OTR : తెలంగాణ మంత్రుల శాఖల మార్పు పై చర్చలు

Tg

Tg

మా సార్ శాఖ ఉంటుందా..? కొత్త డిపార్ట్‌మెంట్‌ వస్తుందా..? ఇప్పుడున్న చోటే ఆయన ఏం పని చేయలేదు.. ఇంకేం శాఖ వస్తుందో…? ఆయన ఏం ఒరగబెడతారో…! మంత్రికి గ్రిప్ వచ్చే సరికే పుణ్యకాలం పూర్తవుతుందేమో…..ప్రస్తుతం అక్కడ ఇలాంటి రకరకాల ఆసక్తికరమైన చర్చలు చాలా జరుగుతున్నాయట. మంత్రుల అనుచరులు ఎక్కడికక్కడ కూపీలు లాగుతున్నారట. ఎక్కడ నడుస్తోందా ఎపిలోడ్‌? ఎవరి మధ్య అలాంటి చర్చలు నడుస్తున్నాయి? తెలంగాణలో కేబినెట్‌ విస్తరణ ఉంటుందని, చాలామంది మంత్రుల శాఖల్లో మార్పులు ఉంటాయన్న చర్చలు జోరుగా జరుగుతున్నాయి. సాధారణంగా… పొలిటికల్ డిస్కషన్స్‌ పీక్స్‌కు చేరాయంటే… దాని మూలాలు ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో ఉండే ఉంటాయన్నది విస్తృతాభిప్రాయం. ఆ కోణంలోనే…. ఇప్పుడు మంత్రుల శాఖ మార్పుల గురించి కూడా మాట్లాడుకుంటూ నిప్పు లేనిదే పొగ రాదుకదా అంటున్నారు చాలా మంది. మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చాలా రోజులుగా చెబుతున్నారు. ఆ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈలోపే… విస్తరణకంటే ఎక్కువగా… ఇప్పుడున్న మంత్రుల శాఖల మార్పుల గురించే చర్చలు మొదలవడం ఆసక్తిరంగా మారింది. అందులోనూ… మా నాయకుడికి ఏ శాఖ ఇస్తారంటూ… కొందరు మినిస్టర్స్‌ అనుచరులు ఆరాలు తీయడం ఆసక్తికరంగా మారింది. కేబినెట్ విస్తరణ అంటూ జరిగితే…. కీలకమైన మంత్రుల శాఖలు మారుతున్నాయని ఇప్పటికే విస్తృతంగా ప్రచారం జరిగింది.

అయితే ఇప్పుడు కొత్తగా… ఆ శాఖ మారితే మా సార్‌కి ఏం శాఖ వస్తుంది..? ఇప్పుడైతే అందరూ పట్టించుకుంటున్నారు. ఇది పోయిందంటే.. ఇక అంతే సంగతి అనే అనుచరులు సైతం లేకపోలేదు. కొందరు మంత్రుల దగ్గర రెండుకు పైగా కీలకమైన శాఖలు ఉన్నాయి. దీంతో సదరు మినిస్టర్స్‌ డిపార్ట్‌మెంట్స్‌ మారతాయేమోనన్నది వాళ్ళ అనుచరుల టెన్షన్‌. ప్రస్తుతం మంత్రుల ఛాంబర్స్‌కు వచ్చే నాయకులు, రాజకీయాలు తెలిసిన వాళ్ళ మధ్య ఇవే డిస్కషన్స్‌ నడుస్తున్నాయి. ఈ విషయమై మంత్రుల అనుచరుల్లోనే కాదు, అధికారుల్లో కూడా ఆసక్తి రేగుతోందట. ఈ మంత్రి నుంచి మన డిపార్ట్‌మెంట్‌ను తప్పిస్తే… కొత్తగా ఎవరికి వచ్చే ఛాన్స్‌ ఉంది, ఆయన ఎలాంటి వారు అంటూ అధికార వర్గాలు కూడా సమాచారం సేకరిస్తున్నాయట. మరోవైపు పేచీలు పెట్టే నాయకుల నుండి రిలాక్స్ అవుదామనుకునే వాళ్ళు సైతం ఉన్నారట. నాయకుల అనుచరులతో పాటు అధికార యంత్రాంగం లో కూడా ఇలాంటి చర్చ జోరుగా నడుస్తున్నాయి. మరో వైపు సీఎం రేవంత్ దగ్గర కూడా అత్యంత కీలకమైన శాఖలు ఉన్నాయి. వాటిని ఎవరికి కేటాయిస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో అసెంబ్లీ స్పీకర్ కంటిన్యూ అవుతారా? లేక ఆయన్ని కేబినెట్‌లోకి తీసుకుంటారా అన్న ప్రశ్నలు సైతం ఉన్నాయి. ఇలా రకరకాల చర్చలతో పార్టీ నాయకుల్లో అటెన్షన్ పెరిగింది. మా నాయకుడికి ఇప్పుడున్న శాఖ ఉంటుందా..? మారుతుందా అన్న డిస్కషన్ మాత్రం ప్రతి చోటా నడుస్తోంది.

×
×
Ad