గ్రామీణం కాదు…పట్టణమే తమ బలమని కమలం పార్టీ భావిస్తోంది. నగరాల్లో తమ క్రేజ్ వేరే లెవల్ అని ప్రతీసారి కాన్ఫిడెన్స్‌గా చెబుతోంది. ఇప్పుడు తెలంగాణలో అదే మాట…బీజేపీకి అగ్ని పరీక్షగా మారింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకి నగారా మోగనుంది. 117 మున్సిపాలిటీలకు, 6 మున్సిపల్ కార్పొరేషన్ లకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ర్ట ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టింది. పార్టీలు కూడా అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. రాజకీయ పార్టీల గుర్తుల మీద ఈ ఎన్నికలు జరుగుతాయి. పురపాలికల్లో ఏ పార్టీ పొజిషన్ ఏంటో స్పష్టమవుతుంది. ఆయా పార్టీలకు ఈ ఎన్నికలు ఒక ఛాలెంజ్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కమలం పార్టీకి కూడా ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమే. ఆ పార్టీకి పట్టణ పార్టీ అనే పేరు ఉంది. సర్పంచ్ ఎన్నికలతో గ్రామాల్లోకి కూడా వెళ్లామని చెప్పుకుంటున్న ఆ పార్టీ…తనకున్న పేరును నిలుపుకోవాలంటే ఈ ఎన్నికల్లో సత్తా చాటాల్సిన పరిస్థితి. పార్టీ తన ఉనికిని చాటు కోవాలంటే మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లను గెలుచుకోవాలి అనే మాట వినిపిస్తోంది.
బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు రాంచందర్ రావుకు ఈ ఎన్నికల్లో నంబర్ వన్ గా నిలవాలని టార్గెట్ గా పెట్టుకున్నామంటున్నారు. ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో సుమారు 45 మున్సిపాల్టీలు, పలు మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత పార్టీ ప్రజా ప్రతినిధులదేననే టాక్ పార్టీలో వినబడుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలను పెద్దగా పట్టించుకోని కమలం పార్టీ పురపాలక ఎన్నికలను మాత్రం సీరియస్‌గా తీసుకున్నామంటోంది. అర్థ, అంగ బలంతో రంగంలోకి దిగుతామంటోంది. గెలిచే వారికే టికెట్లు అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ నిజామాబాద్, కరీం నగర్ కార్పొరేషన్ లలో ప్రభావం చూపింది. చెప్పుకోదగ్గ డివిజన్లను కైవసం చేసుకుంది. మున్సిపాలిటీల్లో మాత్రం పెద్దగా గెలిచింది లేదు. అయితే ఇప్పుడు మాత్రం ఆ పార్టీ రాష్ట్రస్థాయిలో సమన్వయ కమిటిని ఏర్పాటు చేసింది. మున్సిపాల్టీలవారిగా అభ్యర్థుల ఎంపిక, సమన్వయం కోసం టీమ్‌లను ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్‌కు తామే ప్రత్యామ్నాయం అంటున్న కమలనాథులకు ఈ ఎన్నికలు మాత్రం పరీక్షే.
