు రాయలసీమ ప్రాంతంలో బలిజలకు న్యాయం జరగడం లేదని.. ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారని.. జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరపాలని కూడా ఆ సామాజికవర్గం నేతలు డిమాండ్ చేస్తున్నారు. కూటమి అధినేతల మధ్య జరిగిన అంతర్గత చర్చల్లో కూడా ఈ అంశాలు తెరపైకి రావడంతో.. జనసేనకు తిరుపతి మేయర్ సీటు కోసం గట్టిగా అడుగుతున్నారట. మరోవైపు బీజేపీ నేతలు కూడా కేంద్ర పెద్దల నుంచి సిఫార్సు చేయించుకుని తిరుపతి మేయర్ సీటు కావాలని పట్టుబట్టే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. మొత్తంగా ఆధ్యాత్మిక క్షేత్రంగా ఉన్న ప్రాధాన్యత.. ఇప్పుడు రాజకీయంగా కూడా కొనసాగుతోంది. ఫైనల్‌గా లెక్కలు ఎవరికి అనుకూలిస్తాయో చూడాలి.

