ఇక్కడ ఉండేది ఎవరు.. అక్కడికి పోయేది ఎవరు..! ప్రక్షాళనకు సిద్ధమవుతున్న తరుణంలో…కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన ఎలా ఉంది? తెలంగాణ నుంచి ఏఐసీసీలో ఎవరెవరికి చోటు దక్కే అవకాశం ఉంది? ఒకరిద్దరు మంత్రుల్ని కూడా పార్టీ హెడ్క్వార్టర్స్‌కు పంపుతారన్నది నిజమేనా? అసలు మార్పుల విషయమై కాంగ్రెస్ వర్గాల అంచనాలు ఎలా ఉన్నాయి? దేశ వ్యాప్తంగా పార్టీ ప్రక్షాళనకు డిసైడ్ అయ్యింది కాంగ్రెస్ అధిష్టానం. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నాయకుల సేవలు ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఈ ప్రక్రియ గురించి ప్రస్తుతం పార్టీ వర్గాల్లో రకరకాల ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి. ఆలిండియా కాంగ్రెస్ కమిటీలో భారీ మార్పులు ఉంటాయన్న సంకేతాల నడుమ తెలంగాణ నాయకుల స్థానం ఎక్కడన్న ఆరాలు మొదలయ్యాయి. రాష్ట్రం నుంచి ఏఐసీసీలో ఎవరికి చోటు దక్కుతుంది..? ఇక్కడి సీనియర్ నాయకుల సేవల్ని అక్కడ వాడుకోవాలని భావిస్తోందా..!? ఇంతకీ… తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఎవరు ఏఐసీసీలోకి వెళ్ళబోతున్నారనే చర్చలు పార్టీ వర్గాల్లో జోరుగా జరుగుతున్నాయి. సాధారణంగా ఏఐసీసీ పోస్టుల భర్తీ విషయంలో అన్ని రాష్ట్రాలకు వాటా దక్కుతుంది. అవసరం, అవకాశాన్ని బట్టి ప్రాధాన్యతలు మాత్రమే మారుతుంటాయి. తెలంగాణ నుంచి చాలామంది నాయకులు ప్రస్తుతం ఏఐసీసీ కార్యదర్శులుగా బాధ్యతల్లో ఉన్నారు.
మంత్రి శ్రీధర్ బాబు, మధుయాష్కీ.. చిన్నారెడ్డి..వంశీ…సంపత్ లాంటి వాళ్ళు ఆ పదవుల్లో ఇంకా కొనసాగుతున్నారు. ఈసారి ఏఐసీసీలో అధికార ప్రతినిధులు.. మరి కొన్ని పదవుల్లో కూడా తెలంగాణకి ప్రాధాన్యత దక్కే అవకాశం లేకపోలేదు. అయితే…దానికి అనుబంధంగా మరో ఆసక్తికరమైన చర్చ కూడా జరుగుతోంది. రాష్ట్రంలో క్యాబినెట్ విస్తరణ గనుక జరిగితే ఒకరిద్దరు మంత్రులను తప్పిస్తారన్న ప్రచారం ఉంది. అందులోనూ…. కీలకంగా ఉండే వాళ్లనే బయటికి పంపుతారన్న ప్రచారంతో… ఒకవేళ అదే జరిగితే వాళ్లని ఎలా సంతృప్తి పరుస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయి. కేబినెట్ నుండి తప్పించే పరిస్థితే ఉంటే… సదరు నేతల్ని ఏఐసీసీలోకి తీసుకుని పొరుగు రాష్ట్రాలకు పార్టీ ఇన్ఛార్జ్‌లుగా పంపవచ్చని తెలుస్తోంది. పార్టీలో కీలకంగా… క్రియాశీలకంగా పని చేసిన వాళ్ళేగనక ఆ లిస్ట్‌లో ఉంటే… ఏఐసీసీలోకి తీసుకోవాలన్న ఆలోచన కూడా జరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. మంత్రులను పక్కనబెడితే… పార్టీ కోసం పని చేస్తున్న వారిలో మరికొందరిని అధిష్టానం హెడ్ క్వార్టర్స్‌లోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఎఐసిసిలో ఉన్న వాళ్లను కంటిన్యూ చేస్తారా..? లేదంటే కొత్త వారిని కూడా తీసుకుంటారా అనేది … వారంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

