OTR : కాంగ్రెస్‌ నేతల పొలాల్లో మొలకలు వస్తున్నాయా?

Congress

Congress

కాంగ్రెస్‌ నేతల పొలాల్లో మొలకలు వస్తున్నాయా? ఎల్‌నినో ఎఫెక్ట్‌తో… తొలకరి దోబూచులాడినట్టే ఇన్నాళ్లు ఊరించి ఊరించి ఉడికించిన పదవులు వరించబోతున్నాయా? తెలంగాణ ప్రభుత్వంలో నామినేటెడ్‌, పార్టీ పరంగా వివిధ పదవుల భర్తీకి హైకమాండ్‌ పచ్చజెండా ఊపేసిందా? మరైతే… వాటిని ఎప్పుడు భర్తీ చేయబోతున్నారు? లిస్ట్‌లో ఏమేం ఉన్నాయి? తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు చాలా రోజులుగా పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. పార్టీలోని కీలకమైన పోస్ట్‌ల భర్తీ వ్యవహారం…. జీడిపాకం టీవీ సీరియల్‌ క్లైమాక్స్‌లా ఎప్పటికప్పుడు సాగుతూనే ఉంది. వాయిదాలు వేస్తూనే ఉన్నారు. అయితే… తాజాగా కీలకలమైన కోర్ కమిటీ సమావేశం హస్తినలో జరగడంతో తిరిగి ఆశలకు రెక్కలు వచ్చాయి. చాలామంది నేతలు అటెన్షన్‌ మోడ్‌లోకి వచ్చేశారు. ఇక పదవుల భర్తీ ఖాయమన్న ధీమా సైతం వచ్చేసిందట మెజార్టీ నేతలకు. అందుకు తగ్గట్టే కోర్ కమిటీ మీటింగ్‌లో పదవుల భర్తీ అంశం ప్రస్తావనకు వచ్చిందట. నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్ ఛైర్మన్లు, పార్టీ పరమైన పదవులు…. ఇలా అన్నిటినీ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ముగిసిన వెంటనే భర్తీ చేయాలని డిసైడ్ అయినట్టు తెలిసింది. ఎస్‌ఐఆర్‌లో నాయకుల పనితీరును బేరీజు వేసుకున్నాకే పదవులని పార్టీ అధినాయకత్వం ఇప్పటికే ప్రకటించిన క్రమంలో కోర్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కార్పొరేషన్ చైర్మన్స్‌తో పాటు.. ఇతర నామినేటెడ్ పోస్టుల భర్తీ లిస్ట్‌లు ఇప్పటికే సిద్ధం అయినట్టు తెలుస్తోంది. ఇక త్వరలోనే వీటికి ఫైనల్‌ క్లియరెన్స్ రాబోతోంది. అలాగే…. పార్టీలో కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల భర్తీకి కూడా పచ్చజెండా ఊపబోతున్నట్టు తెలిసింది. పీసీసీలో మొత్తం నాలుగు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల్ని భర్తీ చేస్తారని తెలుస్తోంది.

అందులో కూడా సామాజిక సమతూకాన్ని పాటించబోతున్నారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పోస్టుల్లో కులాల లెక్కలకు సంబంధించి ఇప్పటికే కొంత చర్చ జరిగింది. దాదాపుగా క్లారిటీ వచ్చినా…. ఒక నాయకుడి పేరు కోసం ఇన్నాళ్ళు ప్రక్రియ ఆగుతూ వచ్చింది. ప్రస్తుతం పీసీసీ చీఫ్‌ మహేష్‌గౌడ్‌ బీసీ. దాంతో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులను sc..st, మైనార్టీ… రెడ్డి సామాజిక వర్గాలకు కేటాయించాలనుకుంటున్నట్టు సమాచారం. అయితే రెడ్ల నుంచి ఇద్దరు నాయకులు పోటీ పడుతున్నారు. ఇందులో ఒకరు వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లా నేత పేరు పరిశీలనలో ఉందట. ఎస్టీ కోటాలో కూడా ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. వాటన్నిటి విషయంలో పిక్చర్‌ క్లియర్‌గా ఉన్నా… మైనార్టీ మేటర్‌లోనే పీటముడి పడిందని అంటున్నారు. గతంలో ప్రతిపాదించిన పేరు విషయంలో ఇన్ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్ అభ్యంతరం వ్యక్తం చేశారట. ఆ తర్వాత రకరకాల చర్చలు జరిగాయి. అయితే… ఇప్పుడు దాదాపుగా అభ్యంతరాలన్నీ కొలిక్కి వచ్చినట్టేనని, పదవుల భర్తీకి హైకమాండ్‌ దాదాపుగా గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చేసినట్టేనని చెబుతున్నాయి కాంగ్రెస్‌ వర్గాలు. ఢిల్లీ నుంచి వచ్చాక పార్టీ కీలక నేతలు హైదరాబాద్‌లో మరోసారి భేటీ అయ్యాక వీటికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.