OTR : తెలంగాణలో ఫెవికాల్ బ్యాచ్! మాజీలు అయినా కుర్చీలు వదలరా?

Congres

Congres

తెలంగాణలో ఫెవికాల్‌ బ్యాచ్‌ తయారైందా? పదవీ కాలం ముగిసిపోయినా… కుర్చీలకు అంటుకుని పోయి… దిగడానికి ససేమిరా అంటోందా? వాళ్ళకు ఇప్పుడు జనం సొమ్ము అంటే… మంచినీళ్ళ ప్రాయంగా కనిపిస్తోందా? మాజీలు అయ్యాక కూడా… అనుభవించు రాజా…. అంటూ విచ్చలవిడిగా ప్రజా ధనంతో జల్సాలు చేస్తున్నారా? ఏదా ఎక్స్‌ట్రా బ్యాచ్‌? ఏంటా ఫెవికాల్‌ స్టోరీ? తాము మాజీలైపోయినా సరే… తాజాలమన్నట్టే వ్యవహరిస్తున్నారట తెలంగాణలోని కొన్ని కార్పొరేషన్స్‌ ఛైర్మన్లు. పదవీ కాలం ముగిసి పోయినా….ఆయా కార్పొరేషన్స్‌లో పట్టు తగ్గకుండా పెత్తనాల కోసం ప్రయత్నిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. కొందరు నేతలు అజమాయిషీ చెలాయిస్తున్నారన్నది ఇప్పుడు కొన్ని కార్పొరేషన్స్‌లో జరుగుతున్న చర్చ. అయితే… వాళ్ళు పదవిలో ఉన్నప్పుడే అంతంత మాత్రంగా స్పందించిన అధికారులు ఇప్పుడసలు లెక్క చేస్తారా అన్న ప్రశ్నలు సైతం ఉన్నాయి. పదవీకాలం ముగిశాక కూడా పెత్తనం చెలాయించడం అంత తేలికా అన్న సందేహాలు ఒకవైపు ఉన్నాసరే… కొంత మంది కార్పొరేషన్ మాజీ చైర్మన్స్‌ మాత్రం కుర్చీలకు ఫెవికాల్‌ పూసుకుని మరీ…అతుక్కుపోతున్నారని, అదేదో పర్మినెంట్‌ అన్నట్టు సీటు వదలడానికి అస్సలు ఇష్టపడటం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఐతే…తమకు రెన్యువల్ ఖాయం అనుకునే వాళ్లే… ఇలా సీటు కోసం పోటీ పడుతున్నారన్నది ఇంకో వెర్షన్‌.

ఇదే అంశంపై ఓ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మాత్రం… పదవిలో ఉండగానే మంత్రులు పట్టించుకోలేదు, అధికారులు చెప్పింది చేయలేదు. ఇప్పుడిక కుర్చీ లేనప్పుడు ఏం వింటారులే అంటూ నిష్టూరంగా చర్చ పెట్టినా… ఆ వాసనలు వదులుకోవడానికి మాత్రం ఇష్టపడలేదట. ఇక తాజాగా… జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడలకు ప్రభుత్వం తరపున మంత్రి వాకిటి శ్రీహరితో పాటు శాట్‌ మాజీ చైర్మన్ శివసేనా రెడ్డి కూడా వెళ్ళారు. దీని గురించే ఇప్పుడు రచ్చ అవుతోంది. మాజీ అయ్యాక కూడా… ఆయన అధికారిక పర్యటనకు వెళ్లడం ఏంటన్న చర్చ జరుగుతోంది. ఐతే ప్రభుత్వమే అధికారికంగా ఒక టీంను ఎంపిక చేసింది కాబట్టి…. ఆయన వెళ్లినట్టు చెబుతోంది బృందం. శాట్‌ మాజీ చైర్మన్ గా… ప్రభుత్వం ప్రతినిధి బృందంలో శివసేనా రెడ్డిని చేర్చారని.. అందుకే విదేశీ పర్యటనకు వెళ్ళారన్నది అట్నుంచి వినిపిస్తున్న వివరణ. ఆయన అధికారిక ఛాంబర్‌లోకి వెళ్లడం లేదని, ప్రభుత్వం ఎంపిక చేసిన కమిటీలో సభ్యుడిగా జపాన్ వెళ్లినట్టు చెప్తున్నారు ఆ శాఖ అధికారులు. ఆయన సంగతి అలా ఉంచితే… కొంత మంది కార్పొరేషన్ మాజీ ఛైర్మన్స్‌ మాత్రం తామింకా ఆ పోస్ట్‌లోనే ఉన్నట్టు ఫీలైపోతూ… పెత్తనం చెలాయిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇదంతా చూస్తున్న కొందరు మాత్రం… ఎంతైనా అధికారం కదా…! ఆ టేస్ట్ తెలిశాక.. వదలటం అంత ఈజీ కాదులే అంటూ చమత్కరిస్తున్నారు. అయితే… అనుభవిస్తున్నది ప్రజా ధనం అన్నది సంగతి గుర్తుంచుకోవాలంటూ చురలకలంటిస్తున్నారు.