Site icon NTV Telugu

Off The Record : కాంగ్రెస్ మారిందా? లేక రేవంత్కు గ్రిప్ పెరిగిందా?

Telangana Congress

Telangana Congress

తెలంగాణ కాంగ్రెస్‌ మారిపోయిందా? నాయకుల్లో పరిణితి పెరిగిపోయిందా? చిన్న ఛాన్స్‌ దొరికితే చాలు చెలరేగిపోయి అవతలోళ్ళని ఆడేసుకుందామని ఆరాటపడే నాయకుల్లో కూడా మార్పు వచ్చిందా? ఇంతకీ ఈ పరిణితి చర్చలు ఇప్పుడెందుకు కొత్తగా జరుగుతున్నాయి? ఏ విషయంలో మార్పు కనిపిస్తోంది? తెలంగాణ కాంగ్రెస్‌లో మార్పు మొదలైనట్టు కనిపిస్తోంది. సందర్భం దొరికితే చాలు…. తమకు అనుకూలంగా వాడేయడం కాంగ్రెస్‌ పార్టీలో కామన్‌. కానీ… ఇప్పుడు మాత్రం వాతావరణం దానికి భిన్నంగా నడుస్తోందట. నాయకులంతా మారిపోయారా లేదంటే పార్టీ డీఎన్‌ఏలోనే మార్పు వచ్చిందా అనే చర్చ మొదలైంది. సహజ ధోరణికి భిన్నంగా పరిస్థితులు ఉండడం మంచిదే అయినా…. ఈ పరిస్థితిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే… సీఎం రేవంత్‌రెడ్డి స్టేట్‌మెంట్‌ ఆధారంగా ఇటీవల మునుగోడు mla కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. x లో పోస్ట్ పెట్టారు. పదేళ్లు నేనే సీఎం అని ప్రకటించుకోవడాన్ని.. నికార్సైన పార్టీ కార్యకర్తలు ఒప్పుకోరంటూ ట్వీట్ చేశారాయన.మామూలుగా అయితే… ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తుంటారు కాంగ్రెస్‌ పార్టీలో చాలా మంది. ఆ లెక్కన చూసుకుంటే…. పార్టీ నాయకులు, సీఎం వ్యతిరేక శిబిరం నుండి పెద్ద ఎత్తున విమర్శల దాడి మొదలయ్యేది.

రాజగోపాల్‌రెడ్డి స్టేట్‌మెంట్‌కు అనుకూలంగా, వ్యతిరేకంగా దుమ్ము దులిపేవాళ్ళు కాంగ్రెస్‌ లీడర్స్‌. అధికార పీఠం మీద కూర్చున్న నేతలు ఎక్కడ దొరుకుతారా అని కాచుక్కూర్చునే బ్యాచ్‌ ఎప్పుడూ ఉంటుంది కాంగ్రెస్‌లో. అలాంటి వాళ్లంతా నేరుగా మీడియాలోనే మాట్లాడే వారు. కానీ…ఈసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్వీట్ తర్వాత పార్టీలో నాయకులు ఎవరు పెద్దగా రియాక్ట్ కాలేదు. అసలా ఎక్స్‌ మెసేజ్‌ మీద పార్టీలో పెద్దగా చర్చ కూడా జరగలేదు. ఎవరికి వాళ్ళు అంతర్గతంగా మాట్లాడుకున్నా… బయటపడి ఎక్కడా మాట్లాడలేదు. ఇది గతానికి భిన్నమైన పరిస్థితి. ప్రస్తుతం సీఎం రేవంత్‌కి వ్యతిరేకంగా ఎవరు నోరు విప్పలేదు. అదిపోను… మల్లు రవి.. సంపత్ లాంటి నాయకులు రేవంత్ వ్యాఖ్యలను సమర్ధించారు కూడా. ప్రజల అభిప్రాయమే రేవంత్ చెప్పారన్నది వాళ్ళ వెర్షన్‌. కాంగ్రెస్ సహజ వైఖరికి భిన్నంగా పరిస్థితులు ఉండటంతో కార్యకర్తలు ఊపిరిపీల్చుకున్నారు. రాజగోపాల్ రెడ్డి ట్వీట్ తర్వాత నాయకులు ఎవరైనా స్పందిస్తారేమోనని… అది ప్రతిపక్ష పార్టీకి అస్త్రంగా మారుతుందేమోనన్న చర్చ జరిగింది.

కానీ కాంగ్రెస్ లో గతంలో పరిస్థితి కనిపించలేదు. రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ పార్టీలో ఒకరిద్దరు సీనియర్ నేతల అభిప్రాయాలకు అనుగుణంగా ఉండొచ్చు గానీ… వాళ్ళు కూడా ఎక్కడా రియాక్ట్ కాలేదు. పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దగ్గర పడుతున్న క్రమంలో.. నాయకులు కొంత అసంతృప్తి సహజంగానే ఉంటుంది. కానీ… అలాంటి వాళ్ళు కూడా ఎక్కడా బయటపడకుండా గప్ చుప్ గా ఉండిపోయారు. వ్యవహారం అంతా చూస్తుంటే కాంగ్రెస్ నేతల్లో చాలా పరిణతి వచ్చినట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఐతే… బయటపడ్డది రాజగోపాల్ ఒక్కడే అయినా…కామ్‌గా ఢిల్లీకి లెటర్స్‌ పెట్టే నేతలు కూడా లేకపోలేదు. కానీ అది బహిర్గతం కాకుండా ఉండటం..ముఖ్యమంత్రికి కలిసి వచ్చే అంశం. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాయకుల పై యాక్షన్, రియాక్షన్ వచ్చేది. కానీ ఇప్పుడు పార్టీ జాతీయ నాయకత్వం, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌ కూడా ఎవరు బయట మాట్లాడొద్దని పదేపదే చెప్తూ వచ్చారు కాబట్టి… నేతల్లో మార్పు వచ్చిందా అని కూడా మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా… కాంగ్రెస్ మారిందా..? లేక అధిష్టానం దగ్గర సీఎం రేవంత్ ఇమేజ్ పెంచుకున్నారా..? అన్న ప్రశ్నలకు సమాధానం వెదుకుతున్నారు రాజకీయ పరిశీలకులు.

Exit mobile version