వాయిదా పద్ధతుంది దేనికైనా అంటూ… తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు ఫిక్స్ అయిపోయారా? అందుకే ఎప్పటికప్పుడు నామినేటెడ్ పదవుల భర్తీని వాయిదా వేస్తున్నారా? అదిగో, ఇదిగో అనుడే తప్ప పదవుల భర్తీ ఎన్నడు? ఆ విషయమై పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కోసం గట్టిగా పనిచేసిన కీలక నాయకులకు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కని వారికి రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్ట్‌లు ఇవ్వాలని ఎప్పుడో నిర్ణయించింది పార్టీ నాయకత్వం. అందులో భాగంగా మొదటి విడతలో 35 మందికి పదవులు దక్కాయి. పార్టీ అనుబంధ సంఘాలు, కీలక నేతలకు అవకాశం ఇచ్చారు. కానీ… ఆ తర్వాతే బ్రేకులు పడ్డాయి. మిగిలిన వారికి కూడా పదవులు వస్తాయంటూ ఊరించి ఊరించి ఉసూరుమనిపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ముగ్గురు ఇన్ఛార్జ్‌లు మారిపోయారు. ఆ ముగ్గురూ కూడా… త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ అంటూ భారీ స్టేట్‌మెంట్సే ఇచ్చేశారు. నాయకులతో ఉరికించి ఉరికించి పని చేయించారు. కానీ.. ఇస్తామన్న పదవుల ఊసు మాత్రం లేదు. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాక… లోక్‌సభ ఎలక్షన్స్ వచ్చాయి. వాటి తర్వాత పదవుల భర్తీ అన్నారు. అయినా జరగలేదు. తర్వాత దసరా, శ్రావణ మాసం, ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో ఏఐసీసీ బిజీ అని చెప్పారు. అన్ని ముహూర్తాలు ముగిసిపోయాయిగానీ… పదవుల పంపకం మాత్రం జరగలేదు. వాళ్ళు చెప్పిన శ్రావణ మాసం అయిపోయి మరోటి కూడా వచ్చేసింది.
ఏడాదిన్నరగా నామినేటెడ్ పోస్ట్‌ల భర్తీకి అతీగతీ లేదు. ఇప్పుడు ఇన్ఛార్జ్‌గా ఉన్న మీనాక్షి నటరాజన్ కూడా… వచ్చిన కొత్తలో పదవుల భర్తీ అంటూ ఊరించారు. ఆమె అయితే… ఇంకో అడుగు ముందుకేసి పాత వారికే పదవులని చెప్పేశారు కూడా. నామినేటెడ్‌తో పాటు పార్టీ పోస్ట్‌లను కూడా భర్తీ చేస్తామన్నారామె. ఆ డైలాగ్స్ కూడా ఇంతవరకు అమల్లోకి రాలేదు. తీరా… ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అడ్డు వచ్చాయని చెప్తున్నారు. దీంతో ఇంకెన్నాళ్ళిలా సాగదీస్తారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. వాస్తవంగా… ప్రభుత్వం మొదట చెప్పినప్పుడే నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసి ఉంటే…..ఈ పాటికి ఒక టర్మ్ పూర్తవుతూ ఉండేది. ఇంకో టర్మ్‌లో మరి కొంత మందికి ఇవ్వడానికి ఛాన్స్ దక్కేది.
అలా వీలైనంత ఎక్కువ మందికి పదవులు దక్కేవి. కానీ… ఎప్పటికప్పుడు వాయిదాల పర్వం నడుస్తుండటంతో… అటు పోస్ట్‌లు ఖాళీగా ఉండి, ఇటు ఎదురుచూసేవాళ్ల సంఖ్య పెరిగిపోతూ… మొత్తంగా కాంగ్రెస్ పార్టీలోనే ఒక విధమైన అసహనపు వాతావరణం కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఒక దశలో డైరెక్టర్స్ పదవులు భర్తీ చేద్దాం… లిస్ట్ సిద్ధం చేయండని కూడా ప్రకటించారు. ఆ విషయంలో ఇప్పటికి PCC చీఫ్ మహేష్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్‌తో వరుస భేటీలు జరిపారు. అయినా రిజల్ట్ కనిపించకపోగా… మళ్ళీ సేమ్ డైలాగ్. త్వరలోనే పదవుల భర్తీ అని. దీంతో ఆశావహుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందట. చెప్పడానికి మీకు ఏమీ అనిపించకున్నా… వినడానికి మాకు మాత్రం ఏదోలా ఉందని అంటున్నారట. కొందరైతే… అరిగిపోయిన రికార్డ్‌ని ఎన్ని సార్లు ప్లే చేస్తారంటూ నిష్టూరంగా అంటున్నట్టు సమాచారం. అలా మొత్తంగా తెలంగాణలో నామినేటెడ్ పోస్ట్‌ల భర్తీ అన్నది ఒక పెద్ద ప్రహసనంగా మారిపోయింది.
