పార్టీ చెప్పింది వినాలి…చెయ్యమన్నది చెయ్యాలి…అంతర్గత కుమ్ములాటలు విడిచిపెట్టాలి…ఈటల రాజేందర్, బండి సంజయ్ సయోధ్యలో అధిష్టాన పెద్దలు ఇవే మాటలు చెప్పారా? కుస్తీ వదిలి దోస్తీ కట్టాల్సిందేనని ఉపదేశించారా? ఉప్పు-నిప్పులా వ్యవహరించిన ఈటల, బండి సంజయ్ మధ్య రాజీ ఎలా కుదిరింది? ఈటల ఇంట్లో అసలేం జరిగింది? తెలంగాణ బీజేపీలో కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మధ్య విభేదాలు బహిరంగ రహస్యం. ఇద్దరి మధ్య పార్టీలో కోల్డ్ వార్ పీక్ లెవల్‌లో వుంటే, అటు ఇరువురు నేతల అనుచరుల సోషల్ మీడియా యుద్ధం ఎప్పుడో హద్దులు దాటింది. దుష్రచారం చేసుకుంటూ పతాకస్థాయికి వైరం వెళ్లిపోయింది. ప్రచ్చన్నయుద్ధం వెళ్లిపోయింది. పార్టీ పెద్దలు ఎన్నిసార్లు సర్దిజెప్పినా తీరు మారలేదు. ఆ ఇద్దరు నేతల మధ్య ఎందరో కార్యకర్తలు నలిగిపోయారు. కరవమంటే కప్పకు కోపం…విడవమంటే పాముకి కోపంలా కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారు. ఆ ఇద్దరు నేతల విభేదాలతో పార్టీకి నష్టం జరుగుతుందన్న బాధ శ్రేణుల్లో వుండేది. ఆ ఇద్దరు నేతలు కలిస్తే పార్టీ సీన్ మారుతుంది అనే ఆశ వారిలో అంతాఇంతాకాదు. ఎడమొహం పెడమొహంలా వీరిని ఇలాగే వదిలేస్తే, పార్టీకే నష్టమని భావించిన బీజేపీ అధిష్టానం…ఇప్పుడు రంగంలోకి ప్యాచప్ వర్క్ కు అడుగేసింది.
బీజేపీలో కీలక డెవలప్ మెంట్ ఇది. నువ్వానేనా అనే రీతిలో కీచులాడుకున్న బండి సంజయ్, ఈటల రాజేందర్ కలిసిపోయారు. కాదు కాదు ఆ ఇద్దరు నేతలను పార్టీ పెద్దలు కలిపారు. కలిసి కూర్చోబెట్టారు. మాట్లాడుకున్నారు. కలిసి పని చేయాలని చెప్పారు. ఎవరికి వారే యమునా తీరే గా ఉన్న బండి, ఈటల మాట్లాడుకున్నారు. బయటకు వచ్చి కౌగిలించుకున్నారు. నవ్వుకున్నారు. తాము ఒకటయ్యామనే ఫీలింగ్ ఇచ్చారు. ఇందుకు పార్టీ ఢిల్లీ పెద్దలు సునీల్ బన్సల్, అభయ్ పాటిల్‌లు చొరవ తీసుకున్నారు. అభయ్ పాటిల్ నేతలతో విడి విడిగా మాట్లాడారు. ఈటెల ఇంటికి వెళ్ళారు. పార్టీ చెప్పింది వినాల్సిందేనని ఇద్దరు నేతలకూ కరాఖండిగా చెప్పారు. గతాన్ని వదిలేసి, పార్టీ కోసం ఇరువురూ కలిసి పని చెయ్యాలని కర్తవ్యబోధ చేశారు. ఇందుకు ఇద్దరూ ఓకే చెప్పారట. ఆయన వారితో ఏమీ మాట్లాడారో…ఏమీ చెప్పారో కానీ…ఎట్టకేలకు ఆ ఇద్దరినీ ఒకచోట కూర్చొని మాట్లాడుకునేలా చేశారు. దీంతో ఇద్దరి వైరానికి తెరపడినట్టయ్యింది. అయితే, బండి సంజయ్, ఈటల రాజేందర్‌ల మధ్య నిజంగా సయోధ్య కుదిరిందా? ఇరువురి మధ్య కోల్డ్ వార్ గతమేనా? లేదంటే పార్టీ పెద్దల ముందు కలిసినట్టు కలరింగ్ ఇచ్చారా…నిజంగా మున్ముందు ఒకే వేదిక నుంచి మాట్లాడతారా, కలిసి కార్యక్రమాలు చేస్తారా అన్న ప్రశ్నలకు సమాధానం మున్ముందే తెలియాలి.

